Begin typing your search above and press return to search.

అనూహ్య నిర్ణయం.. టీమిండియా ప్రధాన పేసర్ స్వదేశానికి

దాదాపు రెండేళ్లుగా అతడే టీమిండియా ప్రధాన పేసర్

By:  Tupaki Desk   |   27 July 2023 11:27 AM GMT
అనూహ్య నిర్ణయం.. టీమిండియా ప్రధాన పేసర్ స్వదేశానికి
X

దాదాపు రెండేళ్లుగా అతడే టీమిండియా ప్రధాన పేసర్. ఏడాదిన్నరగా వన్డేల్లో 43 వికెట్లు.. మరే బౌలర్ కూడా అందులోనూ స్పిన్నర్ కూడా ఇన్ని వికెట్లు తీయలేదు. మరో కీలక పేసర్ దూరమైన పరిస్థితుల్లో జట్టుపై ఏమాత్రం ప్రభావం పడకుండా నడిపిస్తున్నాడు. అంతేకాదు.. స్వదేశంలో మూడు నెలల్లో జరగనున్న ప్రపంచ కప్ లో అతడే కీలకం అని భావిస్తున్నారు. అలాంటి అతడిని వెస్టిండీస్ తో వన్డే సిరీస్ నుంచి అకస్మాత్తుగా స్వదేశానికి పంపిచారు. అది కూడా వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు రోజు కావడం గమనార్హం.

ఎందుకిలా..?

పైన చెప్పుకొన్నదంతా టీమిండియా ప్రధాన పేసర్, హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్ గురించి. వెస్టిండీస్ తో మూడు వన్డేల సిరీస్ గురువారం నుంచి ప్రారంభం కానుండగా సిరాజ్ ను స్వదేశానికి పంపారు. డ్రాగా ముగిసిన రెండో టెస్టులో సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. మొహమ్మద్ షమీకి విశ్రాంతి ఇవ్వడం, బుమ్రాకు గాయం తగ్గకపోవడంతో సిరాజ్ ఈ సిరీస్ లో పేస్ దళానికి నాయకుడిగా నిలిచాడు. తనపై పెట్టకున్న అంచనాలను అతడు అందుకున్నాడు. వన్డే సిరీస్ లోనూ ఇలాగే రాణిస్తాడని భావిస్తున్న క్రమంలో బోర్డు మాత్రం మరోలా ఆలోచించింది. సిరాజ్ ను స్వదేశానికి పంపింది.

మోకాలి నొప్పి.. పనిభారం కారణం..

టెస్టులతో పోలిస్తే వెస్టిండీస్ వన్డేల్లో మెరుగైన జట్టే. అనూహ్యంగా ప్రపంచ కప్ నకు తొలిసారి దూరమైనంత మాత్రాన ఆ జట్టును తేలిగ్గా తీసిపడేయలేం. అందులోనూ సొంతగడ్డపై ఆడుతోంది. అయితే, సిరాజ్ కు ఇప్పటికే పనిభారం ఎక్కువైంది. టెస్టులు, వన్డేలు, టి20 ఇలా విరామం లేకుండా ఆడుతున్నాడు. దీనికితోడు ఐపీఎల్ కూడా. అంతేగాక అతడికి మోకాలిలో నొప్పి ఉన్నట్లు తేలడంతో తక్షణమే స్వదేశానికి పంపారు. వన్డేలతో పాటు టి20లకూ జట్టులో లేని అశ్విన్, రహానే, భరత్, నవదీప్ సైనీలతో కలిసి అతడు భారత్ కు తిరిగి రానున్నాడు.

శార్దూలే సీనియర్

సీనియర్లు ఎవరూ లేని క్రమంలో టీమిండియా పేస్ ను నడిపించేది పేస్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్. అతడికి వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తోడ్పాటు అందిస్తాడు. శార్దూల్ 35 మ్యాచ్ లాడి 50 వికెట్లు పడగొట్టాడు. వీరు కాక.. మిగతా పేసర్లు కశ్మీర్ స్పీడ్ గన్ ఉమ్రాన్ మలిక్, జైదేవ్ ఉనద్కత్, కొత్త ముఖం ముఖేష్ కుమార్. ఈ ముగ్గురిలోనూ ముఖేష్ ఇప్పటివరకు వన్డేలు ఆడలేదు.

కొసమెరుపు : వెస్టిండీస్ సొంతగడ్డపై ఎంత తోపు అయినా.. సిరాజ్ లేకున్నా ఫర్వాలేదని అనుకుందేమో..? బీసీసీఐ మరే పేసర్ నూ వెస్టిండీస్ కు పంపడం లేదు.