Begin typing your search above and press return to search.

ఉపాధి హామీ కూలీగా సన్ రైజర్స్ క్రికెటర్ చెల్లెలు.. యూపీలో స్కాం

ఆ టీమ్ ఇండియా క్రికెటర్ కుటుంబం మరోసారి వ్యక్తిగత కారణాలతో వార్తల్లో నిలుస్తోంది.

By:  Tupaki Desk   |   4 April 2025 1:00 AM IST
ఉపాధి హామీ కూలీగా సన్ రైజర్స్ క్రికెటర్ చెల్లెలు.. యూపీలో స్కాం
X

ఆ టీమ్ ఇండియా క్రికెటర్ కుటుంబం మరోసారి వ్యక్తిగత కారణాలతో వార్తల్లో నిలుస్తోంది. ఆరేడేళ్ల కిందట భార్యతో విభేదాల కారణంగా తీవ్ర వివాదాస్పదమైన అతడు.. ఇప్పుడు చెల్లెలు కుటుంబం నిర్వాకంతో ఊహించని అపవాదును ఎదుర్కొనాల్సి వస్తోంది. టీమ్ ఇండియాకు మూడు ఫార్మాట్లలోనూ మేటి క్రికెటర్ అయిన అతడి సంపాదన రూ.కోట్లలోనే ఉంటుంది. మొన్నటికి మొన్నటికి మొన్న చాంపియన్స్ ట్రోఫీ గెలిచినందుకే రూ.కోట్లలో నజరానా వచ్చింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో కొత్త ఫ్రాంచైజీ రూ.10 కోట్లు పెట్టి అతడిని కొనుక్కుంది. అయితే, అతడి చెల్లెలు కుటుంబం మాత్రం రూ.వేల కోసం కక్కుర్తి పడింది.

అదేంటోగానీ.. టీమ్ ఇండియా మేటి పేసర్ షమీ మంచి ఫామ్ లో ఉండగా వ్యక్తిగత, కుటుంబ వివాదాలు అతడిని చుట్టుముడుతుంటాయి. 2018-19 సమయంలో భార్యతో వివాదం చుట్టుముట్టింది. దాన్నుంచి ఎలాగోలా షమీ బయటపడ్డాడు. వాస్తవానికి అప్పటికే ఐదారేళ్లుగా టీమ్ ఇండియాకు ఆడుతున్నాడు షమీ. అతడు గనుక పెళ్లి చేసుకోదల్చుకుంటే పెద్ద కుటుంబాల సంబంధాలే వచ్చేవి. షమీ మాత్రం అత్యంత సాధారణ నేపథ్యం ఉన్న ఇష్రత్ జహాన్ ను పెళ్లిచేసుకున్నాడు. వీరికి ఒక అమ్మాయి పుట్టాక విభేదాలు తలెత్తాయి.

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ కు ఆడుతున్న షమీ కుటుంబం మరోసారి వార్తల్లో నిలిచింది. అతడి సోదరి పేరు ఉపాధి హామీ పథకం లబ్ధిదారుల జాబితాలో ఉండడమే దీనికి కారణం.

షమీ సోదరితో పాటు బావ కూడా ఉపాధి కూలీ డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. అయితే, ఇందులో షమీ సోదరి అత్త గులె ఆయేషా పాత్ర ఉందని చెబుతున్నారు. ఈమె యూపీలోని అమ్రోరా గ్రామ పెద్ద. దీంతో తన కుటుంబ సభ్యుల పేర్లను ఉపాధి హామీ లబ్ధిదారుల జాబితాలో చేర్చినట్లు ప్రాథమిక విచారణలోనూ తేలింది. ఇప్పటికే జిల్లా స్థాయి విచారణ చేపట్టారు. జాబితాలోని షమీ బంధువుల పేర్లను తొలగించినట్లు కలెక్టర్ నిధి గుప్తా తెలిపారు. పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఈ కుంభకోణం 2021-24 మధ్య నాటిదని సమాచారం.

పనిచేయకుండానే 18 మంది ఉపాధి హామీలో వేతనాలు తీసుకున్నారని.. వీరిలో గులే ఆయేషా, షమీ సోదరి షబీనా, ఆమె భర్త ఘజ్నావి, అతడి సోదరులు ఆమిర్ సుహైల్, నస్రుద్దీన్, షేఖు ఉన్నారని కలెక్టర్ చెప్పారు. కాగా,

షమీ సోదరి కుటుంబం వారంతట వారే పేర్లు నమోదు చేసుకున్నారా? లేక వారి పేర్లతో ఇతరులు మోసానికి పాల్పడ్డారా? అన్నది తెలియాల్సి ఉంది. గ్రామ పెద్దగా ఉన్నందున షమీ సోదరి అత్తనే సూత్రధారి అని భావిస్తున్నారు. నిజానిజాలు తేలాల్సి ఉంది.