హైదరాబాద్ లో.. ఢిల్లీ క్యాపిటల్స్ 'పెద్ది'.. ఈ షాట్ కొట్టింది ఎవరబ్బా?
ఢిల్లీ జట్టు యువ బ్యాట్స్ మన్ సమీర్ రిజ్వీ సన్ రైజర్స్ తో మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చాడు. ప్రాక్టీస్ లో భాగంగా అతడు పెద్ది సినిమాలో రామ్ చరణ్ షాట్ ను కొట్టడం కనిపించింది.
By: Tupaki Desk | 5 May 2025 4:10 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం.. పెద్ది. టైటిల్ దగ్గర నుంచే అంచనాలను పెంచేసిన ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. ఉత్తరాంధ్ర యాసలో రామ్ చరణ్ (ఆర్సీ)
డైలాగులు రచ్చ లేపేలా ఉన్నాయి. ఇక మరీ ముఖ్యంగా టీజర్ లో ఆర్సీ బ్యాటింగ్ చేయడం ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది. అందులోనూ తనదైన స్టయిల్ లో క్రీజు విడిచి వచ్చిన అతడు బ్యాట్ ను పిచ్ పైన గుద్ది భారీ షాట్ కొట్టడం థియేటర్ లో విజిల్స్ వేయించేలా ఉంది. పెద్ది టీజర్ వచ్చి నెల రోజులు అవుతున్నా ఇప్పటికీ రామ్ చరణ్ కొట్టిన షాట్ ను రిపీటెడ్ గా చూస్తున్నవారు ఎందరో. ఇప్పుడు ఇదే షాట్ ను ఓ క్రికెటర్ తన ప్రాక్టీస్ లో చేయడం గమనార్హం.
ఐపీఎల్ లో ప్రస్తుత సీజన్ ను భారీ అంచనాలతో మొదలుపెట్టి.. తొలి మ్యాచ్ లోనే 286 పరుగుల భారీ స్కోర్ తో హైప్ కలిగించింది సన్ రైజర్స్ హైదరాబాద్. కానీ, ఇప్పుడు అత్యత దయనీయంగా పాయింట్ల టేబుల్ లో కింది నుంచి రెండో స్థానంలో ఉంది.
నిరుడు రన్నరప్ అయిన హైదరాబాద్ ఈ ఏడాది ప్లేఆఫ్స్ రేసు నుంచి ఔట్ అయిన తొలి జట్టుగా నిలిచింది. తాజాగా సన్ రైజర్స్ సోమవారం తమ సొంత మైదానం ఉప్పల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. ఇప్పటివరకు 10 మ్యాచ్ లలో ఏడింట్లో ఓడిన హైదరాబాద్ ఆరు పాయింట్లతో ఉంది. సోమవారం నాటి మ్యాచ్ తో పాటు ఆఖరి నాలుగు మ్యాచ్ లలో మెరుగైన ప్రదర్శనతో చేస్తేనే గౌరవంగా ఉంటుంది.
ఎవరా ఢిల్లీ పెద్ది?
ఢిల్లీ జట్టు యువ బ్యాట్స్ మన్ సమీర్ రిజ్వీ సన్ రైజర్స్ తో మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చాడు. ప్రాక్టీస్ లో భాగంగా అతడు పెద్ది సినిమాలో రామ్ చరణ్ షాట్ ను కొట్టడం కనిపించింది. ఈ మేరకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 23 ఏళ్ల సమీర్ కు మంచి హిట్టర్ గా పేరుంది. గత సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడిన అతడు ఈ ఏడాది ఢిల్లీకి మారాడు. ఈ సీజన్ లో లక్నో, చెన్నై మీద ఆడిన రిజ్వీ మెరుగైన స్కోర్లు చేయలేదు. కుడిచేతి వాటం సురేశ్ రైనాగా పేరున్నప్పటికీ ఇంకా అంచనాలను అందుకోలేకపోతున్నాడు.
.. ఇదీ ఢిల్లీ క్యాపిటల్స్ పెద్ది కథ.
