బంతి కాకుంటే తుపాకీ పట్టేవాడిని.. పాక్ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు
కొన్ని నెలల కిందట పాకిస్థాన్ లో పర్యటించిన ఇంగ్లండ్ టెస్టు సిరీస్ ను నెగ్గింది. అయితే, క్లీన్ స్వీప్ చేసే ఊపులో ఉన్న ఆ జట్టును ఒక క్రికెటర్ అడ్డుకున్నాడు.
By: Tupaki Desk | 6 April 2025 1:00 AM ISTపాకిస్థాన్ అంటేనే అశాంతి.. సైన్యం పెత్తనంలో సాగే ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వాల కంటే సైన్యమే ఎక్కువ కాలం పాలించిన దేశం. క్రికెట్ లో ప్రపంచ కప్ గెలిచిన జట్లలో ఒకటైన పాక్ లో ఇటీవలి కాలంలో క్రికెట్ ప్రతిష్ఠ నానాటికీ దిగజారుతోంది. మొన్నటికి మొన్న చాంపియన్స్ ట్రోఫీ నిర్వహించినా తమ దేశ జట్టు లీగ్ దశలోనే వెనుదిరిగింది.
కొన్ని నెలల కిందట పాకిస్థాన్ లో పర్యటించిన ఇంగ్లండ్ టెస్టు సిరీస్ ను నెగ్గింది. అయితే, క్లీన్ స్వీప్ చేసే ఊపులో ఉన్న ఆ జట్టును ఒక క్రికెటర్ అడ్డుకున్నాడు. అతడే పాక్ స్పిన్నర్ సాజిద్ ఖాన్. 31 ఏళ్ల ఈ స్పిన్నర్ ఇంగ్లండ్ పై మరో స్పిన్నర్ నోమన్ అలీతో కలిసి ఒంటిచేత్తో విజయం అందించాడని చెప్పొచ్చు.
మంచి స్పిన్పర్ లేక కొన్నాళ్లుగా ఇబ్బంది పడుతున్న పాక్ కు సాజిద్ ఇప్పుడు పెద్ద అసెట్. 12 మ్యాచ్ లలో59 వికెట్లు పడగొట్టాడంటేనే సాజిద్ ప్రతిభను తెలుసుకోవచ్చు. ఇంగ్లండ్ తో రెండు టెస్టుల్లో 19 వికెట్లు తీశారు. ఈ సంవత్సరం ప్రారంభంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్ ల సిరీస్ లో 15 వికెట్లు పడగొట్టాడు.
టెస్టుల్లో పాకిస్థాన్ తుది జట్టులో కచ్చితంగా ఉంటున్న సాజిద్ ఓ ఇంటర్వ్యూలో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. తాను క్రికెటర్ కాకపోయి ఉంటే గనుక గ్యాంగ్ స్టర్ ను అయ్యేవాడిని అని వ్యాఖ్యానించాడు. ఈ మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
వికెట్లు తీసిన సందర్భంలో దూకుడుగా సంబరాలు జరుపుకొనే సాజిద్ ఖాన్ వ్యాఖ్యలను కొందరు తప్పుబడుతున్నారు. జాతీయ క్రికెటర్ అయి ఉండి అలా మాట్లాడడం తగదని హితవు పలుకుతున్నారు.
కాగా చాంపియన్స్ ట్రోఫీలో ఘోర పరాజయం అనంతరం పాకిస్థాన్ జట్టు వెంటనే న్యూజిలాండ్ టూర్ కు వెళ్లింది. 1-4 తేడాతో టి20 సిరీస్ ను, 0-3తో వన్డే సిరీస్ ను కోల్పోయి మరో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.
