3 ఇన్నింగ్స్ లు.. 300 పరుగులు.. ఆ పేస్ బౌలర్ పై దారుణ ట్రోలింగ్
ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో టీమ్ ఇండియా తరఫున యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్, కెప్టెన్ శుబ్ మన్ గిల్, సీనియర్ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ సెంచరీలతో దుమ్మురేపుతున్నారు.
By: Tupaki Desk | 5 July 2025 4:50 PM ISTఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో టీమ్ ఇండియా తరఫున యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్, కెప్టెన్ శుబ్ మన్ గిల్, సీనియర్ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ సెంచరీలతో దుమ్మురేపుతున్నారు. వీరితో పాటు మరో ఆటగాడు కూడా ’సెంచరీలు’ చేస్తున్నాడు.. కానీ, అది బ్యాట్ తో కాదు.. బంతితో.. మంచి పేస్ తో పాటు ఎత్తు ఉన్న అతడు ఇంగ్లండ్ పిచ్ లపై బౌన్స్ రాబట్టి వికెట్లు తీస్తాడని తుది జట్టులోకి తీసుకుంటే తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. వికెట్లు తీయడం అటుంచి.. టి20ల స్థాయిలో పరుగులు ఇచ్చేస్తున్నాడు. అతడు బంతి అందుకుంటే ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ కు పండుగే అన్నట్లు ఉంది పరిస్థితి.
ఇటీవలి ఐపీఎల్ లో ప్రసిద్ధ్ క్రిష్ణ టాప్ వికెట్ టేకర్. మొత్తం 25 వికెట్లతో పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. ఆ ప్రదర్శనతోనే అతడిని ఇంగ్లండ్ తీసుకెళ్తే దారుణంగా విఫలం అవుతున్నాడు. తొలి టెస్టులో ఏకంగా రెండు ఇన్నింగ్స్ లో కలిపి 220 పరుగులు ఇచ్చేశాడు. ఐదు వికెట్లు తీశాడన్న మాటే కానీ.. ఇంగ్లండ్ చేసిన మొత్తం 838 పరుగుల్లో 25 శాతం ప్రసిద్ధ్ వే అయితే ఎలా?
ఇక రెండో టెస్టులోనూ ప్రసిద్ధ్ పూర్తిగా గాడి తప్పాడు. పిచ్ నుంచి సహకారం లేదనే సంగతి వాస్తవమే. కానీ, పరుగులు ఇవ్వకుండా బ్యాట్స్ మెన్ ను కట్టడి చేయడమూ ముఖ్యమే కదా..? ఈ టెస్టులో ఏకంగా 13 ఓవర్లలో 72 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు. షార్ట్ పిచ్ బంతుల వ్యూహం పనిచేయకపోవడంతో ప్రసిద్ధ్ ను ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ ఉతికి ఆరేశాడు. అసలు స్మిత్ సెంచరీకి ప్రసిద్ధ్ బౌలింగే కారణమని సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది.
ఓవైపు ఎడమచేతివాటంతో పాటు స్వింగ్ బౌలర్ అయిన అర్షదీప్ సింగ్ ను కాదని ప్రసిద్ధ్ ను ఆడిస్తున్నా.. అతడు తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. దీంతో నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. ’’ప్రసిద్ధ్ కంటే.. 35 ఏళ్ల భువనేశ్వర్ మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. అతడు స్వింగ్ బౌలర్ కూడా. ఇంగ్లండ్ లో వికెట్లు తీయగలడు‘‘ అని ఒకరు... ’’ఇదేం సెలక్షన్? ప్రసిద్ధ్ ఓవర్ కు 6 బౌండరీలు ఇస్తున్నాడు. అర్షదీప్ డరెస్సింగ్ రూమ్ లో ఉన్నాడు. ప్రసిద్ధ్ మ్యాచ్ లు ఆడుతున్నాడు’’ అని మరొకరు దుమ్మెత్తిపోశారు. ’’విరాట్ కోహ్లి కాదు.. ప్రసిద్ధ్ క్రిష్ణ రన్ మెషిన్. భారత్ తరఫున హారిస్ రవూఫ్ (భారీగా పరుగులిచ్చే పాక్ పేసర్)‘‘ అని ఇంకొకరు ఎద్దేవా చేశారు. ప్రసిద్ధ్ కు రిటర్న్ టికెట్ బుక్ చేయండి.. బిజినెస్ క్లాస్ టికెట్ కొనిస్తా అని మరో అభిమాని ప్రపోజ్ చేశాడు.