Begin typing your search above and press return to search.

మరోసారి భారత్ వర్సెస్ ఆసిస్... విశాఖలో వికెట్ పరిస్థితి ఏమిటి?

అవును... వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో జరిగిన విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకుని, దాని తాలూకు బాదను మరిచిపోవాల్సిన సమయం దగ్గరపడింది

By:  Tupaki Desk   |   23 Nov 2023 4:07 AM GMT
మరోసారి భారత్  వర్సెస్  ఆసిస్... విశాఖలో వికెట్  పరిస్థితి ఏమిటి?
X

వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి బాధ వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఆ బాధ నుంచి భారత్ లాంటి దేశం ఇంత త్వరగా తేరుకోవాలనుకోవడం కూడా అంత ఈజీ కాదు! అయితే బాదపడటం కంటే ముఖ్యంగా రివేంజ్ తీర్చుకునే అవకాశం వచ్చిందన్న విషయం గుర్తించాలి. ప్రస్తుతం అదే అవకాశం టీం ఇండియాకు వచ్చింది. నేడు విశాఖలో జరగనున్న టి.20 మ్యాచ్ అందుకు వేదిక కానుంది!

అవును... వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో జరిగిన విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకుని, దాని తాలూకు బాదను మరిచిపోవాల్సిన సమయం దగ్గరపడింది. వచ్చే ఏడాది జూన్‌ లో జరిగే టీ20 ప్రపంచకప్‌ పై గురి పెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. అందుకు ఆసీస్‌ జట్టుతో అయిదు మ్యాచ్‌ ల సిరీస్‌ కు సన్నద్దమవుతుంది. ఫలితంగా... విశాఖపట్నం వేదికగా భారత్‌ మళ్లీ కొత్తగా పయనాన్ని మొదలెట్టనుంది.

ప్రపంచకప్‌ ముగిసిన నాలుగు రోజులకే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ రూపంలో అభిమానులను అలరించేందుకు టీం ఇండియా సిద్ధమైంది. గురువారం విశాఖ వేదికగా జరిగే తొలిమ్యాచ్ దీనికి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ కాగా... వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్ గా ఉన్నాడు.

తాజాగా ముగిసిన వరల్డ్ కప్ లో భారత్‌ జట్టులో ఉన్న వాళ్లలో.. సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ మాత్రమే ఈ సిరీస్‌ ఆడబోతున్నారు. శ్రేయస్‌ అయ్యర్‌ ఈ సిరీస్‌ లో చివరి రెండు మ్యాచ్ లు ఆడనున్నాడు. పైగా వచ్చే ఏడాది జూన్ లో టీ20 ప్రపంచకప్‌ తోపాటు డిసెంబర్‌ 19న ఐపీఎల్‌ మినీ వేలం నేపథ్యంలో ఈ సిరీస్‌ లో సత్తాచాటాలని యువ ఆటగాళ్లు భావిస్తున్నారు!

ఇక ఈ సిరీస్ లో అటు బ్యాట్స్ మెన్ గా, ఇటు కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ పై కీలక బాధ్యత ఉంటుంది. వన్డే వరల్డ్ కప్ లో అంచనాలను అందుకోలేకపోయిన సూర్యకుమార్‌.. మొత్తం 7 ఇన్నింగ్సుల్లో కేవలం 106 పరుగులే చేశాడు. దీంతో... ఈ సిరీస్ లో కచ్చితంగా సత్తా చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది!

ఇక ఈ పిచ్ విషయానికొస్తే... విశాఖ పిచ్ బౌలింగ్‌ కే అనుకూలించే ఆస్కారముందని తెలుస్తుంది. ఇక్కడ జరిగిన మూడు టీ20ల్లోనూ బంతితే ఆధిపత్యం కావడం గమనార్హం. ఈ పిచ్ అటు పేసర్లకు, ఇటు స్పిన్నర్లకు చక్కగా సహకరిస్తుంది. కాగా... ఇక్కడ టీ20ల్లో 2016లో శ్రీలంకపై, 2022లో దక్షిణాఫ్రికాపై గెలిచిన భారత్‌.. 2019లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది.