Begin typing your search above and press return to search.

రేటు పెడితే.. ఆడరంతే? ఐపీఎల్ లో ఇదో సంప్రదాయం

అయితే, ధర ఎంత పెడితే వారి ఆట అంత పతనం అవుతుందనేది ఐపీఎల్ చరిత్ర చెబుతున్న సత్యం.

By:  Tupaki Desk   |   2 April 2024 11:30 AM GMT
రేటు పెడితే.. ఆడరంతే? ఐపీఎల్ లో ఇదో సంప్రదాయం
X

పరిస్థితుల కారణంగానో, తప్పనిసరి అవడంతోనో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఒక్కో ఆటగాడిపై రూ.కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. పదేళ్ల కిందట ఫ్రాంచైజీలు ఒకరిని రూ.10 కోట్లకు తీసుకుంటే అదో పెద్ద వార్త. ఐదేళ్ల కిందట రూ.15 కోట్లు దాటితే ఇంకా పెద్ద కథనం. మరిప్పుడు ప్రస్తుత సీజన్ లో రూ.20 కోట్ల మార్క్ ను కూడా బీట్ చేశారు. అయితే, ధర ఎంత పెడితే వారి ఆట అంత పతనం అవుతుందనేది ఐపీఎల్ చరిత్ర చెబుతున్న సత్యం.

అంత రేటు అవసరమా?

ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ మేటి ఆటగాడే. కానీ, అతడి పేస్ పదును తగ్గుతూ వస్తోంది. అలాంటివాడిపై రూ.24.75 కోట్లు పెట్టింది కోల్ కతా నైట్ రైడర్స్. రెండు మ్యాచ్ లలో ఒక్క వికెట్ కూడా పడగొట్టని అతడు 100 పైగా పరుగులు ఇచ్చాడు. నిరుడు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ ను అత్యధికంగా రూ.18.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ తీసుకుంది. అయితే, ఆల్ రౌండర్ అయిన కరన్ 14 మ్యాచ్ లలో 276 పరుగులు మాత్రమే చేశాడు. 10 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.

నిరుడు రూ.17.5 కోట్లకు అమ్ముడుపోయాడు ఆసీస్ యువ ఆల్ రౌండర్ గ్రీన్. ముంబైకి ఆడిన ఇతడు 16 మ్యాచ్ లలో 452 పరుగులే చేశాడు. 6 వికెట్లు పడగొట్టాడు.

ఇటీవల కాలంలో ఆట కంటే వివాదాలతో వార్తల్లో ఎక్కువ నిలుస్తున్న ఇషాన్ కిషన్ ను ముంబై 2022లో రూ.15.25 కోట్లకు రిటైన్ చేసుకుంది. అంతకుముందు అతడి ప్రదర్శన బాగుండడంతో ఈ రేటు పెట్టింది. కానీ, 14 మ్యాచ్‌ లలో అతడు 418 పరుగులే చేశాడు. లీగ్ లో కిషన్ యావరేజ్ స్ట్రయిక్ రేటు 135. కానీ, 2022లో మాత్రం అది 120 దాటలేదు.

ఆట లేకున్నా ధర పెట్టి..

మూడేళ్ల కిందట దక్షిణాఫ్రికా ఆల్‌ రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ ను రాజస్థాన్‌ రాయల్స్‌ రూ.16.25 కోట్లకు దక్కించుకుంది. కొన్ని మెరుపు ఇన్నింగ్స్ లు చూసి ఈ ధర పెట్టింది. కానీ, మోరిస్ స్థాయికి ఇది చాలా ఎక్కువ మొత్తం. ఆల్‌ రౌండర్‌ గా 11 మ్యాచ్‌ లలో 15 వికెట్లు పడగొట్టిన అతడు బ్యాట్ తో 67 పరుగులే చేయడం గమనార్హం. ఓవర్ కు 9కి పైగా ఎకానమీతో పరుగులు ఇచ్చాడు.

కమ్మిన్స్ అప్పుడు ఇంతే..

ఆస్ట్రేలియాకు వన్డే ప్రపంచ కప్ అందించిన కమిన్స్‌ ను 2020లో

కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ రూ.15.50 కోట్లకు తీసుకుంది. బౌలింగ్ ఆల్ రౌండర్ అయిన అతడు 14 మ్యాచ్‌ లలో 12 వికెట్లే తీశాడు. 146 పరుగులే చేశాడు. ఈ సీజన్ లో రూ.20 కోట్ల పైగా ధర పలికిన తొలి ఆటగాడిగా కమ్మిన్స్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, తొలి మ్యాచ్ లో కీలక సమయంలో షాట్ కొట్టలేక జట్టు ఓటమికి కారణమయ్యాడు.

స్టోక్స్ తుస్..

ఇంగ్లాండ్‌ టెస్టు కెప్టెన్ బెన్‌ స్టోక్స్‌ ఎప్పుడూ తన ధరకు న్యాయం చేయలేదు. నిరుడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ.16.5 కోట్లకు తీసుకోగా.. రెండే మ్యాచ్‌ లు ఆడి గాయంతో దూరమయ్యాడు. 2017లో రూ.12.5 కోట్లకు కొన్న రాజస్థాన్‌ తరఫున 12 మ్యాచ్‌లాడి 316 పరుగులు చేసి, 12 వికెట్లు తీశాడు. 2018లో రైజింగ్‌ పుణె రూ.14.5 కోట్లకు తీసుకోగా. 13 మ్యాచ్‌ లలో 196 పరుగులు చేసి 8 వికెట్లే తీశాడు.

పదేళ్ల కిందట యువీ సైతం..

2014లో టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ను రూ.16 కోట్లకు అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తీసుకుంది. నాటికి అది భారీ ధర. కానీ, 14 మ్యాచ్ లలో యువీ 376 పరుగులే చేశాడు. 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. చిత్రం ఏమంటే.. 2015లో యువీని బెంగళూరు రూ.14 కోట్లకు కొనుక్కుంది. 248 పరుగులు చేసి, ఒక్క వికెట్టే తీశాడు.