ఢిల్లీ హ్యాట్రిక్ రనౌట్లు.. ఇలా కూడా గెలవొచ్చని చూపించిన ముంబై
ఐదుసార్లు టైటిల్ కొట్టి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్ (ఎంఐ). చివరిసారిగా టైటిల్ సాధించి ఐదు సీజన్లు గడిచిపోయాయి.
By: Tupaki Desk | 14 April 2025 9:46 AM ISTఐదుసార్లు టైటిల్ కొట్టి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్ (ఎంఐ). చివరిసారిగా టైటిల్ సాధించి ఐదు సీజన్లు గడిచిపోయాయి. 2020 తర్వాత మళ్లీ ఆ జట్టు చాంపియన్ గా నిలవలేదు. గత కొన్ని సీజన్లలో అయితే దారుణంగా ఆడుతోంది. ప్రస్తుతం కూడా అత్యంత బలహీనంగా కనిపిస్తోంది.
ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ కు ముందు ముంబై ఐదు మ్యాచ్ లు ఆడి ఒక్కటే గెలిచింది. ఢిల్లీతోనూ ఓడిపోయే స్థితికి వచ్చింది. కానీ, ఆఖర్లోనే అద్భుతం జరిగింది. దీంతో మ్యాచ్ లను ఇలా కూడా గెలవొచ్చా? అని అభిమానులు మరీ ముఖ్యంగా ముంబై ఫ్యాన్స్ ఆశ్చర్యపోయేలా నెగ్గింది.
క్రికెట్ లో వరుసగా మూడు వికెట్లు తీస్తే హ్యాట్రిక్ అంటారు. ఇది సహజంగా బౌలర్లకే సాధ్యం. వికెట్లు వారి ఖాతాలోకే వెళ్తాయి. కానీ, బౌలర్ ఎవరూ లేకుండానే ముంబై హ్యాట్రిక్ వికెట్లు తీసి మ్యాచ్ గెలిచి ఔరా అనిపించింది.
ఆదివారం ఢిల్లీతో మ్యాచ్ లో చివరి మూడు వికెట్లు ఆశుతోష్ శర్మ, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ వరుస బంతుల్లో రనౌటై ముంబైకి విజయం అందించారు. అదెలాగంటే..
ఢిల్లీ గెలవడానికి 12 బంతుల్లో 23 పరుగులు అవసరం. చేతిలో మూడు వికెట్లు ఉన్నాయి. ఈ స్థితిలో ముంబై బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బంతిని అందుకున్నాడు. ఫినిషర్ గా పేరు తెచ్చుకుంటున్న యువ ఆశుతోష్ క్రీజులో ఉన్నాడు. బుమ్రా స్టైల్ లో యార్కర్ గా వచ్చిన తొలి బంతిని అతడు అడ్డుకున్నాడు. వాస్తవానికి సింగిల్ వచ్చే అవకాశం ఉన్నా ఆశుతోష్ పరుగు తీయలేదు. రెండో, మూడో బంతులను ఫోర్ కొట్టాడు. దీంతో ఢిల్లీ గెలవడానికి 9 బంతుల్లో 15 పరుగులు అవసరం. ఆ జట్టుదే గెలుపు అనుకుంటుండగా.. ఆశుతోష్ లేని రెండో పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. కుల్దీప్ బ్యాటింగ్ కు దిగాడు. ఇతడు కూడా రెండో పరుగుకు యత్నించి రనౌటయ్యాడు. చివరి వికెట్ గా వచ్చిన మోహిత్ శర్మ సైతం పరుగు తీయబోగా శాంట్నర్ వేసిన డైరెక్ట్ హిట్ తో ఔటయ్యాడు. దీంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే హ్యాట్రిక్ రనౌట్లు నమోదై ఢిల్లీ ఓడిపోయింది. ముంబై 12 పరుగులతో నెగ్గింది. ఈ సీజన్ లో ఢిల్లీ నాలుగు వరుస విజయాలకు బ్రేక్ పడింది.
అంతకుముందు ముంబై 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 59 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలో దింపిన కరుణ్ నాయర్ దుమ్మురేపాడు. కేవలం 40 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. ఇందులో 5 సిక్స్ లు, 12 ఫోర్లు ఉండడం గమనార్హం. కరుణ్ జోరు చూస్తే ముంబై చిత్తుగా ఓడేలా కనిపించింది. అయితే, శాంట్నర్ అద్భుత బంతితో అతడిని ఔట్ చేసి మ్యాచ్ ను మలుపుతిప్పాడు. ఇక కేఎల్ రాహుల్ (15), ట్రిస్టన్ స్టబ్స్ (1) అనవసర షాట్లతో వికెట్లు పారేసుకుని తమ జట్టు ఓటమికి ఓ కారణమయ్యారు.