Begin typing your search above and press return to search.

నికోలస్‌ పూరన్‌ కు బిగ్‌ షాకిచ్చిన ఐసీసీ.. కారణం ఇదే!

వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్‌ పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కఠిన చర్యలు తీసుకుంది.

By:  Tupaki Desk   |   8 Aug 2023 4:31 AM GMT
నికోలస్‌  పూరన్‌  కు బిగ్‌  షాకిచ్చిన ఐసీసీ.. కారణం ఇదే!
X

గయానా వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. విండీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన వికెట్‌ కీపర్‌ - బ్యాటర్‌.. నికోలస్‌ పూరన్‌ కు ఐసీసీ షాకిచ్చింది. అంపైరింగ్ నిర్ణయాలను వ్యతిరేకించినందుకు పూరన్‌ కు మ్యాచ్ ఫీజులో కోత విధించింది. లెవెల్-1 ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడంటూ ఫైన్‌ విధించింది.

అవును... వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్‌ పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కఠిన చర్యలు తీసుకుంది. భారత్‌ తో జరిగిన రెండో టీ20లో నికోలస్ పూరన్.. అంపైర్ల నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శించాడనే అభియోగాలతో భారీ జరిమానాతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ విధించింది. ఇందులో భాగంగా మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది.

అంపైర్ల ఫిర్యాదుతో ఈ ఘటనపై విచారణ జరిపిన మ్యాచ్ రిఫరీ.. నికోలస్ పూరన్ ఐసీసీ నిబంధనల్లోనీ లెవెల్ 1 తప్పిదం చేశాడని గుర్తించి చర్యలు తీసుకున్నాడు. నికోలస్ పూరన్.. ఐసీసీ నిబంధనల్లో ఆర్టికల్ 2.7‌ను ఉల్లంఘించాడని అన్నారు. అయితే మ్యాచ్ రిఫరీ ముందు నికోలస్ పూరన్ తన తప్పిదాన్ని అంగీకరించడంతో తదుపరి విచారణ లేకుండా ఈ చర్యలు తీసుకున్నామని ఐసీసీ తమ ప్రకటనలో పేర్కొంది.

ఏం జరిగిందంటే?

విండీస్‌ ఇన్నింగ్స్‌ 4 ఓవర్‌ వేసిన అర్షదీప్‌ సింగ్‌ బౌలింగ్‌ లో నాలుగో బంతిని కైల్‌ మైర్స్‌ లెగ్‌ సైడ్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌ కు మిస్స్‌ అయ్యి అతడి ప్యాడ్‌ కు తాకింది. వెంటనే ఎల్బీకి అప్పీల్‌ చేయగా ఫీల్డ్‌ అంపైర్‌ ఔటని వేలు పైకెత్తాడు. వెంటనే మైర్స్‌ నాన్‌ స్ట్రైక్‌ లో ఉన్న పూరన్‌ తో చర్చించి రివ్యూకు వెళ్లాడు. రివ్యూలో ఫలితం అంపైర్‌ కాల్‌ తేలింది.

దీంతో మైర్స్‌ పెవిలియన్‌ కు వెళ్లక తప్పలేదు. ఈ క్రమంలో పూరన్‌ ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయం పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. "మీరు ఔట్‌ ఇవ్వకపోయి ఉంటే అది కచ్చితంగా నాటౌట్‌" అంటూ బహిరంగంగా విమర్శించాడు. ఈనేపథ్యంలోనే ఫీల్డ్‌ అంపైర్‌ లు ఫిర్యాదుతో మ్యాచ్‌ రిఫరీ పూరన్‌ పై చర్యలు తీసుకున్నాడు. కాగా... ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 గయనా వేదికగా ఈరోజు జరగనున్న సంగతి తెలిసిందే.