ఇంగ్లండ్ టూర్.. ’నాయకుడొచ్చాడు‘.. భారత క్రికెట్ లో కొత్త శకం షురూ
భారత క్రికెట్ లో కొత్త శకం ప్రారంభమైంది.. భవిష్యత్ నాయకుడు ఎవరో తేలిపోయింది.
By: Tupaki Desk | 24 May 2025 3:07 PM ISTభారత క్రికెట్ లో కొత్త శకం ప్రారంభమైంది.. భవిష్యత్ నాయకుడు ఎవరో తేలిపోయింది. స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్ అనంతరం జట్టు భారాన్ని మోసేదెవరో స్పష్టమైంది. వచ్చే నెల 20 నుంచి ఇంగ్లండ్ లో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్ కు టీమ్ ఇండియాను ప్రకటించారు. రోహిత్ రిటైర్మెంట్ నేపథ్యంలో కొత్త కెప్టెన్ నూ ప్రకటించారు. వాస్తవానికి 20 రోజుల కిందటి వరకు రోహిత్, కోహ్లి రిటైర్ అవుతారని ఊహించలేదు. కానీ, అదంతా అలా జరిగిపోయింది. ఇక కొత్త కెప్టెన్ ఎవరో తేలిపోయింది.
ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ కు యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్ ను కెప్టెన్ గా ప్రకటించారు. అందరూ ఊహించినట్లే గిల్ కు బాధ్యతలు దక్కాయి. వైస్ కెప్టెన్ గా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ ను ఎంచుకున్నారు. ఐపీఎల్ లో అదరగొడుతున్న యువ ఓపెనర్ సాయి సుదర్శన్ కు టెస్టు జట్టులో చోటు దక్కింది. పశ్చిమ బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ కూ పిలుపు వచ్చింది. దేశవాళీల్లో అదరగొట్టిన కరుణ్ నాయర్ ను సెలక్టర్లు కనికరించారు.
జైశ్వాల్ తో పాటు సీనియర్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్, స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, పేస్ ఆల్ రౌండర్లు శార్దూల్ ఠాకూర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి, హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్, పేసర్లు ప్రసిద్ధ్ క్రిష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు చోటు దక్కింది.
టెస్టు జట్టు పగ్గాలు శుబ్ మన్ గిల్, బుమ్రా, పంత్ మధ్య ఎవరికి దక్కుతాయి? అనే చర్చకు తెరపడింది. 25 ఏళ్ల గిల్ ను ఎంపిక చేయడం ద్వారా తాము దీర్ఘకాల ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నామని సెలక్టర్లు తేల్చిచెప్పారు. బుమ్రా గాయాలను, పనిభారాన్ని పరిగణనలోకి తీసుకుని అతడికి కెప్టెన్సీ ఇవ్వలేదు. కాగా, 2014 డిసెంబరులో దిగ్గజం ధోనీ నుంచి కోహ్లికి టెస్టు కెప్టెన్సీ దక్కింది. అప్పటికి కోహ్లికి 27 ఏళ్లు. సరిగ్గా ఏడేళ్లు అతడు జట్టును టెస్టుల్లో నడిపించాడు. 2021 చివర్లో కోహ్లి తప్పుకోవడంతో రోహిత్ శర్మకు పగ్గాలు దక్కాయి. రోహిత్ కూడా 2024 చివరి వరకు కెప్టెన్ గా చేశాడు. అంటే మూడేళ్లు టెస్టు కెప్టెన్ గా ఉన్నాడు. అప్పటికే రోహిత్ కు 34 ఏళ్లు. ధోనీ కూడా 2008లో 27 ఏళ్ల వయసులో టెస్టు కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు మాత్రం శుబ్ మన్ కు 25 ఏళ్లే. అంటే దాదాపు 17 ఏళ్ల తర్వాత అందరి కంటే చిన్న వయసు కెప్టెన్ తో టీమ్ ఇండియా ఇంగ్లండ్ టూర్ కు సిద్ధం అవుతోంది అన్నమాట.
