17 ఏళ్లు.. 14 ఏళ్లు.. ఐపీఎల్ లో కొట్టారు..ఇంగ్లండ్ టికెట్ కొట్టేశారు
వీరిద్దరూ తమస్థాయిని మించి ప్రతిభను కనబర్చి భవిష్యత్ భారత క్రికెట్ స్టార్లు అనే పేరు తెచ్చుకున్నారు. దీనికి తొలి మెట్టుగా ’ఇంగ్లండ్ టూర్’ టికెట్ కొట్టేశారు.
By: Tupaki Desk | 23 May 2025 12:00 AM ISTఅనేక మార్పులు.. మెగా రికార్డుల వేలంతో పాటు ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 18వ ఎడిషన్ లో అత్యంత ఆసక్తికరం అంశం ఏమిటి? అంటే.. ఐపీఎల్ కంటే చిన్న వయసు ఉన్న ఇద్దరు కుర్రాళ్లు ఈసారి లీగ్ లో ఆడడం. వీరిద్దరూ తమస్థాయిని మించి ప్రతిభను కనబర్చి భవిష్యత్ భారత క్రికెట్ స్టార్లు అనే పేరు తెచ్చుకున్నారు. దీనికి తొలి మెట్టుగా ’ఇంగ్లండ్ టూర్’ టికెట్ కొట్టేశారు.
టీమ్ ఇండియా జూన్ 20 నుంచి జరగనున్న ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ వెళ్లనుంది. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్ తో కొత్త కుర్రాళ్లకు చాన్స్ దొరికే వీలుంది. భారత బ్యాటింగ్ మూల స్తంభాలైన వీరి స్థానాలను భర్తీ చేసేది ఎవరా? అనే ఆసక్తి అభిమానుల్లో వ్యక్తమవుతోంది. అంతేకాదు రోహిత్ స్థానంలో కెప్టెన్ ఎవరు? అనేది కూడా చర్చనీయమైంది. ఈ ప్రశ్నలకు రెండు రోజుల్లో సమాధానాలు లభించే చాన్సుందని తెలుస్తోంది. ఇదే సమయంలో ఇంగ్లండ్ లో భారత ఏ జట్టు కూడా టూర్ చేయనుంది.
ఇప్పటికే ఈ జట్టును ప్రకటించేశారు.
ఇక సీనియర్, ఏ జట్లు మాత్రమే కాకుండా ఇంగ్లండ్ లో భారత అండర్ 19 జట్టు కూడా పర్యటన చేయనుంది. ఈ జట్టును తాజాగా వెల్లడించారు. ఇందులో ప్రస్తుత ఐపీఎల్ లో సత్తాచాటిని 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్), 17 ఏళ్ల ఆయుష్ మాత్రే (చెన్నై సూపర్ కింగ్స్)లకు చోటు దక్కింది. 5 వన్డేలు, 2 మల్టీ డే మ్యాచ్ లు ఆడే ఈ జట్టుకు ఆయుష్ మాత్రే కెప్టెన్ కావడం గమనార్హం.
దాదాపు నెల రోజుల పాటు ఇంగ్లండ్ టూర్ చేయనున్న అండర్-19 జట్టులో తెలుగు కుర్రాళ్లు ఎవరికీ చోటు దక్కలేదని తెలుస్తోంది. 16 మందిని ఎంపిక చేయగా వారిలో తెలుగు పేర్లున్న వారు ఎవరూ లేరు. ఇక ప్రస్తుత ఐపీఎల్ లో కేవలం 35 బంతుల్లోనే వేగవంతమైన రెండో సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ, 7 మ్యాచ్ లు ఆడి 252 పరుగులు సాధించాడు. మాత్రే.. చెన్నై తరఫున ఓపెనర్ గా ఆరు మ్యాచ్ లు ఆడి 206 పరుగులు చేశాడు. స్వింగ్ బౌలర్లు చెలరేగే ఇంగ్లండ్ లో వీరిద్దరూ ఎలా ఆడతారో చూడాలి.
భారత అండర్ 19 జట్టు: ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్ సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), హర్ వన్ష్ సింగ్ (వికెట్ కీపర్), ఆర్‌ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధాజిత్ గుహ, ప్రణవ్ రాఘవేంద్ర, మొహ్మద్ ఇనాన్, ఆదిత్య రాణా, అన్మోల్‌జీత్ సింగ్.
స్టాండ్ బై ప్లేయర్లు: నమన్ పుష్కక్, డి.దీపేశ్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారి, అలంకృత్ రాపోలే (వికెట్ కీపర్).
