Begin typing your search above and press return to search.

పాక్, లంక.. ఆసియా ఫైనల్లో భారత్ తో తలపడేదెవరో?

గురువారం శ్రీలంక-పాకిస్థాన్ తలపడనున్నాయి. శుక్రవారం బంగ్లాదేశ్ తో భారత్ ఆడనుంది. ఇది నామమాత్ర మ్యాచే. కానీ, లంక –పాక్ మ్యాచ్ చాలా కీలకమైనది.

By:  Tupaki Desk   |   13 Sep 2023 8:11 AM GMT
పాక్, లంక.. ఆసియా ఫైనల్లో భారత్ తో తలపడేదెవరో?
X

ఆసియా కప్ తుది దశకు చేరింది. సూపర్ 4 మ్యాచ్ లు మరో రెండు మాత్రమే మిగిలి ఉండగా.. ఒక జట్టు ఇంటి ముఖం పట్టింది. మరో జట్టు ఫైనల్ కు చేరింది. తుది సమరానికి చేరే మిగిలిన రెండో జట్టు ఏదనేది తేలాల్సి ఉంది. బుధవారం ఎలాంటి మ్యాచ్ లు లేవు. గురువారం శ్రీలంక-పాకిస్థాన్ తలపడనున్నాయి. శుక్రవారం బంగ్లాదేశ్ తో భారత్ ఆడనుంది. ఇది నామమాత్ర మ్యాచే. కానీ, లంక –పాక్ మ్యాచ్ చాలా కీలకమైనది.

ఆ జట్టు ఏదో...?

సూపర్ 4 దశ లో అత్యంత ఆసక్తికర మ్యాచ్ భారత్-పాక్ మధ్య ఆది-సోమవారాల్లో జరిగింది. ఇందులో మన జట్టు అద్భుతంగా ఆడి గెలిచింది. మంగళవారం శ్రీలంకపైనా నెగ్గి ఫైనల్ కు వెళ్లింది. ఇక రెండో జట్టు ఏదో తేలాలంటే గురువారం వరకు ఆగాలి. ఆ రోజు లంక-పాక్ ఢీకొంటాయి. వాస్తవానికి నిన్నటి మ్యాచ్ లో మనపై లంక గెలిచి ఉంటే ఆ జట్టే ఫైనల్ కు వెళ్లేది. ఎందుకంటే బంగ్లాదేశ్ ను ఇప్పటికే ఆ జట్టు ఓడించింది. పాకిస్థాన్ కూడా టీమిండియాపై నెగ్గి ఉంటే ఫైనల్ కు వెళ్లేది. ఆ జట్టు కూడా బంగ్లాను మట్టికరిపించింది. కానీ, రోహిత్ సేన వాటికి అవకాశం ఇవ్వకుండా తుది సమరానికి ముందే బెర్తు కొట్టేసింది. ఇక గురువారం లంక-పాక్ సమరంలో గెలిచిన జట్టు ఫైనల్ లో భారత్ తో తలపడుతుంది.

వర్షం వల్ల రద్దయితే?

సూపర్-4లో భారత్-పాక్ మ్యాచ్ కు తప్ప మరే మ్యాచ్ కూ రిజర్వ్ డే లేదు. అదికూడా రిజర్వ్ డేను ఆదివారం వర్షం పడిన అనంతరమే నిర్ణయించారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ లో లేదు. దీనిపై పెద్దఎత్తున విమర్శలు వచ్చినా.. భారత్-పాక్ మ్యాచ్ కాబట్టి అవేవీ ఆసక్తికరంగా కనిపించలేదు. కాగా, గురువారం లంక-పాక్ మ్యాచ్ కూ వర్షం ముప్పు ఎదురైతే.. పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. అదే జరిగితే మెరుగైన రన్ రేట్ ఉన్నందున లంక ముందంజ వేస్తుంది. పాకిస్థాన్ ఇంటి దారి పడుతుంది. మ్యాచ్ ఆసాంతం జరిగి పాక్ గెలిస్తే మాత్రం వచ్చే ఆదివారం టీమిండియాతో టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకుంటుంది.

ఆసియా కప్ లో తొలిసారి ఫైనల్లో తలపడతాయా?

ఆసియాకప్ చరిత్రలో భారత్-పాకిస్థాన్ ఇప్పటివరకు ఫైనల్లో ఎదురుపడలేదు. టీమిండియా 6 సార్లు, పాకిస్థాన్ రెండుసార్లు విజేతగా నిలిచినా, వేర్వేరు ప్రత్యర్థులపై గెలిచాయి. మరి ఈసారైనా రెండు జట్లూ ఫైనల్లో తలపడతాయా? అని టోర్నీ ప్రారంభానికి ముందు ప్రెస్ మీట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ప్రశ్నించగా.. 'గట్టిగా అనుకోండి.. అయిపోతుందని' బదులిచ్చాడు. కాగా, శుక్రవారం టీమిండియా సూపర్ 4 చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో భారత్ ప్రయోగాలకు దిగే చాన్సుంది. రిజర్వ్ బెంచ్ ను పరీక్షించే క్రమంలో సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్ ను బరిలో దింపొచ్చు. పేసర్ షమీకి మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమే. బుమ్రా బదులు అతడిని ఆడించే వీలుంది.