సెలక్టర్ల పై విసుగెత్తిన స్టార్ క్రికెటర్... రిటైర్మెంట్ నిర్ణయం...?
టీమ్ ఇండియా స్టార్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ ఈ ఏడాది ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించాడు.
By: Tupaki Desk | 28 Aug 2025 11:00 PM ISTఫిట్ గా ఉన్నట్లు చెప్పినా.. దేశవాళీ ఆడబోతున్నట్లుగా చెప్పినా.. టి20 ఫార్మాట్ లో జరగబోతున్న ఆసియా కప్ నకు తనను ఎంపిక చేయకపోవడంతో స్టార్ క్రికెటర్ తీవ్ర అసహనంతో ఉన్నట్లున్నాడు...! ఇంగ్లండ్ తో సిరీస్ కు ముందు కూడా తనకు ఇదే అనుభవం ఎదురవడంతో విసుగు చెందినట్లు కనిపిస్తున్నాడు...! పైకి తిరిగి తన రిటైర్మెంట్ పై కథనాలు వస్తుండడంతో ఆగ్రహానికి గురయ్యాడు.. అతడి తాజా వ్యాఖ్యలు ఇదే విషయం చెబుతున్నాయి.
మళ్లీ ఇంకెప్పుడు ఎంపిక చేస్తారు..?
టీమ్ ఇండియా స్టార్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ ఈ ఏడాది ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించాడు. కానీ, మెరుగ్గా బౌలింగ్ చేయలేకపోయాడు. జట్టు విజయాలకు తోడ్పడలేదు. సాదాసీదా పేసర్ లా కనిపించిన షమీని కొన్ని మ్యాచ్ లకు పక్కనపెట్టారు. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ అనంతరం మోకాలి గాయంతో ఏడాదికి పైగా క్రికెట్ కు దూరమైన షమీ.. నిరుడు దేశవాళీ క్రికెట్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆపై ఐపీఎల్ కు రూ.10 కోట్లకు పైగా పెట్టి సన్ రైజర్స్ కొనుక్కుంది. ఈ ధరకు తన ప్రతిభకు కూడా షమీ న్యాయం చేయలేదనే చెప్పాలి. దీనికి కారణం.. గాయం తాలూకు ప్రభావం అని విశ్లేషణలు వచ్చాయి. అందుకే మేటి పేసర్ బుమ్రా ఫిట్ నెస్ పై అనుమానాలు ఉన్నప్పటికీ షమీని ఇంగ్లండ్ టూర్ కు తీసుకెళ్లలేదు. తాజాగా వచ్చే నెల 9 నుంచి జరిగే ఆసియా కప్ నకూ పరిగణించలేదు.
ఏం జరుగుతోంది..?
ఐదు టెస్టుల ఇంగ్లండ్ టూర్, టి20 ఫార్మాట్ లో జరగబోయే ఆసియా కప్ నకు షమీ ఎంపికపై చర్చ జరిగిందా? అని సెలక్టర్లను ప్రశ్నిస్తే, తాము షమీని సంప్రదించామని చెబుతున్నారు. అతడు పూర్తి ఫిట్ గా లేడనే ఎంపిక చేయలేదని కథనాలు వస్తున్నాయి. దీంతో ఇంతకూ ఏం జరుగుతోంది? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇవన్నీ తన భవిష్యత్, సామర్థ్యంపై అనుమానాలు రేకెత్తించేవి కావడంతో షమీ కూడా తీవ్రంగా స్పందించాడు. నాతో ఎవరికైనా సమస్య ఉంటే చెప్పండి... నా రిటైర్మెంట్ తో వారి జీవితాలు బాగుపడతాయని భావిస్తే చెప్పండి.. నాకు విసుగు వచ్చిన రోజు వెళ్లిపోతాను.. నన్ను జాతీయ జట్టుకు ఎంపిక చేయకుంటే దేశవాళీకి ఆడతాను.. అని నేరుగా సెలక్టర్లకు అల్టిమేటం ఇచ్చినట్లు మాట్లాడాడాడు.
ఇక రిటైర్మెంట్ ప్రకటిస్తాడా..??
34 ఏళ్ల షమీ ప్రస్తుతం ఈస్ట్ జోన్ తరఫున దులీప్ ట్రోఫీకి ఆడుతున్నాడు. ఇది టెస్టు ఫార్మాట్ లో జరుగుతోంది. ఈ ఫార్మాట్ కు సిద్ధంగా ఉన్నా.. టి20 ఫార్మాట్ లో జరిగే ఆసియా కప్ నకు ఎంపిక చేయలేదు. ఇదే ప్రశ్నను షమీ లేవనెత్తాడు. ఫిట్ గా ఉన్నట్లు భావిస్తే ఎంపిక చేయండి.. లేదంటే లేదు అని అల్టిమేటం ఇచ్చాడు. కానీ, సెలక్టర్లు హర్షిత్ రాణా వంటి యువ బౌలర్ల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వన్డేలు అప్పుడో ఇప్పుడో ఒకటి జరుగుతుంటాయి. టెస్టులకు ఎలాగూ షమీని పరిగణించడం లేదు. అందుకని ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. మరోవైపు 2027 వన్డే ప్రపంచ కప్ ఆడాలనేది షమీ కలగా తెలుస్తోంది. కానీ, ఫిట్ నెస్ సహకరిస్తుందా? అన్నది చూడాలి. ఏదేమైనా ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ కు కూడా ఎంపిక చేయకపోతే షమీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం ఖాయం.
