Begin typing your search above and press return to search.

వాట్ రా రెడ్డి.. బాగుంది రా మామ.. నితీశ్ తో గిల్ తెలుగు మాటల ముచ్చట

ఇంగ్లండ్ తో లార్డ్స్ లో మూడో టెస్టు.. పేస్ బౌలర్లకు అనుకూల పిచ్..పైగా రెండో టెస్టులో బ్యాటింగ్ లో విఫలం.. బంతితోనూ ఆకట్టుకోలేదు.

By:  Tupaki Desk   |   11 July 2025 3:27 PM IST
వాట్ రా రెడ్డి.. బాగుంది రా మామ.. నితీశ్ తో గిల్ తెలుగు మాటల ముచ్చట
X

ఇంగ్లండ్ తో లార్డ్స్ లో మూడో టెస్టు.. పేస్ బౌలర్లకు అనుకూల పిచ్..పైగా రెండో టెస్టులో బ్యాటింగ్ లో విఫలం.. బంతితోనూ ఆకట్టుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి టీమ్ ఇండియా తుది జట్టులో చోటు దక్కుతుందా? అనే అనుమానాలు కలిగాయి. అయితే, జట్టు మేనేజ్ మెంట్ వ్యూహం మాత్రం వేరుగా ఉంది. నితీశ్ ను కొనసాగించి.. మూడో పేసర్ ప్రసిద్ధ్ క్రిష్ణను పక్కనపెట్టింది. అయితే, తన ఎంపిక సరైనదే అని నిరూపించాడు నితీశ్.

ఆస్ట్రేలియాతో సిరీస్ కు ఎంపికైన పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ నితీశ్ రెడ్డి.. అక్కడ టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్నాడు. మంచి ఇన్నింగ్స్ లు ఆడాడు. అయితే, ఆ తర్వాత గాయాలతో జట్టుకు దూరమయ్యాడు. ఇంగ్లండ్ తో సిరీస్ లో తొలి టెస్టులో చోటు దక్కలేదు. రెండో టెస్టులో విఫలం అయ్యాడు. కానీ, ప్రఖ్యాత లార్డ్స్ లో మాత్రం మెరిశాడు. ప్రధాన బౌలర్లు బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్ వికెట్ తీయలేని సమయంలో.. ఇంగ్లండ్ ఓపెనర్లు డకెట్, క్రాలీలను ఒకే ఓవర్ లో ఔట్ చేసి ఔరా అనిపించాడు.

డకెట్ వికెట్ లక్ అనుకున్నా.. క్రాలీని మాత్రం కచ్చితమైన లెంగ్త్ తో బోల్తా కొట్టించాడు తెలుగు కుర్రాడు. మొత్తం మ్యాచ్ లో నాలుగు వికెట్లు పడితే అందులో రెండు నితీశ్ వే. మంచి రిథమ్ తో బంతులేసి అతడిని మాజీలు, జట్టు సభ్యులు పొగడ్తలతో ముంచెత్తారు.

కెప్టెన్ శుబ్ మన్ గిల్ అయితే.. నితీశ్ బౌలింగ్ ను బాగా ప్రోత్సహించాడు. అంతేకాదు.. తెలుగులో మాట్లాడాడు. ‘‘వాట్ రా రెడ్డీ.. బాగుంది రా మామ‘‘ అంటూ అచ్చం మనం తెలుగు కుర్రాళ్లు పలకరించినట్లే గిల్ మాట్లాడాడు. ఇవన్నీ స్టంప్ మైక్ లో రికార్డు అయ్యాయి.

పంజాబీ అయిన గిల్.. తెలుగులో మాట్లాడడం ఆకట్టుకుంది. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, గిల్ తెలుగు మాటలను చూసి టీవీలో అనాలసిస్ చేసే ఎక్స్ పర్ట్స్ కూడా ముచ్చటపడ్డారు. కాగా, గిల్-నితీశ్ మధ్య మంచి స్నేహ బంధం ఉందని, అటుఇటుగా ఒకే వయసు వారు కావడంతో సాన్నిహిత్యం ఏర్పడిందని విశ్లేషించారు. అందుకే గిల్ కు తెలుగు వచ్చి ఉంటుందని చెప్పుకొచ్చారు. మరి మన తెలుగు కుర్రాడు నితీశ్ కు గిల్ పంజాబీ నేర్పించి ఉంటాడా?