అత్యంత సైలెంట్ గా ఐపీఎల్ నుంచీ ధోనీ రిటైర్మెంట్..?
మరి దాదాపు ఐదేళ్లవుతోంది.. మిగిలింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాత్రమే.
By: Tupaki Desk | 6 April 2025 10:11 PM ISTకెప్టెన్ గా ఉండి కూడా ఆస్ట్రేలియాతో సిరీస్ జరుగుతుండగానే 2014 డిసెంబరులో టెస్టు ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు మహేంద్ర సింగ్ ధోనీ
2019 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో అనూహ్య రనౌట్ తర్వాత ఏడాది పాటు మౌనంగా ఉండి 2020 ఆగస్టు 15న వన్డే, టి20 ఫార్మాట్ ల నుంచి వైదొలగాడు...
మరి దాదాపు ఐదేళ్లవుతోంది.. మిగిలింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాత్రమే. మూడేళ్ల కిందటే ఈ లీగ్ లో కెప్టెన్ పదవి నుంచి తప్పుకొన్నాడు ధోనీ..
ఇప్పుడు 43 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడుతున్న అతడు బ్యాటింగ్ లో మునుపటి దూకుడు చూపలేకపోతున్నాడు. కీపింగ్ అనేది తర్వాత సంగతి. ధోనీ కారణంగా ఓ యువ బ్యాట్స్ మన్ కు అవకాశం పోతోంది.
దీంతో ధోనీ ఎంతకాలం ఐపీఎల్ లో కొనసాగుతాడు..? ఇప్పటికే టోర్నీలో అత్యంత పెద్ద వసుస్కుడిగా ఉన్న ధోనీ రికార్డులను చూసి ఎవరూ ఏమీ అనడం లేదు. అయితే, ఎంతకాలం అని మాత్రం చూస్తుండగలరు..? అసలే జట్టు పరాజయాల బాటలో ఉంది.
ఈ నేపథ్యంలోనే ఎపుడూ లేని విధంగా శనివారం ధోనీ తల్లిదండ్రులు మ్యాచ్ చూసేందుకు చెన్నై రావడంతో అందరూ ధోనీకి ఇదే చివరి మ్యాచ్ అని భావించారు. రిటైర్మెంట్ ప్రకటన ఉంటుందని ఆశించారు. కానీ, మిస్టర్ కూల్ అదేమీ చెప్పలేదు.
కాగా, ధోనీ తన రిటైర్మెంట్ పై తాజాగా స్పందించాడు. తన రిటైర్మెంట్ ఇప్పట్లో లేదని తేల్చి చెప్పాడు. ఆడాలా వద్దా అని ఏడాదికి ఒకసారి సమీక్షించుకునే తాను.. వచ్చే ఐపీఎల్ సీజన్ ఆడాలా? వద్దా? అనేది నిర్ణయించుకునేందుకు 10 నెలల సమయం ఉందన్నాడు. వచ్చే జూలైతో తాను 44వ ఏట అడుగుపెడతానని కూడా చెప్పాడు. అప్పటికి తన శరీరం ఏది నిర్ణయిస్తే అది జరుగుతుందని పేర్కొన్నాడు. వచ్చే సీజన్ ప్రారంభానికి ముందు శరీరం సహకరిస్తే ఆడతానని.. ఇక చాలు అనిపించే వరకు ఇదే విధంగా ముందుకెళ్తానని తెలిపాడు.
అయితే, ధోనీ కెప్టెన్సీ ఎంత కూల్ గా ఉంటుందో.. అతడి రిటైర్మెంట్ నిర్ణయాలూ అంతే కూల్ గా ఉంటాయి. అంతర్జాతీయ ఫార్మాట్ కు అతడు వీడ్కోలు పలికిన విధమే దీనికి నిదర్శనం.
