Begin typing your search above and press return to search.

గంటకు 150 కి.మీ... టీమ్‌ఇండియా వైపు దూసుకొస్తున్న 17 ఏళ్ల కుర్రాడు

తమిళనాడుకు చెందిన ఆర్‌డీ ప్రణవ్‌ రాఘవేంద్ర ప్రత్యేకత.. భారత అండర్‌-19 క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతి వేసిన బౌలర్‌ కావడం.

By:  Tupaki Desk   |   12 Jun 2025 8:00 AM IST
గంటకు 150 కి.మీ... టీమ్‌ఇండియా వైపు దూసుకొస్తున్న 17 ఏళ్ల కుర్రాడు
X

ఆ కుర్రాడి వయసు 17 ఏళ్లే.. నూనూగు మీసాల ప్రాయం.. కానీ.. బంతి అందుకున్నాడంటే అరివీర భయంకరమే.. చిన్నతనంలో స్ప్రింటర్ కావాలని అనుకున్నాడు... భూమ్మీద అత్యంత వేగవంతమైనదిగా చెప్పుకొనే 100 మీటర్ల పరుగు పందేన్ని కేవలం 13.76 సెకన్లలో పూర్తి చేశాడు. కానీ, క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు... అయితేనేం.. రేస్‌ ట్రాక్‌ మీద చూపిన వేగాన్ని క్రికెట్‌ గ్రౌండ్‌లోనూ చూపుతున్నాడు. టీమ్‌ ఇండియా వైపు దూసుకొన్నాడు.

ప్రస్తుతం దేశవాళీ అండర్‌ 19 క్రికెట్‌లో మూడు పేర్లు మార్మోగుతున్నాయి. ఒకరు 14 ఏళ్ల బిహారీ బాలుడు వైభవ్‌ సూర్యవంశీ, రెండు 17 ఏళ్ల ముంబై కుర్రాడు ఆయుష్‌ మాత్రే. అయితే, వీరిద్దరూ బ్యాట్స్‌మెన్‌. కలిసి ఓపెనింగ్‌ చేయబోతున్నారు. మరి మూడో ఆటగాడు ఎవరు? అంటారా? అతడే తమిళనాడుకు చెందిన ఆర్‌డీ ప్రణవ్‌ రాఘవేంద్ర. పైన చెప్పుకొన్న ఫాస్ట్‌ బౌలింగ్‌ సంచలనమే ఈ రాఘవేంద్ర.

తమిళనాడుకు చెందిన ఆర్‌డీ ప్రణవ్‌ రాఘవేంద్ర ప్రత్యేకత.. భారత అండర్‌-19 క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతి వేసిన బౌలర్‌ కావడం. ఇటీవల ఓ టోర్నీలో గంటకు 147.3 కిమీ వేగంతో బంతిని విసిరాడు ప్రణవ్‌. ఏజ్‌ గ్రూప్‌ క్రికెట్‌లో ఇది రికార్డు. దీంతో భవిష్యత్‌లో ప్రణవ్‌ గంటకు 150 కిలోమీటర్ల వేగం అందుకోగల సత్తా ఉన్నవాడిగా అందరూ అతడిని గుర్తించారు. ఇప్పటికి 17 ఏళ్లు మాత్రమే అయినప్పటికీ బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్న ఇతడి వేగాన్ని చూసిన అది అతడికే సాధ్యం అని అంటున్నారు. మరింత సానబెడితే టీమ్‌ ఇండియాకు ఎంపిక ఖాయం అని అంచనా వేస్తున్నారు.

అయితే, ప్రణవ్‌ది గాలివాటం వేగం కాదు. కొంతకాలంగా ఇదే వేగం కొనసాగిస్తున్నాడు. అందుకే త్వరలో 150 కిలోమీటర్లను అందుకుంటాడని భావిస్తున్నారు. అదే జరిగితే.. ఉమ్రాన్‌ మాలిక్‌ (కశ్మీర్‌), మయాంక్‌ యాదవ్‌ (ఉత్తరప్రదేశ్‌) సరసన చేరతాడు ప్రణవ్‌. ఇక్కడ మరొక విషయం ఏమంటే..150 కిలోమీటర్ల వేగం అంటే మామూలు కాదు. దీనికి ముఖ్యంగా గాయల బెడద ఎక్కువ. అందులోనూ భారత బౌలర్లలో మాలిక్‌, మయాంక్‌ వంటి వారు తప్ప ఈ వేగాన్ని చేరలేదు. వారిద్దరూ తీవ్ర గాయాల బాధితులే.

అసలు భారత ఆరిజన్‌లో 150 కిలోమీటర్ల వేగం అందుకోగల పేసర్లు పుట్టడమే తక్కువ. ఒకవేళ అందుకున్నా.. నిలబెట్టుకోడం ముఖ్యం. గాయాలకు తోడు ఫామ్‌, ఫిట్‌నెస్‌ ఇలా ఎన్నో సవాళ్లుంటాయి. ఇప్పటికైతే ఈ విషయాల్లో ప్రమాణాలను అందుకోగల వాడిగా ప్రణవ్‌ ఆశలు రేపుతున్నాడు. రెండేళ్లలోనే అతడు 130 నుంచి 147 కిలోమీటలర్లకు తన వేగాన్ని పెంచుకోవడమే దీనికి నిదర్శనం.

కాగా, ఇంగ్లండ్‌లో పర్యటించనున్న భారత అండర్‌ 19 జట్టుకు వైభవ్‌, ఆయుష్‌తో పాటు ప్రణవ్‌ కూడా ఎంపికయ్యాడు. పేస్‌ పిచ్‌లకు నెలవైన ఇంగ్లండ్‌లోనే ప్రణవ్‌ 150 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెల 27 నుంచి మొదలయ్యే ఈ టూర్‌లో యువ భారత జట్టు రెండు టెస్ట్‌లు, ఐదు వన్డేలు ఆడనుంది. ప్రణవ్‌ ప్రస్తుతం బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో శిక్షణ పొందుతున్నాడు. వేగంగా బంతులేయడమే కాదు.. రాకాసి బౌన్సర్లతో బ్యాటర్లను భయపెట్టడాన్ని చాలా ఇష్టపడుతూ.. బ్యాటర్ల గ్లోవ్స్‌ను టార్గెట్‌ చేయాలని చూస్తాడు. అతడి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పడమే మన పని.