నా దేశం కోసమే ఆడతా.. భారత్, ఆస్ట్రేలియా పౌరసత్వ ఆఫర్లు.. తిరస్కరించిన రషీద్ ఖాన్
ఐపీఎల్ వంటి ప్రతిష్టాత్మక లీగ్‌లలో తన మాయాజాలంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ లెగ్ స్పిన్నర్‌కు భారత్ ,ఆస్ట్రేలియా వంటి అగ్రగామి దేశాల నుంచి పౌరసత్వం ఆఫర్లు రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
By: A.N.Kumar | 20 April 2026 10:00 PM ISTఅఫ్గానిస్థాన్ క్రికెట్ స్టార్ రషీద్ ఖాన్ తన దేశభక్తిని చాటుకుంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రీడా ప్రపంచంలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఐపీఎల్ వంటి ప్రతిష్టాత్మక లీగ్‌లలో తన మాయాజాలంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ లెగ్ స్పిన్నర్‌కు భారత్ ,ఆస్ట్రేలియా వంటి అగ్రగామి దేశాల నుంచి పౌరసత్వం ఆఫర్లు రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
దేశభక్తికి నిలువెత్తు రూపం.. రషీద్ ఖాన్ సంచలన వెల్లడి
ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న రషీద్ ఖాన్, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ సమయంలో తాను గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు.. ఒక ఉన్నత స్థాయి వ్యక్తి తనను కలిసి భారత పౌరసత్వం తీసుకోవాలని ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. "మీరు ఇక్కడే ఉండండి.. మీకు కావాల్సిన అన్ని పత్రాలు, వసతులు మేము చూసుకుంటాం" అని వారు ఆఫర్ చేశారని రషీద్ పేర్కొన్నారు.
ఆస్ట్రేలియా నుంచి కూడా అదే ప్రతిపాదన
కేవలం భారత్ మాత్రమే కాకుండా క్రికెట్ ప్రపంచంలో దిగ్గజ దేశంగా వెలుగొందుతున్న ఆస్ట్రేలియా కూడా రషీద్ ఖాన్ ప్రతిభను గుర్తించి తమ దేశ పౌరసత్వం ఇస్తామని ఆఫర్ చేసిందట. ఆ దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడితే అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని వారు సూచించినట్లు రషీద్ వెల్లడించారు. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లు తన కోసం ఎర్ర తివాచీ పరుస్తున్నా.. ఆయన తీసుకున్న నిర్ణయం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి, గౌరవానికి గురిచేస్తోంది.
నా దేశం కోసం కాకపోతే.. మరే దేశం కోసం ఆడను
అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న అఫ్గానిస్థాన్‌ను వీడి మెరుగైన సౌకర్యాలు.. భారీ ఆర్థిక ప్రయోజనాలు ఉన్న దేశాలకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ రషీద్ ఖాన్ వాటిని సున్నితంగా తిరస్కరించారు. “నేను నా దేశం (అఫ్గానిస్థాన్) తరఫున క్రికెట్ ఆడకపోతే, ప్రపంచంలో ఇంకే దేశం తరఫున కూడా ఆడను. నా దేశంతో నాకు ఉన్న అనుబంధం అటువంటిది. అఫ్గాన్ గడ్డపై పుట్టిన నేను, ఆ దేశం కోసమే పోరాడుతాను.”
ఈ మాటలు ఆయనకు తన మాతృభూమి పట్ల ఉన్న అంకితభావాన్ని చాటుతున్నాయి. అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు, అక్కడి ప్రజలకు రషీద్ ఒక ఆశాకిరణం లాంటివారు. అరాచక పరిస్థితులు, రాజకీయ అస్థిరత ఉన్నప్పటికీ, క్రికెట్ ద్వారా తన దేశానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడమే తన లక్ష్యమని ఆయన నిరూపించారు.
క్రీడా ప్రపంచంలో ప్రశంసల జల్లు
సాధారణంగా ఆటగాళ్లు మెరుగైన అవకాశాలు, సౌకర్యాల కోసం ఇతర దేశాలకు వలస వెళ్లడం మనం చూస్తుంటాం. కానీ, రషీద్ ఖాన్ వంటి గ్లోబల్ స్టార్ ఇలాంటి భారీ ఆఫర్లను వదులుకోవడం క్రీడా విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. కష్టకాలంలో దేశాన్ని వదిలిపెట్టకూడదనే ఆయన ధృడ నిశ్చయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం. అఫ్గాన్ జట్టు నేడు ఐసీసీ టోర్నీల్లో దిగ్గజ జట్లను ఓడిస్తోందంటే అందులో రషీద్ పాత్ర వెలకట్టలేనిది. ఈ వ్యాఖ్యలతో భారత్ , ఆస్ట్రేలియా అభిమానుల్లో కూడా ఆయనపై గౌరవం రెట్టింపు అయ్యింది.
డబ్బు, హోదా, సుఖవంతమైన జీవితం కంటే తన దేశ గౌరవమే ముఖ్యమని చాటిచెప్పిన రషీద్ ఖాన్, నిజమైన 'నేషనల్ హీరో' అనిపించుకున్నారు. అఫ్గానిస్థాన్ క్రికెట్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చడమే ధ్యేయంగా సాగుతున్న ఆయన ప్రయాణం మున్ముందు మరెన్నో మైలురాళ్లను అధిగమించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
