చాట్ జీపీటీ: ఈ సాలా ఐపీఎల్ కప్ ఆర్సీబీదే.. కాదంటే నా భర్తకు విడాకులు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. పేరులో రాయల్ ఉన్న ఈ జట్టు 17 ఏళ్లుగా ఐపీఎల్ టైటిల్ ను కొట్టలేకపోతోంది.
By: Tupaki Desk | 30 May 2025 4:35 PM ISTరాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. పేరులో రాయల్ ఉన్న ఈ జట్టు 17 ఏళ్లుగా ఐపీఎల్ టైటిల్ ను కొట్టలేకపోతోంది. ఈ సారి మాత్రం ముందుగానే ప్లేఆఫ్స్ బెర్తు, ఆపై ఫైనల్ బెర్తు ఖాయం చేసుకుంది. మరి ఈ సీజన్ తో కలిపి ఆర్సీబీ టైటిల్ కల నెరవేరుతుందా...?
వాస్తవానికి ఐపీఎల్ లో 2011లో ప్లేఆఫ్స్ పద్ధతి ప్రవేశపెట్టారు. అంటే.. లీగ్ దశలోని టాప్ 4 జట్లు.. క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 ఆడతాయి. క్వాలిఫయర్ 1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఇందులో ఓడిన జట్టు.. ఎలిమినేటర్ లో నెగ్గిన జట్టుతో క్వాలిఫయర్ 2 ఆడుతుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు ఫైనల్ కు వెళ్తుంది.
చరిత్ర చూస్తే ఎక్కువసార్లు క్వాలిఫయర్-1లో నెగ్గిన జట్టే టైటిల్ ను కూడా కొట్టేసింది. 2011లో ప్లేఆఫ్స్ వచ్చాక గత 14 సీజన్లలో ఏడు సార్లు ఇదే జరిగింది. మరి ఈసారి కూడా క్వాలిఫయర్ 1లో గెలిచిన ఆర్సీబీనే చాంపియన్ గా నిలుస్తుందా? 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతుందా? ఇదే ప్రశ్న సంచలనాల ’చాట్ జీపీటీ’ని అడిగితే ఏమన్నదో తెలుసా?
అనేక ప్రత్యకతలతో మొదలై.. ఆఖరికి భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా చరిత్రలో తొలిసారిగా ఆగిపోయిన ఐపీల్-18 విజేత రాయల్ చాలెంజర్స్ బెంగళూరేనని చాట్ జీపీటీ తేల్చింది. ఆ జట్టు ఫామ్, ప్రదర్శనను కొలమానంగా తీసుకుని ఈ అంచనా వేసింది. మరి ముంబై ఇండియన్స్, గుజరాత్ గురించి ఏం చెప్పింది?
ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ విషయంలో చాట్ జీపీటీ కాస్త భిన్నమైన సమాధానం ఇచ్చింది. పదేపదే ఆటగాళ్లను మార్చడం ముంబైకి చేటు చేస్తోందని పేర్కొంది.
గుజరాత్ టైటాన్స్ కు కీలక ఆటగాళ్లు దూరం కావడం దెబ్బకొట్టనుందని పేర్కొంది. అయితే, చాట్ జీపీటీ లీగ్ దశ పాయింట్ల టాపర్ అయిన పంజాబ్ కింగ్స్ గురించి మాత్రం ప్రస్తావించలేదు. క్వాలిఫయర్ 1లో చిత్తుగా ఓడిన ఈ జట్టు ఎలిమినేటర్ విజేతతో ఆడాల్సి ఉంది.
ఇక ఆర్సీబీ ఐపీఎల్ కప్ కొట్టడం గురించి గురువారం నాటి మ్యాచ్ సందర్భంగా ఓ మహిళ చేసిన ప్రకటన వైరల్ అవుతోంది. ఈ ఏడాది గనుక బెంగళూరు కప్ నెగ్గకుంటే తన భర్తకు విడాకులు ఇస్తానని ఆమె గ్రౌండ్ లో ప్లకార్డు ప్రదర్శించింది. ఇందులో చిరాయు హో (లాంగ్ లివ్ కోహ్లి) అని ఉంది. ఇదంతా హిందీలో రాసి ఉంది. అంటే.. ఆమె బెంగళూరు మహిళ కాదని చాలామంది భావిస్తున్నారు. మొత్తానికి ఆ మహిళ ప్రదర్శించిన ప్లకార్డుపై అభిమానులు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
