ధోనీకీ తిక్కరేగుద్ది.. అప్పుడు మాట్లాడను.. టీమిండియా ఆల్ రౌండర్
తొలిసారి ధోనీని తాను బెరుకుబెరుకుగానే కలిసినట్లు జడేజా తెలిపాడు. ధోనీకి మూడ్ బాగోలేకుంటే అతడిని కలిసేందుకు ఇప్పటికీ తనకు బెరుకుగానే ఉంటుందని వివరించాడు.
By: Tupaki Desk | 29 May 2025 5:00 PM ISTటీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని అందరూ ’మిస్టర్ కూల్’ అంటారు.. ఎలాంటి పరిస్థితుల్లోనూ నిబ్బరం కోల్పోకపోవడం.. సహచరులపై విసుగు చూపకపోవడం.. మ్యాచ్ ఏ దశలోనూ ఆశ వీడకపోవడం.. కఠిన పరిస్థితుల్లోనూ గెలిపించడం.. ధోనీ ప్రత్యేకత. ఇది ఎన్నో సందర్భాల్లో రుజువైంది కూడా. కానీ, ధోనీకి కోపం వస్తుందని తెలుసా? అతడూ సహనం కోల్పోతాడని తెలుసా? మరి ఆ సందర్భంగా అతడికి అత్యంత సన్నిహితుడైన క్రికెటర్ ఏం చేస్తాడో తెలుసా?
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో పాటు 15 ఏళ్లుగా టీమ్ ఇండియాకు ఆడుతున్నాడు రవీంద్ర జడేజా. 2009లోనే జట్టులోకి వచ్చినా మధ్యలో ఫామ్ కోల్పోయి దూరమయ్యాడు. 2013 నుంచి ధోనీ నాయకత్వంలో తిరుగులేని ఆటగాడిగా ఎదిగాడు. అంతేగాక.. ధోనీతో కలిసి చెన్నై సూపర్ కింగ్స్ కు ఎన్నో విజయాలు అందించాడు. ధోనీ తర్వాత కెప్టెన్సీ కూడా చేపట్టాడు. అలా కెరీర్ ఆసాంతం ధోనీ నీడలో ఎదిగాడు జడేజా. తాజాగా తాను మొదటిసారి ధోనీని కలిసిన సందర్భాన్ని అతడు గుర్తుచేసుకున్నాడు.
బెరుకుబెరుకుగానే..
తొలిసారి ధోనీని తాను బెరుకుబెరుకుగానే కలిసినట్లు జడేజా తెలిపాడు. ధోనీకి మూడ్ బాగోలేకుంటే అతడిని కలిసేందుకు ఇప్పటికీ తనకు బెరుకుగానే ఉంటుందని వివరించాడు. 2005లో చాంపియన్స్ ట్రోఫీ కోసం ధోని ముంబై నుంచి చెన్నైకి విమానంలో వస్తుండగా, తానూ అదే విమానంలో ఉన్నట్లు తెలిపాడు. ఎకానమీ క్లాస్ లో ఉన్న తాను.. బిజినెస్ క్లాస్ లో ధోనీ ఉన్నట్లు తెలుసుకున్నానని చెప్పాడు. అప్పటికి కేవలం 17 ఏళ్ల కుర్రాడిని అయిన తాను.. పొడవైన జుట్టుతో ఉన్న ధోనీని కలవాలంటే భయపడినట్లు తెలిపాడు. తమ టీమ్ మేనేజర్.. ధోనీతో కలిసే మనం హోటల్ కు వెళ్తున్నామని చెప్పడంతో మరింత బెరుకుగా అనిపించిందన్నాడు. ధోనీ ఫోన్ పోగొట్టుకుని.. తిరిగి తెచ్చుకునే సమయంలో తాను వెళ్లిపోయినట్లు వివరించాడు.
నాటి విమానంలోనే కాదు.. ఇప్పటికీ ధోనీ సరైన మూడ్ లో లేకుంటే కలవడం, మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటానని జడేజా పేర్కొన్నాడు. ధోనీ ఏమీ అనకపోయినా.. అతడి ముఖంలో భావాలు అర్థం చేసుకోగలనని పేర్కొన్నాడు.
