Begin typing your search above and press return to search.

హైదరాబాద్ పోలీస్ హ్యాండ్సప్.. తలుపులేసి కివీస్-పాక్ వార్మప్

ఈ నేపథ్యంలో కివీస్-పాకిస్థాన్ మ్యాచ్ కు మేం భద్రత కల్పించలేం అంటూ హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.

By:  Tupaki Desk   |   20 Sep 2023 10:03 AM GMT
హైదరాబాద్ పోలీస్ హ్యాండ్సప్.. తలుపులేసి కివీస్-పాక్ వార్మప్
X

వచ్చే నెల 15 నుంచి భారత్ లో జరగనున్న వన్డే ప్రపంచ కప్ లో దేశంలోని అన్ని పెద్ద నగరాలు అంటే.. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా లకు ఆతిథ్యం దక్కింది. కానీ, దేశంలో ఐదో అతిపెద్ద నగరమైన హైదరాబాద్ కు మాత్రం చాన్సు దక్కలేదు. ఇది కాస్త విచిత్రమే. ఎందుకంటే హైదరాబాద్ ఉప్పల్ లో మంచి స్టేడియం ఉంది. దేశంలో మెట్రో రైల్ సర్వీస్ ఉన్న కొన్ని నగరాల్లో హైదరాబాద్ ఒకటి. అందులోనూ ఉప్పల్ స్టేడియం వరకు మెట్రో సర్వీస్ ఉండడం విశేషం. కానీ హైదరాబాద్ క్రికెట్ బోర్డు అసమర్థతో.. బీసీసీఐ చిన్నచూపో మన భాగ్య నగరానికి ప్రపంచ కప్ మ్యాచ్ నిర్వహించే భాగ్యం దక్కలేదు.

వార్మప్ లతో సరి..

ప్రపంచ కప్ అసలు మ్యాచ్ ల ఆతిథ్యం దక్కని హైదరాబాద్ కు బీసీసీఐ కంటి తుడుపుగా వార్మప్ మ్యాచ్ లను కేటాయించింది. విశేషం ఏమంటే.. హైదరాబాద్ లో టీమిండియాకు ఒక్క మ్యాచ్ కూడా లేకున్నా, పాక్ రెండు మ్యాచ్ లు ఆడనుంది. ఇక ఆ జట్టు న్యూజిలాండ్ తో వార్మప్ మ్యాచ్ ను హైదరాబాద్ లో నే ఆడనుంది. దీనికి ఈ నెల 29న ముహూర్తం. కానీ, ఈ మ్యాచ్ ను పూర్తిగా ఉప్పల్ స్టేడియం డోర్లు మూసేసి నిర్వహించుకోవాల్సి వస్తోంది.

పండుగలున్నాయ్.. భద్రత కల్పించలేం

హైదరాబాద్ లో గణేశ్ ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతాయో అందరికీ తెలిసిందే. దీనికి భారీ పోలీసు బందోబస్తు అవసరం. ఇదే సమయంలో ప్రపంచ కప్ సన్నాహక మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో కివీస్-పాకిస్థాన్ మ్యాచ్ కు మేం భద్రత కల్పించలేం అంటూ హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీక లేక హెచ్ సీఏ ఈ విషయాన్ని బీసీసీఐ సమాచారం ఇచ్చింది.

వార్మప్ మ్యాచ్ అయినా టికెట్లు

కివీస్-పాకిస్థాన్ ది వార్మప్ మ్యాచ్ అయినప్పటికీ దీనిని చూసేందుకు టికెట్లను నిర్ణయించారు. వరల్డ్ కప్ నకు బీసీసీఐ టికెటింగ్ పార్ట్ నర్ అయిన బుక్ మై షో యాప్ ద్వారా అభిమానులు టికెట్లు కొన్నట్లు సమాచారం. మరి పోలీసుల నిస్సహాయత నేపథ్యంలో వారికి మ్యాచ్ ను ప్రేక్షకులు లేకుండా నిర్వహించనున్న సంగతిని చేరవేశారో లేదో తెలియాల్సి ఉంది.