టీమ్ ఇండియా సిసలైన పేసు గుర్రం... మన హైదరాబాదీ
ఒకవైపు బ్యాటర్లు బాదేస్తున్నా కనీసం ఆందోళన లేకుండా మరో ఓవర్ వేసేందుకు కూడా సిద్ధమయ్యే బౌలర్ ఎవరు..? ఎంతటి సుదీర్ఘ స్పెల్స్ వేసినా కనీసం అలుపు లేనిది ఎవరు? ఈ ప్రశ్నలకు జవాబు కావాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
By: Tupaki Desk | 2 Aug 2025 8:14 PM ISTఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడిన ఏకైక పేస్ బౌలర్ ఎవరు..? ఈ సిరీస్‌లో అందరికంటే ఎక్కువ ఓవర్లు వేసింది ఎవరు..? ఒకవైపు బ్యాటర్లు బాదేస్తున్నా కనీసం ఆందోళన లేకుండా మరో ఓవర్ వేసేందుకు కూడా సిద్ధమయ్యే బౌలర్ ఎవరు..? ఎంతటి సుదీర్ఘ స్పెల్స్ వేసినా కనీసం అలుపు లేనిది ఎవరు? ఈ ప్రశ్నలకు జవాబు కావాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
అయ్యో బుమ్రా లేడా..? కానీ, అతడున్నాడు..
ఇంగ్లండ్‌తో సుదీర్ఘ టెస్టు సిరీస్‌కు ముందే సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ జట్టుకు దూరమయ్యాడు. స్టార్ పేసర్ బుమ్రా ఉన్నప్పటికీ అతడికి గాయం బెడద. సిరీస్‌కు ముందే బుమ్రా ఐదు టెస్టులు ఆడడని మేనేజ్‌మెంట్ చెప్పేసింది. మరి ఇలాగైతే జట్టు విజయావకాశాలు దెబ్బతింటాయి కదా..? కానీ, ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అదేమీ జరగలేదు. ఇప్పటివరకు నాలుగు టెస్టులు జరగ్గా బుమ్రా లేని ఆ టెస్టు (రెండోది)లోనే భారత్ గెలిచింది. దీనివెనుక ఉన్నది హైదరాబాదీ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్.
మనిషా? మెషినా..?
సిరాజ్ హైదరాబాద్ గల్లీల్లో టెన్నిస్ బంతితో రాటుదేలినవాడు. దీనికితోడు అతడి శరీర నిర్మాణం మరింత స్ట్రాంగ్. అందుకే సిరాజ్ బంతితో రనప్ తీస్తుంటే (పేసు) గుర్రం దౌడు తీస్తున్నట్లే ఉంటుంది. సిరాజ్ ఆదేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు గాయంతో జట్టుకు దూరమైన సందర్భాలు లేవంటేనే అతడి ఫిట్‌నెస్ లెవల్స్ ఏమిటో తెలిసిపోతుంది. సిరాజ్ శరీర నిర్మాణమే కాదు.. అతడికి ఫిట్‌నెస్‌పై శ్రద్ధ కూడా ఎక్కువే. అందుకే మైదానంలో అంత హుషారుగా కనిపిస్తాడు. కెప్టెన్‌ను అడిగి మరీ బౌలింగ్ చేస్తాడు.
బుమ్రా లేకుంటేనే..
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో సిరాజ్.. నాలుగు వికెట్ల ప్రదర్శన గురించి ఎంతచెప్పినా తక్కువే. ఇంగ్లండ్ ఓపెనర్లు తొలుత చితకబాదినా అతడు ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. మరుసటి స్పెల్‌లో పుంజుకుని వారికి చుక్కలు చూపించాడు. ఇంగ్లండ్ కీలక బ్యాటర్ జోరూట్ డిఫెన్స్‌ను బద్దలుకొట్టి ఎల్బీ చేసిన తీరు అమోఘం అనే చెప్పాలి. మిగతా మూడు వికెట్లు తీసిన బంతులు కూడా అద్భుతం. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 51.2 ఓవర్లు సాగితే అందులో సిరాజ్ వేసినవి 16.2. కెరీర్‌లో 41వ టెస్టు ఆడుతున్న సిరాజ్..25 సార్లు బుమ్రాతో కలిసి బరిలో దిగాడు. ఆ మ్యాచ్‌లలో 74 వికెట్లు తీశాడు. బుమ్రా లేకుండా 16వ టెస్టు ఆడుతున్న అతడు 44 వికెట్లు తీశాడు. అంటే.. బుమ్రా లేకుంటేనే సిరాజ్‌లోని అసలు సిసలు పేసు గుర్రం బయటకు వస్తుందన్నమాట. మరోవైపు ఈ సిరీస్‌లో ఐదుకు ఐదు టెస్టులు ఆడిన సిరాజ్ ఏకంగా 155 ఓవర్లు వేశాడు. మొదటి టెస్టులో ఎంతటి ఉత్సాహంగా ఉన్నాడో ఇప్పుడూ అంతే జోష్‌తో కనిపిస్తున్నాడు. అందుకే ఈ హైదరాబాదీ వెరీవెరీ స్పెషల్.
