Begin typing your search above and press return to search.

ఐదు ఫ్రాంచైజీల‌కు ఆడిన ఆ స్టార్ క్రికెట‌ర్ ఐపీఎల్ కు గుడ్ బై

ఐపీఎల్ లో అశ్విన్ ఐదు ఫ్రాంచైజీల‌కు ఆడిన ఘ‌న‌త అశ్విన్ సొంతం. 187 మ్యాచ్ ల‌లో 221 వికెట్లు తీశాడ‌త‌ను.

By:  Tupaki Desk   |   27 Aug 2025 11:55 AM IST
ఐదు ఫ్రాంచైజీల‌కు ఆడిన ఆ స్టార్ క్రికెట‌ర్ ఐపీఎల్ కు గుడ్ బై
X

అతికొద్ది మందికి మాత్ర‌మే సాధ్య‌మ‌య్యేలా రికార్డు స్థాయిలో ఐదు ఫ్రాంచైజీల‌కు ఆడిన స్టార్ క్రికెట్ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్)కు గుడ్ బై చెప్పాడు. గ‌త ఏడాది చివ‌ర్లో టెస్టు క్రికెట్ కు వీడ్కోలు ప‌లికిన అత‌డు ఇప్పుడు ఫ్రాంచైజీ క్రికెట్ నుంచి కూడా వైదొల‌గాడు. దీనికిముందు నుంచే అత‌డిని టీమ్ ఇండియా టి20, వ‌న్డే ఫార్మాట్ల‌కు ప‌రిగ‌ణ‌న లోకి తీసుకోవ‌డం లేదు. ఇప్పుడు ఐపీఎల్ కూ రారాం చెప్పినందున ఆ క్రికెట‌ర్ ఇక మ‌న‌కు గ్రౌండ్ లో క‌నిపించ‌డు.

అల్విదా.. ఆఫ్ స్పిన్ మాయావి...

టీమ్ ఇండియా మాజీ ఆఫ్‌ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఐపీఎల్ నుంచి వైదొల‌గుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. దిగ్గ‌జ లెగ్ స్పిన్న‌ర్ అనిల్ కుంబ్లే (619) త‌ర్వాత టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు సాధించిన భార‌త బౌల‌ర్ (537) అయిన అశ్విన్ గ‌త ఏడాది డిసెంబ‌రులో ఆస్ట్రేలియా టూర్ లో ఉండ‌గానే రిటైర్మెంట్ ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో డిసెంబ‌రు 6 నుంచి ఆడిలైడ్ లో జ‌రిగిన టెస్టే అత‌డికి చివ‌రిది. అయితే, అశ్విన్ ఐపీఎల్ కు అందుబాటులో ఉంటాడ‌ని భావించారు. ఈ ఏడాది సొంత న‌గ‌రానికి చెందిన చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్కే) త‌ర‌ఫున ఆడిన ఇత‌డిని వ‌చ్చే సీజ‌న్ కు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు ఇచ్చి అక్క‌డినుంచి కెప్టెన్ సంజూ శాంస‌న్ ను తీసుకురావాల‌నే ప్ర‌తిపాద‌నలు వ‌చ్చాయి. ఇవేమీ కార్య‌రూపం దాల్చకుండానే అశ్విన్ ఐపీఎల్ కు బైబై చెప్పాడు.

5 ఫ్రాంచైజీలు.. 221 మ్యాచ్ లు... 187 వికెట్లు

ఐపీఎల్ లో అశ్విన్ ఐదు ఫ్రాంచైజీల‌కు ఆడిన ఘ‌న‌త అశ్విన్ సొంతం. 187 మ్యాచ్ ల‌లో 221 వికెట్లు తీశాడ‌త‌ను. ఇక చెన్నై సూప‌ర్ కింగ్స్, పుణె సూప‌ర్ జెయింట్స్, పంజాజ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిట‌ల్స్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ల‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. 2009 నుంచి 2016 వ‌ర‌కు చెన్నై (పుణె)కే ఆడిన అశ్విన్ 2017 లో మాత్రం దూర‌మ‌య్యాడు. ఆ త‌ర్వాత రెండు సీజ‌న్లు పంజాబ్, రెండు సీజ‌న్లు ఢిల్లీ, మూడు సీజ‌న్లు రాజ‌స్థాన్ కు ఆడాడు. చివ‌ర‌గా ఈ ఏడాది చెన్నైకే ఆడి కెరీర్ ముగించాడు.

గేమ్ ఎక్స్ ప్లోర‌ర్ గా...

ఇక‌మీద‌ట గేమ్ ఎక్స్ ప్లోర‌ర్ గా కొన‌సాగుతాన‌ని అశ్విన్ ప్ర‌క‌టించాడు. అంటే, కామెంట్రీని ఎంచుకుంటాడేమో చూడాలి. క్రికెట్ నాలెడ్జ్ బాగా ఉన్నందున ఈ ఇంజ‌నీర్ ఎక్స్ ప్లోర‌ర్ గానూ రాణించే చాన్సుంది. టెస్టుల్లో 3,503 ప‌రుగులు చేసిన అశ్విన్ 6 సెంచరీలు, 14 హాఫ్‌ సెంచరీలు సాధించాడు. 116 వన్డేల్లో 156 వికెట్లు, 65 టీ20 మ్యాచుల్లో 72 వికెట్లు తీశాడు.

-అశ్విన్ చివ‌రి టి20 మ్యాచ్ 2022 టి20 ప్ర‌పంచ క‌ప్ లో, చివ‌రి వ‌న్డే మ్యాచ్ 2023 వ‌న్డే ప్రంప‌చ క‌ప్ లో ఆడాడు. 2024లో టెస్టుల నుంచి, 2025లో ఐపీఎల్ నుంచి వైదొల‌గాడు.