నాలుగోసారి ఐపీఎల్ ఫైనల్‌కు..! ఈ సాలా కప్ నమదేనా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో అద్భుత ఆటతీరు కొనసాగిస్తూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ కు చేరింది.
By: Tupaki Desk | 30 May 2025 9:20 AM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో అద్భుత ఆటతీరు కొనసాగిస్తూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ కు చేరింది. ఇక మరొక్క అడుగే..! అది కూడా సాధించేస్తే 18 ఏళ్లలో తొలిసారిగా లీగ్‌లో చాంపియన్‌గా నిలిచిన రికార్డును సొంతం చేసుకుంటుంది.క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ వంటి బ్యాటర్లు, మిచెల్ స్టార్క్ వంటి బౌలర్లు ప్రాతినిధ్యం వహించినా బెంగళూరు 17 సీజన్లలో ఒక్కసారీ కప్ కొట్టలేకపోయింది. ప్రతి ఏడాది ఈ సాలా కప్ నమదే (ఈసారి కప్ మనదే) అంటూ బరిలో దిగడం ఉత్త చేతులతో వెనుదిరగడం పరిపాటిగా మారింది.
ఆ మూడుసార్లు..
ఐపీఎల్‌లో బెంగళూరు కప్ కొట్టలేకపోవచ్చు కానీ.. మంచి జట్టే అనే పేరుంది. కానీ, కప్ కొట్టే సత్తా ఉన్న జట‍్టుగా మాత్రం పేరులేదు. విరాట్ కోహ్లి వంటి స్టార్ బ్యాటర్ మొదటి సీజన్ నుంచి ఆడుతున్నా.. బెంగళూరుకు టైటిల్ దక్కలేదు. అయితే, గతంలో మూడుసార్లు చాంపియన్ గా నిలిచే వరకు వెళ్లింది ఆర్సీబీ. అది కూడా ఐపీఎల్ రెండో సీజన్‌లోనే కావడం గమనార్హం. భారత్‌లో సార్వత్రిక ఎన్నికల కారణంగా 2009 ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. నాడు ఫైనల్ చేరిన ఆర్సీబీ.. హైదరాబాద్ జట్టు దక్కన్ చార్జర్స్ చేతిలో ఓడింది.
-2009లో విఫలమైనా నిరాశ చెందకుండా.. 2011లోనూ ఆర్సీబీ అద్భుతమైన ఆటతో ఫైనల్ వరకు వచ్చింది. కానీ, చెన్నై సూపర్ కింగ్స్‌ను బీట్ చేయలేకపోయింది. మూడేళ్లలో రెండోసారి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
అన్నిటికంటే హైలైట్.. 2016
ఆర్సీబీ ఆడిన అన్ని సీజన్లలోనూ హైలైట్ అంటే 2016 అనే చెప్పాలి. తొమ్మిదేళ్ల కిందట అద్భుతమైన ఫిట్‌నెస్‌తో కోహ్లి.. చెలరేగాడు. నాలుగు సెంచరీల, ఏడు హాఫ్ సెంచరీలతో 973 పరుగులు సాధించాడు. దీంతో బెంగళూరు సునాయాసంగా లీగ్ ఫైనల్ చేరింది. కానీ, ఒకప్పటి దక్కన్ చార్జర్స్- ప్రస్తుత సన్ రైజర్స్ రూపంలో అడ్డంకి వచ్చింది.
-ఇక ఈ సీజన్‌లో బెంగళూరు మళ్లీ ఫైనల్‌కు వచ్చింది. లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో అదరగొట్టిన ఆర్సీబీ..క్వాలిఫయర్స్‌లో మరింత చెలరేగింది. ఈ ఊపు చూస్తే ఈ సాలా కప్ నమదే అనే మాట నిజమయ్యేలా కనిపిస్తోంది. కోహ్లి కూడా 614 పరుగులతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇతర బ్యాటర్లు మంచి ఫామ్ చాటుతున్నారు. మరి ఇప్పుడైనా బెంగళూరు కల నెరవేరుతుందా?
