Begin typing your search above and press return to search.

ఆ జట్టు మ్యాచ్ లకే రికార్డు వ్యూస్..టైటిల్ కొట్టకుంటే విడాకులిచ్చేంత

17 సీజన్లలో ఒక్కసారీ కప్ కొట్టకున్నా, ప్రతిసారీ ఫేవరెట్ గా బరిలో దిగి చేతులెత్తేసినా.. ఇప్పుడు మాత్రం కప్ దానిదే అంటున్నారు క్రికెట్ దిగ్గజాలు.

By:  Tupaki Desk   |   5 May 2025 5:30 PM
RCB Breaks Streaming Records, Eyes IPL Glory at Last
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ సాలా.. ఆ జట్టు జోష్ మామూలుగా లేదు. 17 సీజన్లలో ఒక్కసారీ కప్ కొట్టకున్నా, ప్రతిసారీ ఫేవరెట్ గా బరిలో దిగి చేతులెత్తేసినా.. ఇప్పుడు మాత్రం కప్ దానిదే అంటున్నారు క్రికెట్ దిగ్గజాలు.

తొలి సీజన్ నుంచి కొనసాగుతున్నప్పటికీ ఒక్కసారీ టేబుల్ టాపర్ గా నిలవని ఆ జట్టు 18వ సీజన్ లో దానిని సాకారం చేసింది. ఈ సారి టైటిల్ కొట్టేయడమే మిగిలింది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి 18 ఏళ్ల కుర్రాడిగా ఉన్నప్పటి నుంచి కొనసాగుతున్న జట్టు. కానీ, ఒక్కసారీ కప్ కొట్టలేకపోయింది. ఈ సీజన్ కు అనూహ్యంగా రజత్ పటీదార్ ను కెప్టెన్ గా ప్రకటించి.. కాస్త కూర్పు భిన్నంగా ఉండేలా చూసుకుని బరిలో దిగి దుమ్మురేపుతోంది.

స్వయంగా కోహ్లి సూపర్ ఫామ్ లో ఉండడంతో ఆర్సీబీ టాప్ గేర్ లోకి వెళ్తోంది. కాగా, ఆర్సీబీ మ్యాచ్ లకు ఈ సీజన్ లో భారీ వ్యూయర్ షిప్ ఉందట. ప్రస్తుత సీజన్ లో జియో హాట్ స్టార్ లో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 4 మ్యాచ్ లు ఆర్సీబీవే కావడం విశేషం.

సీజన్ తొలి మ్యాచ్ ను డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో ఆడింది బెంగళూరు. దీనికి 41.7 కోట్ల వ్యూస్ వచ్చాయి. చెన్నైతో ఆడిన 8వ మ్యాచ్ కి 37.2 కోట్లు, ముంబైతో తలపడిన మ్యాచ్ కు 34.7 కోట్లు, మళ్లీ చెన్నైతో మ్యాచ్ కు 34.6 కోట్ల వ్యూస్ వచ్చాయి.

కప్ గెలవకుంటే విడాకులేనంట..

ఈ సాలా కప్ నమదే.. (ఈ ఏడాది కప్ మనదే) ప్రతి సంవత్సరం ఆర్సీబీ అభిమానుల నినాదం ఇది. ఇన్నాళ్లూ తీరకున్న ఈ ఏడాది మాత్రం నెరవేరడం ఖాయం అంటున్నారు క్రికెట్ పండితులు. మరోవైపు ఆర్సీబీ ఈసారి కప్ కొట్టకుంటే తన భార్యకు విడాకులు ఇచ్చేస్తానని ఓ అభిమాని వ్యాఖ్యానించాడు. ఆ సమయంలో అతడి భార్య పక్కనే ఉండడం గమనార్హం. ఈ వీడియోపై అభిమానులు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

ఓ కాపురం నిలవడం, విడిపోవడం అనేది ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ సాధించడం మీద ఆధారపడి ఉందన్నమాట.