Begin typing your search above and press return to search.

ఐపీఎల్‌కు మొయిన్ అలీ గుడ్‌బై: పీఎస్‌ఎల్‌ వైపు మొగ్గు చూపడానికి అసలు కారణాలివే!

ప్రస్తుతం 38 ఏళ్ల వయసులో ఉన్న మొయిన్ అలీ తన కెరీర్ చరమాంకంలో తీసుకున్న ఈ నిర్ణయం వెనుక లోతైన విశ్లేషణ ఉంది.

By:  A.N.Kumar   |   18 April 2026 5:41 PM IST
ఐపీఎల్‌కు మొయిన్ అలీ గుడ్‌బై: పీఎస్‌ఎల్‌ వైపు మొగ్గు చూపడానికి అసలు కారణాలివే!
X

ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ఖరీదైన.. గ్లామరస్ లీగ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్). ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడేందుకు వేల కోట్లు కుమ్మరించే ఫ్రాంచైజీల కోసం వేచి చూస్తుంటారు. అయితే ఇంగ్లండ్ మాజీ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ మాత్రం ఇందుకు భిన్నంగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లో జరిగే మెగా లీగ్‌కు గుడ్‌బై చెప్పి పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో ఆడేందుకు మొగ్గు చూపడం ఇప్పుడు క్రీడాలోకంలో హాట్ టాపిక్‌గా మారింది.

వయసు భారమా? కెరీర్ మలుపా?

ప్రస్తుతం 38 ఏళ్ల వయసులో ఉన్న మొయిన్ అలీ తన కెరీర్ చరమాంకంలో తీసుకున్న ఈ నిర్ణయం వెనుక లోతైన విశ్లేషణ ఉంది. ఇటీవల ఒక పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆయన వయసు పెరిగే కొద్దీ ప్రాధాన్యతలు మారుతాయని స్పష్టం చేశారు. ఐపీఎల్ సుదీర్ఘమైన టోర్నమెంట్. దాదాపు రెండు నెలల పాటు నిరంతర ప్రయాణాలు, తీవ్రమైన పోటీ, మానసిక ఒత్తిడి ఆటగాళ్లపై ప్రభావం చూపుతాయి. ఈ దశలో శారీరక దృఢత్వాన్ని కాపాడుకుంటూనే ఆటకు న్యాయం చేయాలంటే పీఎస్‌ఎల్ లాంటి తక్కువ వ్యవధి గల టోర్నీలు మేలని ఆయన భావించారు. దీనివల్ల ఫిట్‌నెస్ సమస్యలు తలెత్తకుండా కెరీర్‌ను మరికొంత కాలం పొడిగించుకోవచ్చనేది అలీ ప్లాన్.

కుటుంబానికి అగ్రతాంబూలం

మొయిన్ అలీ తీసుకున్న ఈ నిర్ణయంలో వ్యక్తిగత కారణాలు కూడా ప్రధాన పాత్ర పోషించాయి. క్రికెట్ కారణంగా ఏళ్ల తరబడి కుటుంబానికి దూరంగా గడపాల్సి వస్తోందని, కెరీర్ చివరి దశలో తన పిల్లలతో, కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పీఎస్‌ఎల్ షెడ్యూల్ ఐపీఎల్ కంటే తక్కువగా ఉండటం, తక్కువ మ్యాచ్‌లు ఉండటం ఆయనకు వరంగా మారింది. "డబ్బు కంటే మానసిక ప్రశాంతత, కుటుంబంతో గడిపే సమయం నాకు ఇప్పుడు చాలా ముఖ్యం" అని ఆయన వ్యాఖ్యానించడం విశేషం.

గత సీజన్ చేదు అనుభవం

మొయిన్ అలీ ఐపీఎల్ వీడటానికి మరో బలమైన కారణం గత సీజన్‌లో ఎదురైన అనుభవాలు. గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అలీని రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ, సీజన్ మొత్తం మీద ఆయనకు కేవలం ఆరు మ్యాచ్‌లలో మాత్రమే అవకాశం కల్పించింది. అందులోనూ లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు పంపడం వల్ల తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం రాలేదు.

బెంచ్ మీద కూర్చోవడం కంటే మైదానంలో ఆడుతూ జట్టు విజయాల్లో పాలుపంచుకోవాలని ఏ ఆటగాడైనా కోరుకుంటాడు. "నేను ఇంకా మైదానంలో పరుగుల వరద పారించగలననే నమ్మకం నాకుంది. కేవలం బెంచ్ కే పరిమితం కావడం నాకు ఇష్టం లేదు" అని అలీ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అందుకే, తనకు ప్రాధాన్యతనిచ్చే లీగ్‌ను ఆయన ఎంచుకున్నారు.

కరాచీ కింగ్స్‌లో కీలక పాత్ర

ప్రస్తుతం మొయిన్ అలీ పీఎస్‌ఎల్‌లో కరాచీ కింగ్స్ తరఫున ఆడుతున్నారు. అక్కడ ఆయనకు సుమారు రూ.2.14 కోట్ల పారితోషికం లభిస్తోంది. కేవలం ఆర్థిక పరమైన అంశాలే కాకుండా జట్టులో ఆయనకు లభిస్తున్న గౌరవం, కీలక నిర్ణయాల్లో భాగస్వామ్యం ఆయనను ఆకట్టుకున్నాయి. గతంలో షెడ్యూల్ క్లాష్ వల్ల పీఎస్‌ఎల్‌కు రాలేకపోయానని, ఇప్పుడు ఆ లోటు తీరిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

మొత్తానికి ఐపీఎల్ లాంటి భారీ వేదికను కాదని పీఎస్‌ఎల్‌ను ఎంచుకోవడం ద్వారా మొయిన్ అలీ ఒక కొత్త చర్చకు తెరలేపారు. ఆటగాళ్లు కేవలం గ్లామర్, భారీ కాంట్రాక్టుల వెంటే కాకుండా.. తమ మానసిక ఆరోగ్యం, కుటుంబ అవసరాలు, ఆడేందుకు లభించే అవకాశాల ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఈ పరిణామం నిరూపిస్తోంది.