వరల్డ్ నంబర్-1కు 'చెక్'.. భారత యువ కిరణం అద్భుత విజయం
రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో నార్వే ఆటగాడు.. ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్ సన్ ను ప్రజ్ఞానంద మట్టికరిపించాడు.
By: Tupaki Desk | 17 July 2025 3:41 PM ISTమేధో క్రీడ చెస్ లో భారత విజయ బావుటా ఎగురవేస్తోంది.. విశ్వనాథన్ ఆనంద్ తో మొదలు తాజాగా తెలుగు మూలాలున్న గుకేశ్ దొమ్మరాజు వరకు విజయ పతాకాలు ఎగురవేశారు. తాజాగా లాస్ వెగాస్ లో మరో ఘన విజయం మన రికార్డులో చేరింది. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో నార్వే ఆటగాడు.. ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్ సన్ ను ప్రజ్ఞానంద మట్టికరిపించాడు. అతడిని టోర్నీ నుంచే ఇంటికి సాగనంపాడు. ఇది మొత్తం టోర్నీకే సంచలన ప్రదర్శన కావడం గమనార్హం.
లాస్ వెగాస్ లో ప్రస్తుతం ఫ్రీ స్టైల్ చెస్ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీ ఫేవరెట్ మాగ్నస్ కార్ల్ సన్. అయితే, అతడినే ప్రజ్ఞానంద మట్టికరిపిచాండు. టీనేజ్ ఇండియన్ గ్రాండ్ మాస్టర్ రమేష్ బాబు ప్రజ్ఞానంద.. ఈ ఏడాది వరుసగా అద్భుత విజయాలు సాధిస్తున్నాడు. వీటిలో కార్లసన్ పై తాజా గెలుపు మరింత విశిష్టమైనదే అని చెప్పాలి.
ప్రజ్ఞానంద తాజా మ్యాచ్ లో కార్ల్ సన్ పై పూర్తి ఆధిపత్యం చూపాడు. ప్రపంచ నంబర్ వన్ ను ఓడించి క్వార్టర్స్ చేరాడు. ప్రత్యర్థి బలమైన ఆటగాడే అయినప్పటికీ.. ఎక్కడా ప్రజ్ఞానంద వెనకడుగు వేయలేదు.
కార్ల్ సన్ పై ప్రజ్ఞానంద రికార్డు ఘనమైనదే. గతంలోనూ సంచలన విజయాలు సాధించిన చరిత్ర అతడికి ఉంది. ఇటీవల పారిస్ లో జరిగిన టోర్నీలో ప్రజ్ఞానందను 9వ స్థానంతో నిరాశపరిచాడు. ఈసారి మాత్రం అసలు అవకాశం లేకుండా దూసుకెళ్తున్నాడు.
ప్రస్తుతం కార్ల్ సన్ ఉన్న ఫామ్ ప్రకారం చూస్తే ప్రజ్ఞానంద సాధించినది సూపర్ విజయమే అనాలి. ఎందుకంటే.. రెండు టోర్నీల్లో గెలిచి.. మరోదాంట్లో మూడో ప్లేస్ లో నిలిచాడు. చెస్ చరిత్రలోనే గొప్ప ఆటగాడిగా పేరొందిన అతడిని ప్రజ్ఞానంద గుక్కతిప్పుకోనీయలేదు. తెల్లపావులతో నాలుగో రౌండ్ లో ఆడిన ప్రజ్ఞానంద.. 39 ఎత్తుల్లో కార్ల్ సన్ ఆటకట్టించాడు.
19 ఏళ్ల ప్రజ్ఞానంద..4.5 పాయింట్లతో సంయుక్తంగా టాప్ లో ఉన్నాడు. 8 మంది గ్రాండ్ మాస్టర్లతో రెండేసి గ్రూప్ లు టాప్ 4 స్థానం కోసం పోరాడుతున్నాయి.
