PSG గెలుపు సంబరాలు హింసగా మారాయా?
గెలుపు తెచ్చిన కిక్.. పారిస్ వీధుల్లో పెను విధ్వంసానికి దారితీసింది! యునైటెడ్ ఈఫా ఛాంపియన్స్ లీగ్ ఫైనల్‌లో పిఎస్‌జి జట్టు ఘన విజయం సాధించడంతో మొదలైన సంబరాలు క్షణాల్లో రణరంగంగా మారాయి.
By: Madhu Reddy | 31 May 2026 4:26 PM ISTగెలుపు తెచ్చిన కిక్.. పారిస్ వీధుల్లో పెను విధ్వంసానికి దారితీసింది! యునైటెడ్ ఈఫా ఛాంపియన్స్ లీగ్ ఫైనల్‌లో పిఎస్‌జి జట్టు ఘన విజయం సాధించడంతో మొదలైన సంబరాలు క్షణాల్లో రణరంగంగా మారాయి. అర్ధరాత్రి వేలాది మంది అభిమానుల అదుపు తప్పిన భావోద్వేగాలు, పోలీసులతో ఘర్షణలు, పోలీస్ గ్యాస్ ప్రయోగాలతో ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరం ఒక్కసారిగా వణికిపోయింది. ఆ వివరాలు ఇలా వున్నాయి..
ఉత్కంఠ పోరు.. పిఎస్‌జి ఘన విజయం:
ఫుట్‌బాల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన UEFA ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్ పారిస్‌లో అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. ఇక పిఎస్‌జి మరియు ఆర్సెనల్ జట్ల మధ్య జరిగిన ఈ హోరాహోరీ పోరులో.. చివరికి పెనాల్టీ షూటౌట్‌లో ఆర్సెనల్‌పై పిఎస్‌జి జట్టు అద్భుత విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇక ఈ గెలుపుతో పిఎస్‌జి మద్దతుదారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
వీధుల్లోకి వేలాది మంది.. హోరెత్తిన పారిస్:
మ్యాచ్ ముగిసిన వెంటనే పారిస్ నగరం ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చేసింది. తమ అభిమాన జట్టు గెలిచిన ఆనందంలో వేలాది మంది ఫ్యాన్స్ రాజధాని వీధుల్లో రాలీలు తీశారు. ప్రసిద్ధ 'ఆర్క్ డి ట్రయంఫ్' సమీపంలో వందలాది మంది బాణసంచా కాలుస్తూ, కార్ల హారన్లు మోగిస్తూ సందడి చేశారు. ఇక 'చాంప్స్-ఎలిసీస్' పరిసర ప్రాంతాల్లో అయితే దాదాపు 20,000 మందికి పైగా జనం గుమిగూడటంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది.
మ్యాచ్‌కు ముందే మొదలైన సెగ:
అయితే, ఈ గొడవలు కేవలం మ్యాచ్ అయిపోయాకే జరగలేదు. మ్యాచ్ ప్రారంభానికి ముందే పారిస్‌లో వాతావరణం వేడెక్కింది. ఇక పిఎస్‌జి హోమ్ గ్రౌండ్ అయిన 'పార్క్ డెస్ ప్రిన్సెస్' స్టేడియం వెలుపల మ్యాచ్‌ను వీక్షించడానికి పెద్ద పెద్ద జెయింట్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అక్కడ మ్యాచ్ చూడటానికి వచ్చిన మద్దతుదారులకు, భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీసులకు మధ్య ఆట ప్రారంభానికి ముందే చిన్నపాటి ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
అదుపు తప్పిన ఫ్యాన్స్.. పోలీసుల వైఫల్యం:
విజయం తర్వాత భారీ ఎత్తున జనం వస్తారని ఊహించిన పోలీసులు ముందే భారీగా బలగాలను మోహరించారు. కానీ, మద్యం మత్తు, గెలిచిన ఊపులో అభిమానుల భావోద్వేగాలు హద్దులు దాటాయి. ఇక అల్లరి మూకలు రోడ్లపై రచ్చ చేయడం మొదలుపెట్టడంతో పోలీసులు వారిని అదుపు చేయలేకపోయారు. శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
కన్నీటి వాయువు ప్రయోగం.. 400 మంది అరెస్ట్:
సంబరాలు కాస్తా హింసాత్మకంగా మారడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులకు, ఫ్యాన్స్‌కు మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి. ఇక గుంపులను చెదరగొట్టడానికి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. ఈ ఘర్షణల్లో కొందరు పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు. ఇక గొడవలకు కారణమైన 400మందికి పైగా అభిమానులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
క్రీడలు అనేవి అభిమానులను అలరించడానికి, ఆనందాన్ని పంచడానికి మాత్రమే. కానీ, ఆ గెలుపు ఉత్సాహం హద్దులు దాటి, సమాజంలో హింసకు దారితీసినప్పుడు ఆట స్ఫూర్తికే నష్టం జరుగుతుంది. పారిస్ వేదికగా జరిగిన ఈ ఘటన.. నియంత్రణ లేని అభిమానం ఎంతటి వినాశనానికి దారితీస్తుందో మరోసారి నిరూపించింది.
