Begin typing your search above and press return to search.

2036 ఒలింపిక్స్.. 10లక్షల కోట్లు.. భారత్ కు ఆతిథ్యం దక్కుతుందా?

2036లో ఇండియాకు ఆతిథ్యం దక్కుతుందా? మరో 13 ఏళ్లలో జరగనున్న ఒలింపిక్స్ కు భారత్ ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమని ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించారు.

By:  Tupaki Desk   |   17 Oct 2023 1:45 PM GMT
2036 ఒలింపిక్స్.. 10లక్షల కోట్లు.. భారత్ కు ఆతిథ్యం దక్కుతుందా?
X

క్రికెట్ లో ఫుట్ బాల్ లో ప్రపంచ కప్ లు జరుగుతాయి కానీ.. అవి ప్రపంచం అంతటినీ ప్రతిబింబిస్తాయా? అనేది ప్రశ్న.. ఎందుకంటే.. దక్షిణ అమెరికా ఖండంలో అసలు క్రికెట్ కు ప్రాధాన్యమే లేదు.. ఉత్తర అమెరికాలో ఇప్పుడిప్పుడే పుంజుకొంటున్నా , అంతర్జాతీయ స్థాయికి ఇంకా చాలా దూరంలో ఉంది. ఫుట్ బాల్ లో చూస్తే ఆసియా ఖండం ప్రభావం చాలా తక్కువ. జపాన్, దక్షిణ కొరియా, ఇరాన్ వంటి జట్లు తప్ప భారత్, పాకిస్థాన్, శ్రీలంక వంటి దేశాలు ప్రపంచ కప్ ఫుట్ బాల్ కు ఎంపికవడం మరో 20 ఏళ్లకైనా సాధ్యం కాదు. ఇక కామన్వెల్త్, ఆసియా క్రీడలు ఉన్నాయి కానీ.. అవి ఆయా ప్రాంతాలకు లేదా ఇతర ప్రత్యేక అర్హతలకు పరిమితం. కానీ, ఒలింపిక్స్ అలా కాదు.. ప్రపంచంలో అన్ని మూలల నుంచి దేశాలు ఈ క్రీడల్లో పాల్గొంటాయి. గెలవడం ముఖ్యం కాదు.. పాల్గొనడమే ప్రధానం అనేది ఒలింపిక్స్ థీమ్.

125 ఏళ్ల చరిత్ర ఒలింపిక్స్ అతి పురాతనమైన పోటీలు. 1896లో ఏథెన్స్ లో మొదలైన ఈ క్రీడలు మధ్యలో మూడు సార్లు తప్ప మాత్రమే జరగలేదు. 1916లో మొదటి ప్రపంచ యుద్ధం సందర్భంగా, 1940, 1944లో రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ఒలింపిక్స్ నిర్వహణ సాధ్యం కాలేదు. అయితే, ఆ తర్వాత నుంచి ఆగిందే లేదు. అయితే, టోక్యో వేదికగా 2020లో జరగాల్సిన ఒలింపిక్స్.. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడి.. 2021 జూలైలో జరిగాయి.

వచ్చే ఏడు పారిస్ లో సంబరం 2020 ఒలింపిక్స్ ఏడాది తర్వాత జరిగినప్పటికీ 2024 ఒలింపిక్స్ ను మాత్రం షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నారు. అంటే 2024 జూలై 26 నుంచి ఆగస్టు 11 మధ్య ఒలింపిక్స్ జరుగుతాయి. వీటికి ఫ్యాషన్ రాజధాని పారిస్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆపై 2028 ఒలింపిక్స్ కు అమెరికాలోని లాస్ ఏంజెల్స్, 2032 ఒలింపిక్స్ కు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ ఆతిథ్యం ఇస్తాయి.

2036లో ఇండియాకు ఆతిథ్యం దక్కుతుందా? మరో 13 ఏళ్లలో జరగనున్న ఒలింపిక్స్ కు భారత్ ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమని ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో మన దేశంలోనే ఒలింపిక్స్ జరుగుతాయనే నమ్మకం కలుగుతోంది. వాస్తవానికి ఒలింపిక్స్ నిర్వహణ అంటే మామూలు మాటలు కాదు. లక్షల కోట్ల రూపాయిలతో ముడిపడిన వ్యవహారం. భారత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటివరకు నిర్వహణ అనేది కష్టమని భావించేవారు. కొన్నేళ్లుగా మన దేశం ఆర్థికంగా బలపడిన నేపథ్యంలో ఇకపై మాత్రం సై అంటోంది. కాగా, పారిస్ ఒలింపిక్స్ నిర్వహణకు రూ.7 లక్షల కోట్లు ఖర్చవుతోంది. అది 2024 నాటికి లెక్క. 2036కు ఇది రూ.10 లక్షల కోట్లకు చేరుతుంది. మరి ఇంత భారం భారత్ మోయగలదా? అనేది చూడాలి.

మనతో పాటు పది దేశాలు 2036 ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ తో పాటు పది దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. దీనికి సంబంధించి.. ఆతిథ్యానికి ఆసక్తి చూపుతూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ)కి ప్రతిపాదనలు పంపాలి. ఆయా దేశాలతో ఐవోసీ చర్చించి.. స్టేడియాలు, ఇతర వసతులను పరిశీలిస్తుంది. వాటి బిడ్డింగ్ లను పరిశీలించి.. నిర్వహణకు ఏ దేశాన్ని ఎంపిక చేయాలో నిర్ణయం తీసుకుంటుంది.