Begin typing your search above and press return to search.

బౌలర్స్ హవా... ముంబైకి అలా షాకిచ్చిన గుజరాత్ టైటాన్స్!

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు భారీ స్కోర్ చేసే అవకాశాన్ని ముంబై బౌలర్లు ఇవ్వలేదు

By:  Tupaki Desk   |   25 March 2024 4:08 AM GMT
బౌలర్స్ హవా... ముంబైకి అలా షాకిచ్చిన గుజరాత్ టైటాన్స్!
X

ఐపీఎల్ సీజన్ 17లో 5వ మ్యాచ్ లో భాగంగా ముంబై వర్సెస్ గుజరాత్ జట్లు పోటీపడ్డాయి. దీంతో... ఈ మ్యాచ్ లో కచ్చితంగా ముంబై గెలుస్తాదనే కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా బోణీ కొడతాడని భావించారు. అయితే ఇది ఐపీఎల్.. ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చు.. ఈ మ్యాచ్ లో కూడా చివరి ఓవర్లో అదే జరిగింది.. ఫలితంగా విజయం గుజరాత్ టైటాన్స్ ను వరించింది.

సాయి సుదర్శన్ వర్సెస్ బూమ్రా:

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు భారీ స్కోర్ చేసే అవకాశాన్ని ముంబై బౌలర్లు ఇవ్వలేదు. ప్రధానంగా బూమ్రా మ్యాజిక్ చేశాడు. ఇందులో భాగంగా... 4 ఓవర్లు వేసిన 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్ లో సాయి సుదర్శన్‌ 39 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 45 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.

సరైన భాగస్వామ్యం మిస్!:

ఇన్నింగ్స్ ప్రారంభంలో నాలుగు ఫోర్లతో మాంచి ఊపుమీద ఉన్నట్లు కనిపించిన సాహో ను నాలుగో ఓవర్లో బూమ్రా తనదైన యార్కర్ తో ఔట్ చేశాడు. అప్పటికి సాహో వ్యక్తిగత స్కోరు 19 పరుగులు. అనంతరం చక్కని షాట్లతో క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన గిల్ ను చావ్లా ఔట్ చేశాడు. ఈ సమయంలో అజ్మతుల్లా ఒమర్జాయ్ తో కలిసి సుదర్శన్ ఇన్నింగ్స్ ని నడిపించాడు. ఈ క్రమంలో 11వ ఓవర్ లో అజ్మతుల్లా ఔట్‌ కావడంతో నిలబెడుతుందనుకున్న భాగస్వామ్యం విడిపోయింది.

కట్టుదిట్టంగా ముంబై బౌలింగ్:

ఇలా సాగిన గుజరాత్ ఇన్నింగ్స్ లో సాయి సుదర్శన్‌ 45, శుభ్‌ మన్‌ గిల్‌ 31, సాహో 19, అజ్మతుల్లా 17, రాహుల్ తెవాతియా 22 లతో పాటు 12 ఎక్స్ స్ట్రాలు కూడా కలవడంతో గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగలిగింది. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేయకపోవడంలో ముంబై బౌలర్లలో బూమ్రా తోపాటు చావ్లా, కొయెట్జీ లు కీలక భూమిక పోషించారు. దీంతో... ముంబై సునాయాసంగా చేజ్ చేసే అవకాశం ఉందని చాలామంది భావించారు!

ముంబైకి బిగినింగ్ లోనే బిగ్ షాక్:

169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు ప్రారంభంలోనే షాక్ తగిలింది. ఇందులో భాగంగా అజ్మతుల్లా దెబ్బకు తొలి మూడు ఓవర్లలోనే ముంబై కిషన్, నమన్ ధీర్ ల వికెట్లు కోల్పోయింది. దీంతో గుజరాత్ టైటాన్స్ లో నమ్మకం కలిగిందనే చెప్పాలి.

రోహిత్‌ శర్మ – బ్రెవిస్ ల భాగస్వామ్యం!:

మొదట్లో కష్టాల్లో ఉన్నట్లు కనిపించిన ముంబైకి రోహిత్ శర్మ, బ్రేవిస్ లు కీలకమైన భాగస్వామ్యాన్ని అందించారు. ఇందులో భాగంగా.. 30 పరుగులకే 2 వికెట్లు పడిపోయిన నేపథ్యంలో 107 పరుగుల వరకూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. ఈ క్రమంలో... 13వ ఓవర్‌ తొలి బంతికి రోహిత్‌ ను సాయి కిశోర్‌ ఎల్బీడబ్లూగా అవుట్ చేయడంతో గుజరాత్ కాస్త ఊపిరి పీల్చుకుంది.

ముంబై ఇన్నింగ్స్ లో రోహిత్‌ శర్మ 29 బంతుల్లో 43, బ్రెవి స్‌ 38 బంతుల్లో 46 పరుగులు చేశారు.

ముంబైపై అనూహ్యంగా పెరిగిన ఒత్తిడి:

రోహిత్ శర్మ ఔట్ అయిన తర్వాత గుజరాత్ బౌలర్లు ముంబైపై ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో 16వ ఓవర్లో బ్రెవిస్‌ ను మోహిత్‌ ఔట్‌ చేయడంతో ఆ ఒత్తిడి మరింత పెరిగినట్లయ్యింది. అయినప్పటికీ ముంబైకి అద్భుతమైన అవకాశం ఉందనే చెప్పాలి. ఆఖరి నాలుగు ఓవర్లలో 39 పరుగులు చేయాలి. ఈ పరిస్థితుల్లో టిమ్‌ డేవిడ్‌ (11) కూడా ఔటయ్యాడు.

12 బంతులు 27 పరుగులు:

ముంబైకి చివరి రెండు ఓవర్లలోనూ 27 పరుగులు అవసరం పడింది. ఈ పరిస్థితుల్లో జాన్సన్ వేసిన 19వ ఓవర్లో తిలక్ వర్మ తొలి బంతికే సిక్స్ బాదాడు. అయితే మిగిలిన ఐదు బంతుల్లోనూ జాన్సన్ రెండు పరుగులు మాత్రమే ఇవ్వడంతో పాటు కొయెట్జీని ఔట్ చేశాడు. దీంతో... అనూహ్యంగా మ్యాచ్ పై గుజరాత్ టైటాన్స్ పైచేయి సాధించినట్లయ్యింది.

ఉమేష్ యాదవ్ మ్యాజిక్!:

ఈ పరిస్థితుల్లో చివరి ఓవర్లో ఉమేష్ యాదవ్ బంతందుకున్నాడు. అయితే... తొలి రెండు బంతుల్లోనూ హార్థిక్ పాండ్యా 6, 4 కొట్టాడు. దీంతో... మ్యాచ్ రసవత్తరంగా మారిపోయింది. అయితే తర్వాత బంటికే హార్ధిక్ ని ఔట్ చేయడంతోపాటు.. చివరి మూడు బంతుల్లోనూ రెండే పరుగులు ఇవ్వడంతో గుజరాత్ టైటాన్స్ బోణీ కొట్టింది.

గుజరాత్ బౌలర్స్ లో అజ్మతుల్లా, ఉమేష్ యాదవ్, జాన్సన్, మోహిత్ శర్మ లు తలో రెండేసి వికెట్లూ తీసుకోగా.. సాయి కిశోర్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇలా గుజరాత్ బౌలర్ల సమిష్టి కృషితో ముంబై జట్టు 9 వికెట్లకు 162 పరుగులే చేయగలిగింది.