Begin typing your search above and press return to search.

నాయకుడొచ్చాడు..11ఏళ్లకు ప్లేఆఫ్స్ చేర్చాడు..ఈ ఐపీఎల్ లో కొత్త విజేత?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత చెత్త రికార్డు ఉన్న జట్టు అదే. 2008 నుంచి కొనసాగుతున్నప్పటికీ ఒక్కసారీ కప్ కొట్టలేదు

By:  Tupaki Desk   |   19 May 2025 4:00 PM IST
Punjab Kings Storm Into IPL Playoffs After 11 Years
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత చెత్త రికార్డు ఉన్న జట్టు అదే. 2008 నుంచి కొనసాగుతున్నప్పటికీ ఒక్కసారీ కప్ కొట్టలేదు. ఒక్కసారి ఫైనల్స్ చేరినా రన్నరప్ తో సరిపెట్టుకుంది. అయితే, ఇది జరిగి కూడా 11 ఏళ్లు దాటిపోయింది. ఈ వ్యవధిలో కోల్ కతా నైట్ రైడర్స్ రెండుసార్లు చాంపియన్ అయింది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పలుసార్లు టైటిల్ గెలిచాయి. కానీ, ఆ జట్టు ప్రదర్శన మాత్రం సీజన్ సీజన్ కు కిందకు పడిపోయింది.

ఈసారి సీజన్ లో మాత్రం ఆ జట్టు ముందుకే తప్ప వెనక్కుచూడలేదు. తాజాగా ప్లేఆఫ్స్ బెర్తును కూడా ఖరారు చేసుకుంది. ఇదంతా పంజాబ్ కింగ్స్ జట్టు గురించి. ఐపీఎల్-18లో ఆదివారం రాజస్థాన్ రాయల్స్ పై గెలుపుతో పంజాబ్ ప్లేఆఫ్స్ చేరడం ఖాయమైంది. చివరగా 2014లో పంజాబ్ ప్లేఆఫ్స్ చేరింది. అదే ఏడాది ఫైనల్స్ కు కూడా వెళ్లి రన్నరప్ గా సరిపెట్టుకుంది. 17 ఏళ్ల లీగ్ లో ఆ జట్టు టాప్ ప్రదర్శన ఇదే కావడం గమనార్హం.

ఏటా లీగ్ లో దిగడం.. వరుస పరాజయాలతో వెనుదిరగడం.. ఇదే పంజాబ్ తీరు. పేరులో తప్ప ఆటలో కింగ్స్ లేదని దీంతో అందరూ అనుకునేవారు. అయితే, ఈ ఏడాది రూ.26.75 కోట్లతో కొనుక్కున్న శ్రేయస్ అయ్యర్ పంజాబ్ రాత మార్చాడు.

బ్యాట్స్ మన్ గా రాణిస్తూ.. కెప్టెన్ గా ముందుండి నడిపిస్తూ పంజాబ్ ను ప్లేఆఫ్స్ చేర్చాడు. కుర్రాళ్లు ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్యతో ఓపెనింగ్, మిడిలార్డర్ లో శశాంక్ సింగ్ ను అద్భుతంగా వాడుకుంటూ అయ్యర్ జట్టుకు విజయాలు సాధించిపెట్టాడు. టోర్నీలో 435 పరుగులు చేసిన శ్రేయస్.. ఓ సారి సెంచరీ (97 నాటౌట్)కి చేరువగా వచ్చాడు.

గత ఏడాది కోల్ కతా నైట్ రైడర్స్ ను చాంపియన్ గా నిలిపాడు అయ్యర్. అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ ను ప్లేఆఫ్స్ చేర్చాడు. ఐపీఎల్ లో మూడు వేర్వేరు జట్లను ప్లేఆఫ్స్ చేర్చిన ఘనత అతడిదే.

ఐపీఎల్ కు ముందు చాంపియన్స్ ట్రోఫీ (వన్డే ఫార్మాట్)లో అద్భుతంగా రాణించి టీమ్ ఇండియా విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు శ్రేయస్ అయ్యర్. అదే ఫామ్ ను లీగ్ లోనూ చూపుతున్నాడు. మరోవైపు అయ్యర్ వంటి బ్యాట్స్ మన్ ఉన్న జట్టుకు అర్షదీప్ సింగ్, చాహల్ వంటి బౌలర్లు దొరకడంతో పంజాబ్ గర్జిస్తోంది. మరి ఈ ఊపులో టైటిల్ కొట్టేస్తుందా?