Begin typing your search above and press return to search.

యూఏఈతో యథావిధిగా మ్యాచ్‌.. పాక్‌ బాయ్‌కాట్‌ బెదిరింపులు తుస్‌

యూఏఈతో మ్యాచ్‌లో గెలిస్తేనే పాకిస్థాన్‌కు ఆసియా కప్‌లో సూపర్‌-4కు చేరుతుంది. కానీ, పైక్రాఫ్ట్‌ను తప్పించకుంటే ఆడబోమంటూ బెదిరింపులకు దిగింది.

By:  Tupaki Desk   |   17 Sept 2025 8:15 PM IST
యూఏఈతో యథావిధిగా మ్యాచ్‌.. పాక్‌ బాయ్‌కాట్‌ బెదిరింపులు తుస్‌
X

ఆసియా కప్‌లో భారత్‌ చేతిలో అత్యంత దారుణంగా ఓడిపోయిన్‌ పాకిస్థాన్‌ జట్టు ఆ ఓటమి తాలూకు పరాభవాన్ని కవర్‌ చేసేందుకు.. ‘భారత ఆటగాళ్లు షేక్‌ హ్యాండ్‌ చేయలేదు’ అనే పనికిమాలిన వాదనను తెరపైకి తెచ్చి రగడ సృష్టించింది. మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ కారణంగానే టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఇలా వ్యవహరించారని, అతడిని తమ మ్యాచ్‌లకు రిఫరీగా తప్పించాలని పట్టుబట్టింది. దీనిపై బుధవారం అంతా గందరగోళం నెలకొంది. ఓ దశలో పైక్రాఫ్ట్‌ స్థానంలో పాక్‌-యూఏఈ మ్యాచ్‌కు రిచర్డ్‌సన్‌ను రిఫరీగా నియమిస్తున్నట్లు కథనాలు వచ్చాయి. కానీ, పైక్రాఫ్టే కొనసాగుతాడని తేలడంతో బుధవారం సాయంత్రం పాక్‌ జట్టు యూఏఈతో మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేస్తామంటూ డాంబికాలు పోయింది.

ఎందుకు బెదిరించినట్లు?

యూఏఈతో మ్యాచ్‌లో గెలిస్తేనే పాకిస్థాన్‌కు ఆసియా కప్‌లో సూపర్‌-4కు చేరుతుంది. కానీ, పైక్రాఫ్ట్‌ను తప్పించకుంటే ఆడబోమంటూ బెదిరింపులకు దిగింది. దీంతో దుబాయ్‌లో బుధవారం రాత్రి 8 గంటలకు మొదలుకావాల్సిన మ్యాచ్‌ జరుగుద్దా లేదా? అనే సందేహం నెలకొంది. జట్టు ఆటగాళ్లు బాయ్‌కాట్‌ యోచన మధ్య... పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు నఖ్వీతో చర్చలు జరిపారు. చివరకు నఖ్వీ ఆదేశాలతో మ్యాచ్‌కు సిద్ధమయ్యారు. ఈ గందరగోళం కారణంగా మ్యాచ్‌ గంట ఆలస్యంగా 9 గంటలకు మొదలైంది. విచిత్రం ఏమంటే.. మ్యాచ్‌కు రిఫరీ పైక్రాఫ్టే కావడం.

భారత్‌ ముందు ఆటలా..?

పెహల్గాం ఉగ్రదాడికి నిరసనగా పాక్‌ ఆటగాళ్లతో భారత ప్లేయర్లు ఈ నెల 14న మ్యాచ్‌లో షేక్‌ హ్యాండ్‌ ఇవ్వలేదు. మ్యాచ్‌లో ఘన విజయం అనంతరం తమ విజయాన్ని ఉగ్రదాడి మృతులకు అంకితం ఇస్తున్నట్లు టీమ్‌ ఇండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తెలిపాడు. అసలే ఘోర పరాజయ భారంతో ఉన్న పాక్‌ ఆటగాళ్లకు మరింత మండినట్లుంది. పైక్రాఫ్ట్‌ను సాకుగా చూపుతూ యూఏఈతో మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేస్తామంటూ తిక్క నిర్ణయం తీసుకున్నారు. అసలు పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్‌ నుంచి తప్పించాలని డిమాండ్‌ చేసినా ఐసీసీ ఒప్పుకోలేదు.

టోర్నీని బాయ్‌కాట్‌ చేయాలి కానీ..

ఐసీసీ తమ డిమాండ్‌ను తిరస్కరించినందుకు చేస్తే గీస్తే పాకిస్థాన్‌ మొత్తం ఆసియా కప్‌నే బహిష్కరించాలి. కానీ, యూఏఈతో మ్యాచ్‌కే బాయ్‌కాట్‌ నినాదం ఇచ్చింది. పైక్రాఫ్ట్‌ తొలగింపునకు రెండుసార్లు మెయిల్‌ పెట్టినా స్పందన లేకపోవడం.. చివరకు ఏదీ అనుకున్నట్లు జరగకపోవడంతో ఆడేందుకు ఒప్పుకొంది. హోటల్‌ నుంచి ఆటగాళ్లు గ్రౌండ్‌కు ఆలస్యంగా బయల్దేరడంతో గంట ఆలస్యంగా మ్యాచ్‌ మొదలు పెట్టాలని నిర్ణయించారు. ఎంతో హైడ్రామా చేసిన పాక్‌ జట్టు చివరకు తోకముడిచింది.