Begin typing your search above and press return to search.

నెదర్లాండ్స్ గెలుపులో తెలుగోడు సహా మనోళ్లు ముగ్గురు

ప్రపంచంలో మరే జట్టులోనూ లేని విధంగా నెదర్లాండ్స్ జట్టులోనే భారతీయు మూలాలున్న క్రికెటర్లు ముగ్గురు ఉన్నారు. అందులోనూ విజయవాడకు చెందిన తేజ నిడమానూరు ఒకడు కావడం విశేషం.

By:  Tupaki Desk   |   18 Oct 2023 12:50 PM GMT
నెదర్లాండ్స్ గెలుపులో తెలుగోడు సహా మనోళ్లు ముగ్గురు
X

భారత్ ఏకైక వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ లో మజా ఏది..? బ్యాటింగ్ కు ఎక్కువగా అనుకూలించే పిచ్ లపై పరుగుల ప్రవాహం ఏది..? క్రికెట్ ను మతంగా భావించే దేశంలో స్టేడియాలు అభిమానులతో నిండిపోవేమిటి..? చిన్న జట్లు పెద్ద జట్లకు షాకిస్తాయనుకుంటే, అండర్ డాగ్ లు రెచ్చిపోతాయనుకుంటే అదేమీ కనిపించదేమిటి..? ఇవీ మొన్నటివరకు సగటు అభిమానుల్లో తలెత్తిన ప్రశ్నలు. కానీ, మూడే రోజుల్లో అంతా మారిపోయింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ను కసి కూన అఫ్ఘానిస్తాన్ మట్టికరిపించింది. దీంతో మెగా టోర్నీ మంచి రసవత్తరంగా మారింది. ఇక మంగళవారం దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ చిత్తు చేసింది. దీంతో మరింత ఆసక్తి నెలకొంది.

కథ మారింది.. మజా పెరిగింది..

ప్రపంచ కప్ లో న్యూజిలాండ్-అఫ్ఘానిస్థాన్ మధ్య 16వ మ్యాచ్ జరుగుతోంది. లీగ్ దశలో మొత్తం 42 మ్యాచ్ లున్నాయి. అంటే ఇప్పటికే దాదాపు 40 శాతం మ్యాచ్ లు పూర్తయ్యాయి. అయితే, అఫ్ఘాన్, నెదర్లాండ్స్ సంచలనాలతో కప్ నకు ఇప్పుడ కళ వచ్చింది. ఈ నేపథ్యంలో అఫ్ఘాన్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ లో ఏం జరుగుతుందోననే ఆసక్తి వ్యక్తమవుతోంది. పటిష్ఠంగా ఉండి, ఆల్‌ రౌండ్‌ నైపుణ్యాలతో సత్తాచా టుతున్న దక్షిణాఫ్రికాకు నెదర్లాండ్స్ కంగుతినిపించిన తీరు అద్భుతం. ఇక ఇంగ్లండ్ ను అఫ్ఘాన్ అయితే తేలిగ్గానే కొట్టేసింది.

ఆ విజయంలో మనోళ్లు..

నెదర్లాండ్స్ జట్టులో మనోళ్లు ముగ్గురున్నారు. ఆ మాటకొస్తే నిన్నటి దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో కేశవ్ మహరాజ్ నూ కలుపుకొంటే మైదానంలో నలుగురు భారతీయ మూలాలున్న ఆటగాళ్లున్నట్లు. కాగా, నెదర్లాండ్స్‌ మొదట బ్యాటింగ్ చేసి 246 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. దక్షిణాఫ్రికా 207 పరుగులకే ఆలౌటైంది. దీనివెనుక నెదర్లాండ్స్‌ బౌలర్ల పట్టుదల ఉంది.

ఓపెనర్, ఆల్ రౌండర్, మిడిలార్డర్

ప్రపంచంలో మరే జట్టులోనూ లేని విధంగా నెదర్లాండ్స్ జట్టులోనే భారతీయు మూలాలున్న క్రికెటర్లు ముగ్గురు ఉన్నారు. అందులోనూ విజయవాడకు చెందిన తేజ నిడమానూరు ఒకడు కావడం విశేషం. ఇక కేవలం 20 ఏళ్ల వయసున్న విక్రమ్ జిత్ సింగ్ నెదర్లాండ్స్ ఓపెనర్. పంజాబ్ కు చెందిన వీరి కుటుంబం నెదర్లాండ్స్ లో స్థిరపడింది. ఎడమచేతి వాటం బ్యాట్స్ మన్ అయిన విక్రమ్ జీత్.. నెదర్లాండ్స్ అండర్ 19 జట్టుకూ ఆడడం గమనార్హం. మరో ఆటగాడు ఆర్యన్ దత్. 20 ఏళ్ల 159 రోజుల వయసున్న ఆర్యన్ ఈ ప్రపంచ కప్ లో అతి పిన్న వయసు ఆటగాళ్లలో ఒకడు. ఆఫ్ స్పిన్నర్ అయిన ఆర్యన్ లోయరార్డర్ లో ఉపయుక్త బ్యాట్స్ మన్.

తేజ.. ఆర్యన్ ఆదుకున్నారు..

దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో విక్రమ్ జీత్ 2 పరుగులకే ఔటయ్యాడు. కానీ, తేజ ఆరో స్థానంలో బ్యాటింగ్ కు దిగి 20 పరుగులు చేశాడు. టాప్ స్కోరర్ ఎడ్వర్డ్స్ (78)కు అండగా నిలిచాడు. ఇక ఆర్యన్ మాత్రం కీలక పాత్ర పోషించాడు. 9వ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన అతడు పటిష్ఠ దక్షిణాఫ్రికా బౌలింగ్ ను ఎదుర్కొంటూ 9 బంతుల్లోనే 29 పరుగులు చేశాడు. మూడు సిక్స్ లు కొట్టాడు. దక్షిణాఫ్రికా –నెదర్లాండ్స్ మధ్య గెలుపును నిర్ణయించింది ఈ పరుగులే అనడంలో సందేహం లేదు. కాగా బౌలింగ్ లోనూ ఆర్యన్ కీలక పాత్ర. నెదర్లాండ్స్ బౌలింగ్ దాడిని మొదలు పెట్టింది అతడే. 5 ఓవర్లు వేసిన అతడు 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఒక మెయిడెన్ కూడా వేసి దక్షిణాఫ్రికాపై ఒత్తిడి పెంచాడు.