Begin typing your search above and press return to search.

ఆ పేసర్.. మెరుపు బంతులనే కాదు.. ఫుడ్ డెలివరీ కూడా చేస్తాడు

మంగళవారం నెదర్లాండ్స్ –దక్షిణాఫ్రికా మ్యాచ్ చూసినవారికి ఫలితం ముందే తెలిసిపోయిందేమో..? ఎందుకంటే దక్షిణాఫ్రికా అంతగా తడబడింది

By:  Tupaki Desk   |   18 Oct 2023 7:59 AM GMT
ఆ పేసర్.. మెరుపు బంతులనే కాదు.. ఫుడ్ డెలివరీ కూడా చేస్తాడు
X

వన్డే ప్రపంచ కప్ క్రమక్రమంగా వేడెక్కుతోంది.. మ్యాచ్ లు రసవత్తరంగా జరుగుతున్నాయి. అనూహ్య ఫలితాలు నమోదవుతున్నాయి.. మొన్నటికి మొన్న డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ను అఫ్ఘానిస్థాన్ మట్టికరిపించగా.. నిన్నటికి నిన్న దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ చిత్తు చేసింది. అది కూడా సునాయాసంగా గెలిచింది. వాస్తవానికి ఈ సారి దక్షిణాఫ్రికా కాస్త ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. మార్క్ రమ్, డికాక్, క్లాసెన్ వంటి దూకుడైన బ్యాటర్లతో, రబడ, ఎంగిడి వంటి పేసర్లతో బలంగానూ ఉంది. దీనికితగ్గట్లే రెండు మ్యాచ్ శ్రీలంక, ఆస్ట్రేలియాపై అద్భుతంగా ఆడింది. కానీ, ముచ్చటగా మూడో మ్యాచ్ కు వచ్చేసరికి తేలిపోయింది.

నెదర్లాండ్స్ బెదరగొట్టింది..

మంగళవారం నెదర్లాండ్స్ –దక్షిణాఫ్రికా మ్యాచ్ చూసినవారికి ఫలితం ముందే తెలిసిపోయిందేమో..? ఎందుకంటే దక్షిణాఫ్రికా అంతగా తడబడింది. నెదర్లాండ్స్ అంత సాధికారికంగా ఆడింది. ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ జట్టు స్కాట్ ఎడ్వర్డ్స్ (79), వాన్ డెర్ మెర్వ్ (29), ఆర్యన్ దత్ (23) బ్యాటింగ్ లో రాణించారు. బౌలింగ్ కు వచ్చేసరికి వాన్ బీక్ (3/60), మీకెరన్ (2/40), వాన్ డెర్ మెర్వ్ (2/34), బాస్ డీ లీడ్ (2/36) సమష్టిగా ప్రత్యర్థిని కుప్పకూల్చారు. దీంతో దక్షిణాఫ్రికా 38 పరుగులతో గెలుపొందింది.

ఆ వికెట్.. ఈ బౌలర్

ప్రపంచ కప్ లో ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న బ్యాట్స్ మన్ ఎవరంటే .. దక్షిణాఫ్రికాకు చెందిన మార్క్ రమ్. శ్రీలంకపై విధ్వంసక సెంచరీ, ఆస్ట్రేలియాపై మెరుపు అర్ధ శతకం మార్క్ రమ్ ఫామ్ ను చాటుతున్నాయి. అయితే, అలాంటి బ్యాట్స్ మన్ ను ఒక్క పరుగుకే బౌల్డ్ చేశాడో బౌలర్.. అతడే నెదర్లాండ్స్ పేసర్ మీకెరన్. పూర్తి పేరు పాల్ వాన్ మీకెరన్.

నాడు ఫుడ్ డెలివరీ..

నిన్నటి మ్యాచ్ లో మీకెరన్.. మార్క్ రమ్ తో పాటు ఆల్ రౌండర్ జాన్సన్ నూ ఔట్ చేశాడు. ఈ రెండూ చాలా కీలక వికెట్లు. నెదర్లాండ్స్ విజయంలో ఇవే మలుపు. అయితే, చక్కటి బంతులతో ఈ వికెట్లు పడగొట్టిన మీకెరన్.. కొవిడ్ సమయంలో ఏం చేశాడో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. మూడేళ్ల కిందట కొవిడ్ ప్రపంచాన్ని షట్ డౌన్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మీకెరన్ ఫుడ్ డెలివరీ చేశాడు. దాని గురించి అప్పట్లోనే అతడు ఒక పోస్టు చేశాడు. అది ఇప్పుడు వైరల్‌ గా మారింది. కొవిడ్ వ్యాప్తి తో అప్పట్లో టీ20 ప్రపంచ కప్‌ ఏడాది పాటు వాయిదా పడింది. దీంతో కుటుంబ పోషణ కోసం 'ఉబెర్ ఈట్స్'లో చేరాడు మీకెరన్. అలా ఫుడ్‌ డెలివరీలో పాల్గొన్నాడు.

''ఇప్పుడు నేను క్రికెట్‌ మైదానంలో ఉండాల్సిన వాడిని. కానీ, జీవితం సాగడానికి ఫుడ్ డెలివరీ చేస్తున్నా. పరిస్థితులు ఎలా మారిపోయాయో హహ్హహ్హ. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి'' అని నాడు అతడు పోస్టు పెట్టాడు. ఓ ఇంటర్వ్యూ లోనూ ఆ విషయం చెప్పాడు మీకెరన్. ''క్రికెట్‌ ఆడేందుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఉద్యోగం చేయాలని భావించా. నిత్యావసరాలు, పెట్రోలు, ఆహారం, ఇంటి అద్దె, ఫోన్ బిల్లులు వంటి ఖర్చుల కోసం పని చేయాలి. అయితే, జట్టు నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందో తెలియదు. అందుకే, దానికి అనుకూలంగా ఉండే జాబ్స్‌ కోసమే ప్రయత్నించా. అప్పుడే స్నేహితుల ద్వారా ఫుడ్‌ డెలివరీ ఉద్యోగం లభించింది. దీనికేమీ సిగ్గుపడలేదు'' అని చెప్పాడు.