బౌలింగ్ లో సెంచరీకి దగ్గర.. సన్ రైజర్స్ అతడిని పక్కనపెట్టాల్సిందే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గత సీజన్ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపుతోంది.
By: Tupaki Desk | 14 April 2025 10:06 AM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గత సీజన్ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపుతోంది. ఇప్పుడో అప్పుడో 300 కొట్టేస్తాం అంటోంది.. కానీ, బౌలింగ్ లో ఓ పేసర్ మాత్రం సెంచరీ కొట్టేస్తా అనేలా బంతులేస్తున్నాడు. అతడేమీ జూనియర్ కాదు.. సెకండ్ గ్రేడ్ పేసర్ అంతకన్నా కాదు.. టీమ్ ఇండియాకే ఎన్నో మ్యాచ్ లలో విజయాలు అందించినవాడు. కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా?
మేటి పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ ఐపీఎల్ 18 సీజన్ లో సన్ రైజర్స్ కు ఆడబోతున్నాడంటే అందరూ హ్యాపీగా ఫీలయ్యారు. గత మూడు సీజన్ లలో గుజరాత్ కు ఆడిన అతడు ఆ జట్టు విజయాల్లో కీలకంగా నిలిచాడు. ఇదే సమయంలో వన్డే ప్రపంచ కప్ లో టీమ్ ఇండియాకు అద్భుత ప్రదర్శనలు చేశాడు. అయితే, ప్రపంచ కప్ తర్వాత మోకాలి గాయం షమీ కెరీర్ ను దెబ్బతీసింది. ఏడాదికి పైగా విరామం అనంతరం దాదాపు ఆరు నెలల కిందట అతడు బరిలో దిగాడు. దేశవాళీల్లో ఆడి ఫిట్ నెస్ నిరూపించుకోవడంతో టీమ్ ఇండియాకు తీసుకున్నారు.
వాస్తవానికి మేటి పేసర్ బుమ్రా వెన్నుగాయంతో దూరం కావడం, అవిశ్రాంతంగా ఆడుతున్న హైదరాబాదీ పేసర్ సిరాజ్ గాడితప్పడంతో షమీని చాంపియన్స్ ట్రోఫీకి తీసుకెళ్లారు. ఆ టోర్నీలో ఫర్వాలేదనేలా రాణించాడు.
నవంబరులో జరిగిన మెగా వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ షమీని రూ.10 కోట్ల భారీ ధరకు తీసుకుంది. 2022 నుంచి గుజరాత్ టైటాన్స్ కు ఆడుతున్న అతడి రేటు రూ.6.25 కోట్లు మాత్రమే. ఈ లెక్కన సన్ రైజర్స్ మంచి రేటే పెట్టింది.
కానీ, షమీ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. శనివారం పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో ఏకంగా 75 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. వరుసగా నాలుగు సిక్స్ లు కొట్టించుకున్నాడు. ఈ సీజన్ లో 6 మ్యాచ్ లలో 5 వికెట్లే పడగొట్టాడు.
ఇదివరకు షమీ బంతి తీసుకుంటే భరోసా కనిపించేది. కానీ, ఇప్పుడు అంత ప్రభావవంతంగా లేడు. పైగా వికెట్లు తీయడం లేదు. పంజాబ్ తో మ్యాచ్ లో పరుగులు ఇచ్చేశాడు.
ఐపీఎల్ లో ఓ భారత బౌలర్ ఇచ్చిన అత్యధిక పరుగులు ఇవే. 2024లో మోహిత్ శర్మ (గుజరాత్ టైటాన్స్) 73 పరుగులు ఇచ్చాడు. అయితే, అతడు షమీలా మేటి పేసర్ కాదనే సంగతి గుర్తుంచుకోవాలి.
ఈ నేపథ్యంలో షమీకి కొన్ని మ్యాచ్ ల నుంచి విశ్రాంతి ఇస్తేనే ఉత్తమం. తద్వారా అతడు పుంజుకునే అవకాశం ఉంటుంది. అసలే గాయం నుంచి తిరిగొచ్చాడు కాబట్టి ఆ మాత్రం రెస్ట్ అవసరమే.