Begin typing your search above and press return to search.

“నీ బలుపు తగలెయ్య”... వరల్డ్ కప్ పై కాళ్లు, చేతిలో బీరు!

ఆదివారం అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ వన్ డే ఇంటర్నేషనల్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత్‌ ను ఆస్ట్రేలియా ఓడించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Nov 2023 8:02 AM GMT
“నీ బలుపు తగలెయ్య”... వరల్డ్  కప్  పై కాళ్లు,  చేతిలో బీరు!
X

ఆదివారం అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ వన్ డే ఇంటర్నేషనల్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత్‌ ను ఆస్ట్రేలియా ఓడించిన సంగతి తెలిసిందే. దీంతో ఆరోసారి వరల్డ్ కప్‌ ను సొంతం చేసుకుంది ఆ దేశం. ఈ టోర్నీలో లీగ్ నుంచి ఓటమనేది ఎరగకుండా.. అద్భుతంగా ఆడిన టీమిండియా ఫైనల్లో ఓడటంతో ఫ్యాన్స్ కన్నీరు మునీరయ్యారు.


ఈ టోర్నీలో లీగ్ దశలో వరుసగా తొమ్మిది మ్యాచ్ లు గెలవడం, సెమీస్ లో దుమ్మురేపడంతో ఫైనల్ లో టీం ఇండియా పెర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదని అంతా భావించారు. అయితే నరుడు ఒకటి తలిస్తే ప్రకృతి మరొకటి తలచిందన్నట్లుగా ఊహించని ఫలితం టీం ఇండియా అభిమానులను హర్ట్ చేసింది. ఆ సంగతి అలా ఉంటే... మరోవైపు ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ ప్రవర్తన అంతకు మించి కోపం తెప్పించిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

అవును... తాజా ప్రపంచకప్‌ 2023 ట్రోఫీ గెలిచి మరోసారి విశ్వవిజేతగా నిలిచిన ఆసీస్ ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వారి సంబరాలు అంబరాన్నంటాయి. ఇందులో భాగంగా మైదానంలో ట్రోఫీ పట్టుకుని ఆటగాళ్లంతా సందడి చేశారు. ట్రోఫీని ముద్దాడుతూ, ఫోటోలు దిగుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ సమయంలో ఆసీస్ బ్యాటర్ మిచెల్ మార్ష్... సోఫాలో కూర్చుని, ఆ ట్రోఫీపై కాళ్లు పెట్టి రిలాక్స్ అవుతున్నాడు!

వన్డే ప్రపంచకప్ 2023 ట్రోఫీని మైదానం నుంచి రూం కి తీసుకెళ్లిన ఆసిస్ ఆటగాళ్లు... మరోసారి ట్రోఫీతో ఫొటోలు దిగారు. ఈ సమయంలో మిచెల్ మార్ష్ సోఫాలో కూర్చుని, చేతిలో బీర్ బాటిల్ వంటిది పట్టుకుని, ప్రపంచకప్ 2023 ట్రోఫీపై తన రెండు కాళ్లు పెట్టి, ఫొటోలకు పోజులిచ్ఛాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది.

ఈ ఫోటోను తొలుత ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్ చేయగా.. అక్కడనుంచి ఆన్ లైన్ వేదికగా వైరల్ అయింది. ఇది చూసిన ఫాన్స్ మార్ష్ పై మండిపడుతున్నారు. ప్రపంచం మొత్తం మా పాదాక్రాంతమైంది అని చెప్పేలా ఆ ఫొటో ఉందని.. ఆరుసార్లు కప్ గెలిచిన గర్వం అతడి కళ్లలో కనిపించిందని అంటున్నారు. దీంతో... నీ బలుపు తగలెయ్య అని తెలుగు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు!

ఇదే సమయంలో ప్రపంచ కప్ ను, టీపాయ్ ని ఒకలా చూడకు కాస్త గౌరవం ఇవ్వు అని ఒకరు కామెంట్ చేస్తే... అంత బలుపు అవసరమా అంటూ ఇంకొందరు మండిపడుతున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని ఐసీసీని కోరుతున్నారు. భారత్ గెలిస్తే.. మన క్రికెటర్లు ఆ కప్‌ ను గుండెల్లో పెట్టుకొని చూసుకునేవారు.. పూజలు చేసేవారని.. కర్మ కాకపోతే వాళ్ల చేతికి వెళ్లిందని అంటున్నారు! ప్రస్తుతం ఈ బలుపు పిక్ కి వస్తున్న కామెంట్లు మాత్రం వైరల్ అవుతున్నాయి!