బీజేపీ ప్రభుత్వంలో భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా కాంగ్రెస్ ఎంపీ!
లక్ష కోట్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), వేల కోట్ల సొంత నిధులు.. 30కి పైగా సంఘాలు.. ప్రపంచ క్రికెట్ ను శాసించే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు త్వరలో కొత్త అధ్యక్షుడు రానున్నారు.
By: Tupaki Desk | 8 Jun 2025 11:33 PM ISTలక్ష కోట్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), వేల కోట్ల సొంత నిధులు.. 30కి పైగా సంఘాలు.. ప్రపంచ క్రికెట్ ను శాసించే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు త్వరలో కొత్త అధ్యక్షుడు రానున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు రోజర్ బిన్నీ వైదొలగుతున్నారు. మరికొంత కాలం పదవీ కాలం ఉన్నప్పటికీ బిన్నీ తప్పుకొంటున్నారు. దీనికి కారణం.. బీసీసీఐ రాజ్యాంగం. అధ్యక్ష పదవిలో ఉన్నవారు 70 ఏళ్లు నిండితే.. టర్మ్ అయిపోక ముందే దిగిపోవాలి. దీంతో జూలై 19న రోజర్ బిన్నీ వైదొలగుతారు. కర్ణాటకకు చెందిన రోజర్ బిన్నీ 1983 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు సభ్యుడు. ఇతడి కుమారుడు స్టువర్ట్ బిన్నీ కూడా భారత్ కు ఆడాడు.
2022లో దిగ్గజ క్రికెటర్ సౌరభ్ గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ అధ్యక్షుడు అయ్యారు. ఇక రోజర్ స్థానంలో బీసీసీఐ అధ్యక్షుడు ఎవరా? అని చూస్తే ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న రాజీవ్ శుక్లా ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇది తాత్కాలికమే అయినా.. శుక్లా అధ్యక్షుడు కావడం కాస్త ఆస్తకికరం. ఈయన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు. 2020 నుంచి బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. సెప్టెంబరులో బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరగనుంది. అప్పటివరకు రెండు నెలలు అధ్యక్షుడిగా తాత్కాలిక బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రస్తుతం బీసీసీఐలో సీనియర్ కార్యవర్గ సభ్యుడు అయినందున శుక్లాకు అధ్యక్ష పదవి చేపట్టే చాన్స్ దక్కింది.
గతంలో ఐపీఎల్ చైర్మన్ గానూ పనిచేశారు శుక్లా. ఉత్తరప్రదేశ్ కు చెందిన శుక్లా.. గతంలో జర్నలిస్టు గానూ పనిచేశారు. పూర్తిగా కాంగ్రెస్ కు చెందినవారు. ప్రస్తుతం మూడోసారి రాజ్యసభ సభ్యుడిగా (2022లో ఛత్తీస్ గఢ్ నుంచి ఎన్నికయ్యారు) కొనసాగుతున్నారు.
బీజేపీ హయాంలోనూ..
కాంగ్రెస్ వాది అయినా బీసీసీఐలో శుక్లా చక్రం తిప్పుతున్నారు. 2011లో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వంలో తొలిసారి ఐపీఎల్ చైర్మన్ అయినా మధ్యలో తప్పుకొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక.. 2015లో శుక్లా ఐపీఎల్ చైర్మన్ కావడం గమనార్హం. ఇప్పుడు తాత్కాలికంగా అయినా అధ్యక్షుడు అవుతున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే ఈయనే పూర్తిస్థాయి అధ్యక్షుడు అయినా ఆశ్చర్యం లేదు. మొత్తానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా కాంగ్రెస్ ఆనవాళ్లు లేకుండా చేసే మోదీ ప్రభుత్వంలో శుక్లా వంటి వారు బీసీసీఐలో చక్రం తిప్పతుండడం విశేషమే కదా?