Begin typing your search above and press return to search.

చిరకాల ప్రత్యర్థి 2 వారాలు.. ఉప్పల్ మైదానంలో

భారత్ ఏకైక వేదికగా సరిగ్గా వారం రోజుల్లో వన్డే ప్రపంచ కప్ మొదలుకానుంది.

By:  Tupaki Desk   |   1 Oct 2023 2:55 PM GMT
చిరకాల ప్రత్యర్థి 2 వారాలు.. ఉప్పల్ మైదానంలో
X

భారత్ ఏకైక వేదికగా సరిగ్గా వారం రోజుల్లో వన్డే ప్రపంచ కప్ మొదలుకానుంది. దీనికితగ్గట్లుగా అన్ని దేశాలు సిద్ధమయ్యాయి. దాదాపు అన్ని టీమ్ లూ భారత్ చేరుకున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడేందుకు సంసిద్ధం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లను వన్డే ప్రపంచ కప్ మ్యాచ్ లు దక్కని నగరాలకు కేటాయించారు. తద్వారా ఏ నగరానికీ అన్యాయం చేయలేదన్న పేరు మిగుల్చుకునేందుకు బీసీసీఐ ప్రయత్నం చేసింది.

మాకేవీ మ్యాచ్ లు..?

ప్రపంచ కప్ మ్యాచ్ ల కేటాయింపులో కొన్ని రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం దక్కిందనే విమర్శలు వచ్చాయి. అందులోనూ ప్రధాని మోదీ, బీసీసీఐ కార్యదర్శి జై షా సొంత రాష్ట్రం గుజరాత్ కు అధిక ప్రాధాన్యం దక్కిందన్న ఆరోపణలు వచ్చాయి. గుజరాత్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియానికి ఐదు మ్యాచ్ లు కేటాయించారు. మొహాలీ వంటి అత్యంత పాత స్టేడియంలో ఒక్క మ్యాచ్ కూడా లేకపోవడం వివాదాస్పదమైంది. దీనిపై పంజాబ్ మంత్రి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్ సన్నాహక మ్యాచ్ లను కేటాయించారు.

భారత్ కాదు.. హైదరాబాద్ లో పాక్

ప్రపంచ కప్ లో ఫేవరెట్ జట్లు భారత్, పాకిస్థాన్. అందులోనూ దేశంలోని ఐదో అతిపెద్ద నగరం హైదరాబాద్. ఉప్పల్ వంటి అధునాతన మైదానం ఉన్న ఈ నగరానికి ప్రపంచ కప్ లో భారత్ ఆడే మ్యాచ్ లు కేటాయించలేదు. ఇది కూడా వివాదాస్పదమైంది. అయితే, పాకిస్థాన్ కు మాత్రం ఇక్కడ రెండు మ్యాచ్ లు ఉండడం గమనార్హం. ఈ నెల 6న నెదర్లాండ్స్ ను, 12న శ్రీలంకను పాకిస్థాన్ ఉప్పల్ లోనే ఎదుర్కొంటుంది. ఇదికాక ఈ నెల 9న న్యూజిలాండ్, నెదర్లాండ్స్ మ్యాచ్ కూ ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. అంటే మొత్తం మూడు మ్యాచ లు జరుగుతాయి.

2 వారాలు పాక్ ఇక్కడే

లీగ్ దశలో కీలక రెండు మ్యాచ్ లు ఆడనున్నందున పాకిస్థాన్ కు ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ అవకాశం కల్పించారు.ఈ నేపథ్యంలో అనూహ్యంగా దాదాపు రెండు వారాలు పాకిస్థాన్ జట్టు హైదరాబాద్ లో ఉండనుంది. బహుశా వారి దేశంలో ఉన్న హైదరాబాద్ లోనూ పాక్ జట్టు ఎప్పుడూ ఇన్ని రోజులు ఉండి ఉండదు.