Begin typing your search above and press return to search.

ఢిల్లీ వర్సెస్ పంజాబ్... కొత్త మైదానంలో సరికొత్త పోరు!

అవును... శనివారం మధ్యాహ్నం జరగబోయే ఐపీఎల్ 17 లోని రెండో మ్యాచ్ పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మధ్య జరగబోతుంది.

By:  Tupaki Desk   |   23 March 2024 4:15 AM GMT
ఢిల్లీ వర్సెస్  పంజాబ్... కొత్త మైదానంలో సరికొత్త పోరు!
X

ఐపీఎల్ సీజన్ 17 అంగరంగ వైభవంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. రాబోయే తొమ్మిది వారాల్లో ఈ సంభరాల్లో ఏమి జరగబోతుందనేది ఓపెనింగ్ నైట్ లో చెన్నై వర్సెస్ బెంగళూరు గేమ్ ట్రైలర్ చూపించింది. దీంతో ఇకముందు కథ వేరే అన్నట్లుగా చర్చలు మొదలైపోయాయి. ఈ సమయంలో పంజాబ్ వారి సంప్రదాయ మొహాలీ హోం గ్రౌండ్ నుంచి మార్పును సూచిస్తూ... ముల్లన్ పూర్ లో ని కొత్త స్టేడియంలో ఢిల్లీని ఎదుర్కొంటుంది.

అవును... శనివారం మధ్యాహ్నం జరగబోయే ఐపీఎల్ 17 లోని రెండో మ్యాచ్ పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మధ్య జరగబోతుంది. 2014 నుండి ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించలేకపోయిన పంజాబ్.. ఈ సారి మైదానం మారడంతో ఏమైనా మార్పులు దక్కించుకుంటుందేమో చూడాలి. గత సీజన్ లో 14 గేమ్ లు ఆడిన పంజాబ్ కేవలం 6 విజయాలు మాత్రమే నమోదు చేసి 8వ స్థానంలో నిలిచింది. దీంతో పంజాబ్ ఫ్యాన్స్ తీవ్ర ఆకలితో ఉన్నారనే భావించాలి.

ఈ నేపథ్యంలో మరోసారి శిఖర్ ధావన్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది పంజాబ్. దీంతో... ఈసారి అయినా తన జట్టును శిఖర్ ప్లే ఆఫ్ లోకి నడిపించాలని కంకణం కట్టుకున్నారని అంటున్నారు. ఈ సమయంలో వికెట్ కీపర్ కం బ్యాటర్ జానీ బెయిర్‌ స్టో జట్టులోకి తిరిగి రావడం వారి బ్యాటింగ్‌ కు భారీ ప్రోత్సాహంగానే భావించాలి. ఇక మిగిలినవారిలో కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ కు తోడు జితేశ్‌ శర్మ, లివింగ్‌ స్టన్‌, సామ్‌ కరన్‌, అర్ష్‌ దీప్‌, రబాడ, ఎలిస్‌, వోక్స్‌ లాంటి ఆటగాళ్లతో బలంగానే కనిపిస్తోంది.

ఇక ఢిల్లీ విషయానికొస్తే... ఇప్పుడు అందరికళ్లూ రిషబ్ పంత్ పైనే ఉన్నాయని చెప్పొచ్చు. రోడ్డు యాక్సిడెంట్ కారణంగా సుమారు 15 నెలల విరామం అనంతరం ఢిల్లీ కెప్టెన్ గా పంత్ మైదానంలోకి అడుగుపెడుతుండటంతో... అతని బ్యాటింగ్, కీపింగ్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. అయితే... గత సీజన్ లో కింద నుంచి రెండో స్థానానికే పరిమితమైన ఢిల్లీని ఈసారి పంత్ చాలా పైకి తీసుకెళ్తాడని భావిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో ఢిల్లీ బలాబలాల విషయానికొస్తే... డెవిడ్ వార్నర్, ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ రూపంలో బలమైన స్క్వాడే ఉంది. వీరితో పాటు పృథ్వీ షా, నోకియా లాంటి ఆటగాళ్లపైనా ఢిల్లీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ప్రధానంగా బౌలింగ్ విషయంలో అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్‌ ల త్రయం బలమైన స్పిన్ దాడిని చేసే అవకాశం ఉందని భావిస్తుండగా... ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్ రూపంలోనూ ఫేస్ బలం కూడా ఉంది.

ఇలా గత సీజన్ లో 8, 9 స్థానాలకు పరిమితమైన జట్లే తలబడుతున్నప్పటికీ... స్టార్ క్రికెటర్లు ఉండటంతో ఈ మ్యాచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, శిఖర్ దావన్, రిషబ్ పంత్ ల పెర్ఫార్మెన్స్ కి స్పెషల్ ఫ్యాన్ బెల్ట్ ఉన్న సంగతి తెలిసిందే!