అటు కాటేరమ్మ కొడుకు..ఇటు కరీబియన్ భీకర వీరుడు.. షాకింగ్ రిటైర్మెంట్
వెస్టిండీస్ అంటేనే టి20 వీరులకు అడ్డా. అలాంటివారిలో చెలరేగి ఆడేవాడు నికొలస్ పూరన్. 29 ఏళ్ల పూరన్ ఐపీఎల్ ద్వారా మనందరికీ బాగా పరిచమే.
By: Tupaki Desk | 10 Jun 2025 12:34 PM IST29 ఏళ్లు.. సరిగ్గా చెప్పాలంటే అంతర్జాతీయ క్రికెట్ లో మాంచి జోష్ మీద ఉండే వయసు.. ఫిట్ నెస్, ఫామ్ అద్భుతంగా ఉండే వయసు.. ఓ బ్యాట్స్ మన్ బౌలర్ల మీద బలంగా ఆధిపత్యం సాగించే వయసు.. కానీ, ఓ క్రికెటర్ అనూహ్యంగా రిటైర్ అయ్యాడు. టి20ల్లో విధ్వంసక వీరుడుగా పేరు తెచ్చుకున్న అతడు.. మొన్నటిక మొన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోనూ దుమ్మురేపాడు. ఓ దశలో అత్యధిక పరుగుల జాబితాలో టాప్ లో ఉన్నాడు. కానీ, ఇంతలోనే ఏమైందో అంతర్జాతీయ క్రికెట్ కు బైబై చెప్పేశాడు. అన్నట్టు మన సన్ రైజర్స్ హైదరాబాద్ కూ ఓ ఏడాది అతడు ప్రాతినిధ్యం వహించాడు.
వెస్టిండీస్ అంటేనే టి20 వీరులకు అడ్డా. అలాంటివారిలో చెలరేగి ఆడేవాడు నికొలస్ పూరన్. 29 ఏళ్ల పూరన్ ఐపీఎల్ ద్వారా మనందరికీ బాగా పరిచమే. తాజా సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ కు ఆడుతూ ఏకంగా 524 పరుగులు సాధించాడు. 2019 నుంచి 2021 వరకు పంజాబ్ కింగ్స్ కు ఆడిన పూరన్.. 2022లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాతి నుంచి లక్నోకు ఆడుతున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన పూరన్ పాకిస్థాన్ సూపర్ లీగ్, బిగ్ బాష్, ఎస్ఏ లీగ్ ఇలా పదికిపైగా లీగ్ లలో ఆడుతుంటాడు.
వెస్టిండీస్ తరఫున 61 వన్డేలు ఆడిన పూరన్.. 1,983 పరుగులు, 106 టి20ల్లో 2,275 పరుగులు చేశాడు. అభిమానులు, సహచరులు నిక్కీపీ అని పిలుస్తుంటారు. గమనార్హం ఏమంటే.. పూరన్ మొన్నటివరకు వెస్టిండీస్ టి20 జట్టు కెప్టెన్ కూడా. మరో 8 నెలల్లో భారత్ లో టి20 ప్రపంచ కప్ జరగనుండగా.. ఐపీఎల్ లో మంచి అనుభవం ఉన్న అతడు అనూహ్యంగా రిటైర్మెంట్ ఇచ్చాడు.
కాగా, గత వారం దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ హెన్రిచ్ క్లాసెన్ కూడా అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ లో సన్ రైజర్స్ కు ఆడే క్లాసెన్ ను కాటేరమ్మ కొడుకు అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. 34 ఏళ్ల క్లాసెన్ మరికొన్నేళ్లు ఆడే సత్తా ఉన్నప్పటికీ రిటైర్ అయ్యాడు. భారత్ లో జరిగే టి20 ప్రపంచ కప్ ఆడతాడని భావిస్తుండగా.. ఐపీఎల్ మంచి అనుభవం ఉన్న క్లాసెన్ రిటైర్ అయ్యాడు. అయితే, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తీరు నచ్చక, సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించడంతో రిటైర్మెంట్ ప్రకటించేశాడు.