Begin typing your search above and press return to search.

అతడే నన్ను బదనాం చేశాడు: స్టార్‌ ఆల్‌ రౌండర్‌ హాట్‌ కామెంట్స్‌!

కాగా తాజాగా ప్రవీణ్‌ కుమార్‌ ఒక యూట్యూబ్‌ చానల్‌ తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ మిండియాలో అందరూ తాగేవాళ్లేనని వెల్లడించాడు.

By:  Tupaki Desk   |   9 Jan 2024 10:30 AM GMT
అతడే నన్ను బదనాం చేశాడు: స్టార్‌ ఆల్‌ రౌండర్‌ హాట్‌ కామెంట్స్‌!
X

భారత్‌ క్రికెట్‌ లో ప్రవీణ్‌ కుమార్‌ గురించి తెలియనివారు లేరు. మీడియం పేస్‌ బౌలర్‌ గా, లోయర్‌ ఆర్డర్‌ లో బ్యాట్సమెన్‌ గా అతడు మంచి పేరు తెచ్చుకున్నాడు. వన్డేల్లో 68 మ్యాచులు ఆడిన ప్రవీణ్‌ కుమార్‌ 77 వికెట్లు తీశాడు. అలాగే 6 టెస్టులు ఆడి 27 వికెట్లు తీశాడు. పది టీ20ల్లో 8 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌ లో 119 మ్యాచుల్లో 90 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో 2007–12 మధ్య టీమిండియా అత్యుత్తమ స్వింగ్‌ బౌలర్‌ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఈ ఉత్తర ప్రదేశ్‌ ఆటగాడు. ఐదేళ్ల పాటు టీమిండియాలో తిరుగులేని బౌలర్‌ గా రాణించారు. ఆ తర్వాత ఐపీఎల్‌ లోనూ అత్యుత్తమ పేసర్‌ గా నిలిచాడు. ఆ తర్వాత వివిధ కారణాల చేత కనుమరుగయ్యాడు.

కాగా తాజాగా ప్రవీణ్‌ కుమార్‌ ఒక యూట్యూబ్‌ చానల్‌ తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ మిండియాలో అందరూ తాగేవాళ్లేనని వెల్లడించాడు. ఈ మేరకు లల్లన్‌ టాప్‌ అనే యూట్యూబ్‌ ఛానల్‌ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఐపీఎల్‌ సృష్టికర్త అయిన లలిత్‌ మోడీ తనను బెదిరించాడని ప్రవీణ్‌ కుమార్‌ బాంబుపేల్చాడు. తన కెరీర్‌ ను ముగిస్తానని హెచ్చరించారని సంచలన ఆరోపణలు చేశారు.

ఐపీఎల్‌ తొలి సీజన్‌ లో తాను రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ఎంపికయ్యాయనని.. అయితే తన సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌ కు దగ్గరగా ఉంటుందని ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ ను ఎంపిక చేసుకుంటానంటే లలిత్‌ మోదీ మండిపడ్డారని తెలిపాడు. ఇలా అయితే ఎక్కడా ఆడకుండా చేస్తానని బెదిరించారని ఆరోపించాడు. నాడు ఐపీఎల్‌ కమిషనర్‌ గా లలిత్‌ మోడీ ఉన్న సంగతి తెలిసిందే.

అలాగే భారత జట్టులోని ఓ సీనియర్‌ ఆటగాడు తనను బదనాం చేశాడని ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపించాడు. అతడి వల్లే తనకు అవకాశాలు లేకుండా పోయాయని మండిపడ్డాడు. అయితే అతడి పేరు తాను చెప్పదల్చుకోలేదని వెల్లడించాడు.

ఈ ఇంటర్వ్యూలో ప్రవీణ్‌ కుమార్‌.. లలిత్‌ మోడీతోపాటు పలువురు తన తోటి సహచర ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాటి తన టీమిండియా సహచరులు, ప్రత్యేకించి ఓ సీనియర్‌ ఆటగాడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అలాగే పాకిస్తాన్‌ ఆటగాళ్లపై కూడా హాట్‌ కామెంట్స్‌ చేశాడు.

టీమిండియాలో చేరిన కొత్తలో పలువురు సీనియర్లు తనను మద్యం సేవించడం మానుకోవాలని సూచించారని ప్రవీణ్‌ కుమార్‌ తెలిపాడు. తనకున్న మద్యం అలవాటు కారణంగా ఓ సీనియర్‌ తనను ప్రత్యేకించి కించపరిచేవాడని మండిపడ్డాడు. జట్టులో అందరూ తాగేవాళ్లే అయినప్పటికీ.. తాను మాత్రమే తాగుబోతును అన్నట్టు తన పేరును మాత్రమే హైలైట్‌ చేసేవారని ఆవేదన వ్యక్తం చేశాడు.

రంజీ టీములు, ఐపీఎల్‌ జట్లకు కోచ్‌ గా, మెంటార్‌ గా ఇలా పలు అవకాశాలు తనకు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను తాగుబోతునని దుష్ప్రచారం చేయడం వల్లే తనకు అవకాశాలు రాలేదని.. ఎవరూ తమ జట్లలో అవకాశాలు ఇవ్వలేదని వాపోయారు. తానెప్పుడు మైదానంలో కానీ, డ్రెస్సింగ్‌ రూమ్‌ లో కానీ తాగలేదని ప్రవీణ్‌ గుర్తు చేశాడు.

తాను తాగుతానని సాకుగా చూపి తన సొంత జట్టు ఉత్తరప్రదేశ్‌ కూడా తనను పట్టించుకోకపోవడం బాధ కలిగించిందని తెలిపాడు. సరైన గుర్తింపు లేక, అవకాశాలు రాక, కనీసం పలకరించే వారు లేక ఓ దశలో నిరాశలో కూరుకుపోయానని ఆ ఇంటర్వ్యూలో ప్రవీణ్‌ కుమార్‌ వివరించాడు.