Begin typing your search above and press return to search.

టీమిండియాలో ఫీల్డింగ్ మేధావి ఎవరో తెలుసా..?

ఇప్పుడంటే ఐపీఎల్ వచ్చింది.. భారత ఆటగాళ్ల ఫిట్ నెస్ ప్రమాణాలు పెరిగాయి. అధునాతన టెక్నాలజీ కూడా అందుబాటులోకి రావడం క్రికెటర్ల ఫిట్ నెస్ కు బాగా ఉపయోగంగా మారింది.

By:  Tupaki Desk   |   24 Nov 2023 4:30 PM GMT
టీమిండియాలో ఫీల్డింగ్ మేధావి ఎవరో తెలుసా..?
X

ఇప్పుడంటే ఐపీఎల్ వచ్చింది.. భారత ఆటగాళ్ల ఫిట్ నెస్ ప్రమాణాలు పెరిగాయి. అధునాతన టెక్నాలజీ కూడా అందుబాటులోకి రావడం క్రికెటర్ల ఫిట్ నెస్ కు బాగా ఉపయోగంగా మారింది. మైదానంలో చురుగ్గా కదులుతూ, క్యాచ్ లను అందుకుంటూ, టీమిండియా ఆటగాళ్లు భళా అనిపిస్తున్నారు. మొత్తమ్మీద ఇద్దరు, ముగ్గురు క్రికెటర్లు తప్ప భారత జట్టులోని వారంతా మంచి ఫీల్డింగ్ నైపుణ్యాలు ఉన్నవారే. కానీ, 20 ఏళ్ల కిందట చూస్తే ముగ్గురు, నలుగురో మెరికల్లాంటి ఫీల్డర్లు ఉండేవారు. అదే 30 ఏళ్ల కిందటైతే.. అజహరుద్దీన్, అజయ్ జడేజా, రాబిన్ సింగ్ వంటి వారే గొప్ప ఫీల్డర్లు. మిగతా సభ్యులంతా సో సోనే.

యోయో.. చాలా కఠినమయో

టీమిండియా ఆటగాళ్లు జట్టులోకి ఎంపికయ్యేందుకు యోయో ఫిట్ నెస్ ప్రామాణికం. 2018లో ఈ టెస్టులో విఫలమైనందునే హైదరాబాదీ అంబటి రాయుడు జట్టులోకి ఎంపిక కాలేకపోయాడు. ఫిట్ నెస్ పరంగా యోయో టెస్టులో పాసవడం కాస్త కష్టమనే అభిప్రాయం ఉంది. కానీ, పోటీ క్రికెట్ లో రాణించాలంటే ఈ మాత్రం ప్రమాణాలు తప్పనిసరి. మరోవైపు ప్రస్తుతం టీమిండియాలో అద్భుతమైన ఫీల్డర్ ఎవరంటే గుర్తొచ్చేది రవీంద్ర జడేజా. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా అద్భుత ఫీల్డరే.

అప్పట్లో ఆ జడేజా.. ఇప్పడు ఈ జడేజా

టీమిండియాకు 1990 నుంచి 2000 వరకు ప్రాతినిధ్యం వహించాడు అజయ్ జడేజా. అద్భుత ఫీల్డింగ్ కు అతడు పెట్టింది పేరు. మహరాజా రంజిత్ సింగ్ (భారత రంజీ క్రికెట్ కు ఈయన పేరే పెట్టారు) వంశానికి చెంది అజయ్ జడేజా హరియాణ తరఫున ఆడాడు. తర్వాత ఢిల్లీకి మారాడు. ఓ దశలో కొన్ని మ్యాచ్ లకు టీమిండియా కెప్టెన్ అయ్యాడు. అయితే. అప్పటి కెప్టెన్ అజహరుద్దీన్ తో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడన్న ఆరోపణలపై నిషేధం ఎదుర్కొన్నాడు. అలా మేటి ఫీల్డర్, మంచి బ్యాట్స్ మన్ అయిన అజయ్ జడేజా క్రికెట్ కెరీర్ అర్ధంతరంగా ముగిసింది. కాగా, ఆ పెద్ద జడేజా లాగానే టీమిండియా మరో మెరికలాంటి ఫీల్డర్ రవీంద్ర జడేజా రూపంలో దొరికాడు. పోటీ క్రికెట్లో అత్యుత్తమ ఫీల్డర్‌ గా ఉండటం అదనపు ప్రయోజనం. క్యాచ్‌ లు పట్టడం, త్రో విసరడం మాత్రమే ఫీల్డింగ్‌ కాదు. బంతి కోసం ఆసక్తిగా ఎదురుచూడటం.. చురుకుదనం.. దృక్పథానికి సంబంధించిన విషయం. ప్రతి బంతిని సవాలుగా కాకుండా అవకాశంగా భావించాలి. దీనిని తుచ తప్పకుండా ఆచరిస్తూ వచ్చినవాడే రవీంద్ర జడేజా. అందుకనే భారత ఫీల్డింగ్ కోచ్, హైదరాబాద్ మల్కాజ్ గిరికి చెందిన దిలీప్.. టీమిండియా ఫీల్డింగ్ మేధావి రవీంద్ర జడేజాను కొనియాడాడు. అయితే, కోహ్లి ఫీల్డింగ్ కూడా బాగుంటుందని.. అది ప్రత్యేకంగా, స్ఫూర్తిమంతంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. రవీంద్ర జడేజా మాత్రం అత్యుత్తమ ఫీల్డింగ్‌ కు మరింత మెరుగలద్దినట్లు ఉంటాడని చెప్పుకొచ్చాడు.

యూట్యూబ్ లో వీడియోలు

రవీంద్ర జడేజా ఫీల్డింగ్ విన్యాసాలకు సంబంధించి యూట్యూబ్ లో చాలా వీడియోలు ఉన్నాయి. వీటిలో అతడు అద్భుత డైరెక్ట్ త్రోలతో రనౌట్ చేసినవే ఎక్కువ. మరోవైపు దిలీప్.. టీమిండియాకు ప్రపంచ కప్ లోనూ ఫీల్డింగ్ కోచ్ గా వ్యవహరించాడు. ఫీల్డింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాడికి అవార్డు ప్రదానంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటర్‌, బౌలర్ తరచూ అవార్డులు అందుకుంటారు. ఫీల్డింగ్‌ లో కీలక పాత్ర పోషించే ఆటగాడికి ఎలాంటి గుర్తింపు లభించదని.. అందుకనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు దిలీప్ తెలిపాడు. క్యాచ్‌ లు, రనౌట్ లు కాకుండా.. ఆటగాడు మైదానంలో చూపే మొత్తం ప్రభావం, చురుకుదనం, కాపాడిన పరుగులు, ప్రత్యర్థిపై పెంచే ఒత్తిడిని బట్టి ఈ అవార్డును ఇచ్చారు.