Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : ఐపీఎల్ కు ధోని రిటైర్ మెంట్.. ఇక సీఎస్కే లో ఈ కొత్త రోల్..

ఐపీఎల్‌కు ఆటగాడిగా వీడ్కోలు పలికి చెన్నై సూపర్ కింగ్స్‌కు మెంటార్‌గా ఎంఎస్ ధోనీ బాధ్యతలు చేపట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది. బ్యాటింగ్‌కు దూరమైనా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంటూ యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయనున్నట్లు కథనాలు చెబుతున్నాయి. అయితే ధోనీ కొత్త పాత్రపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

By:  Tupaki Desk   |   17 Nov 2026 4:03 PM IST
బ్రేకింగ్ : ఐపీఎల్ కు ధోని రిటైర్ మెంట్.. ఇక సీఎస్కే లో ఈ కొత్త రోల్..
X

క్రికెట్ ప్రపంచంలో రిటైర్మెంట్ అనేది ఆటగాళ్లందరికీ ఒక సాధారణ ప్రక్రియ. కానీ మహేంద్ర సింగ్ ధోనీ విషయంలో మాత్రం అది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా క్లైమాక్స్ లాంటిది.. ఈ ఏడాదే చివరి ఐపీఎల్ అని అభిమానులు ఏటా కన్నీళ్లు పెట్టుకోవడం.. మరుసటి ఏడాది మళ్లీ డెఫినెట్లీ నాట్ అంటూ ధోనీ పసుపు జెర్సీ వేసుకోవడం ఆనవాయితీగా మారింది. అయితే.. ఎట్టకేలకు ఆ సస్పెన్స్‌కు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. బ్యాటు, గ్లౌజులు పక్కన పెట్టి చెన్నై సూపర్ కింగ్స్ డగౌట్‌లో మెంటార్ అనే కొత్త అవతారం ఎత్తేందుకు మన తలా సిద్ధమవుతున్నారట..

సాధారణంగా క్రికెట్‌లో కెప్టెన్లు ఉంటారు.. వికెట్ కీపర్లు ఉంటారు.. ఆఖరి ఓవర్లో సిక్సర్లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చే ఫినిషర్లు ఉంటారు. కానీ గ్రౌండ్‌లో అడుగుపెట్టకుండానే కేవలం తన చూపులతోనే ప్రత్యర్థి బౌలర్లకు బీపీ తెప్పించే కళ మాత్రం ఒక్క ధోనీకే సొంతం. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇలా భారత్‌కు మూడు ఐసీసీ కప్పులు అందించిన ఘనత ఆయనది. ఇక ఐపీఎల్‌లో సీఎస్కేను అత్యంత విజయవంతమైన జట్టుగా మార్చిన ఘనత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇన్నాళ్లూ చివరి రెండు ఓవర్లలో క్రీజులోకి వచ్చి హెలికాప్టర్ షాట్లతో అభిమానులకు పూనకాలు తెప్పించిన ధోనీ.. ఇకపై బౌండరీ లైన్ అవతల కూర్చుని తన మైండ్ గేమ్ ఆడనున్నారు. పాపం.. ఇప్పటివరకు ధోనీ బ్యాటింగ్ చూడటానికి స్టేడియాలకు పోటెత్తిన అభిమానులు.. ఇకపై కెమెరామెన్ ఎప్పుడు డగౌట్ వైపు ఫోకస్ చేస్తాడా అని ఎదురుచూడాల్సిన పరిస్థితి రాబోతోంది..

ఆటగాడిగా మైదానంలో లేకపోయినా డ్రెస్సింగ్ రూమ్‌లో ధోనీ ఉనికి సీఎస్కేకు కొండంత బలం. ముఖ్యంగా కుర్ర ఆటగాళ్లకు ఒత్తిడిని ఎలా జయించాలో చివరి బంతి వరకు ప్రశాంతంగా ఉంటూ ప్రత్యర్థిని ఎలా ఉక్కిరిబిక్కిరి చేయాలో ధోనీ కంటే బాగా ఎవరు నేర్పించగలరు? మీరు గ్రౌండ్‌లో ఆడండి.. టెన్షన్ పడే పని నేను చూసుకుంటా అన్నట్లుగా ధోనీ మార్గదర్శకత్వం ఉండబోతోంది.

నిజానికి ఆటగాళ్లు రిటైర్ అవుతారు.. కొత్త తరాలు వస్తుంటాయి. కానీ ధోనీ విషయంలో మాత్రం పాత్ర మారింది.. పవర్ మారలేదు అన్న డైలాగ్ అతికినట్లు సరిపోతుంది. క్రీజులో ఉన్నా.. మెంటార్ కుర్చీలో కూర్చున్నా.. ధోనీ.. ధోనీ అనే నినాదాలతో స్టేడియాలు దద్దరిల్లడం మాత్రం ఖాయం. ఎందుకంటే నాయకత్వం అనేది ఒక పదవి కాదు.. అది ఒక బ్రాండ్.. ఆ బ్రాండ్ పేరు ఎం.ఎస్. ధోనీ..