ఐపీఎల్ ఫైనల్.. ఆ నగరంలో ’సెలవిచ్చేశారు’..
17 సీజన్లలో మూడుసార్లు ఫైనల్ చేరినా.. కప్ కొట్టలేకపోయింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.
By: Tupaki Desk | 3 Jun 2025 5:01 PM ISTఅసలే టెక్ నగరం.. అందులోనూ ఆ నగరానికి చెందిన జట్టు ఐపీఎల్ ఫైనల్ చేరింది.. ఈ సారి కప్ కొట్టేలా ఉంది.. ఉద్యోగుల్లో లక్షల మంది అభిమానులు.. ఇలాంటి సమయంలో తమ ఉద్యోగులు విధుల్లో ఉన్నా పెద్దగా ఫలితం ఉండదని భావించారేమో..? కొన్ని కంపెనీలు మంగళవారం సెలవిచ్చేశాయి. మరికొన్ని సంస్థలు అయితే ఆఫీసుల్లోనే భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశాయి.
కర్ణాటక రాజధాని బెంగళూరు అంటే భారత సిలికాన్ వ్యాలీ. లక్షల మంది ఐటీ ఉద్యోగులతో పాటు భారీఎత్తున అభిమానులు బెంగళూరు సొంతం. అందుకే ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ఉద్యోగుల డిమాండ్ మేరకు కొన్ని ఐటీ, వివిధ రంగాల్లోని సంస్థలు మంగళవారం సెలవు ప్రకటించాయి. మరికొన్ని బహుళ జాతి సంస్థల్లో భారీ స్క్రీన్లు పెట్టి ఉద్యోగులను శాంతపరిచే ప్రయత్నాలు చేస్తున్నాయి.
17 సీజన్లలో మూడుసార్లు ఫైనల్ చేరినా.. కప్ కొట్టలేకపోయింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. 18 సీజన్ లో ఈసారి ఎలాగైనా కప్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కాగా ఇప్పటికే కర్ణాటక కుర్రాడు ఒకరు బెంగళూరు ఐపీఎల్ ఫైనల్ చేరినందున మంగళవారం సెలవు ప్రకటించాలని సీఎం సిద్ధరామయ్యకే లేఖ రాశాడు. మరోవైపు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా బెంగళూరు ఐపీఎల్ చాంపియన్ కావాలని బలంగా కోరుకుంటున్నట్లు ప్రకటించారు.
ఇక మంగళవారం ఫైనల్లో ఎవరు గెలిచినా ఐపీఎల్ లో కొత్త చాంపియన్ అన్న సంగతి తెలిసిందే. బెంగళూరు ప్రత్యర్థి పంజాబ్ కింగ్స్ కు ఇది ఐపీఎల్ లో రెండో ఫైనల్. 2014లో చివరిగా ఆ జట్టు ఫైనల్ ఆడింది. ఆర్సీబీ 2016లో చివరగా ఫైనల్ చేరింది.
