క్రికెట్ మాజీ కెప్టెన్.. నాడు తీవ్ర వెన్నునొప్పి.. నేడు క్యాన్సర్
కెరీర్ తొలి రోజుల్లోనే అద్భుతమైన క్రికెటర్ గా పేరుతెచ్చుకున్న ఆస్ట్రేలియా ఆటగాడు.. చివరకు గొప్ప కెప్టెన్ గా ఎదిగాడు.
By: Tupaki Desk | 27 Aug 2025 12:37 PM ISTకెరీర్ తొలి రోజుల్లోనే అద్భుతమైన క్రికెటర్ గా పేరుతెచ్చుకున్న ఆస్ట్రేలియా ఆటగాడు.. చివరకు గొప్ప కెప్టెన్ గా ఎదిగాడు. టెస్టులు, వన్డేల్లో జట్టుకు ఎన్నో విలువైన విజయాలుం అందించాడు. అయితే, అంతర్జాతీయ కెరీర్ మొదట్లో ఉండగానే అతడికి తీవ్ర అనారోగ్యం ఉన్నట్లు బయటపడింది. అప్పట్లోనే కెరీర్ కొనసాగించడం కష్టమే అని భావించారు. కానీ, కోలుకున్న అతడు కెప్టెన్ అవడమే కాదు.. దేశానికి వన్డే ప్రపంచ కప్ కూడా అందించాడు. ఇప్పుడు కామెంటేటర్ గా స్థిరపడ్డాడు.
నాడు కోలుకుని ముందుకెళ్లి..
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ 2004లో భారత్ టూర్ ద్వారానే వెలుగులోకి వచ్చాడు. ఇదే అతడికి తొలి సిరీస్. అయితే, ఆడుతున్న మొదటి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లోనే అదీ విదేశీ గడ్డపై 151 పరుగుల భారీ సెంచరీ కొట్టి క్లార్క్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. భవిష్యత్ కెప్టెన్ అతడే అనే పేరు తెచ్చుకున్నాడు. ఆ దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో కొద్దికాలానికే తీవ్ర వెన్నునొప్పి బారినపడ్డాడు. అతడి కెరీర్ ప్రమాదంలో పడిన సందర్భం అది. కానీ, కోలుకుని మళ్లీ వచ్చిన క్లార్క్ అద్భుతంగా రాణించాడు. ఆస్ట్రేలియాకు 115 టెస్టుల్లో 8,643 పరుగులు చేశాడు. 245 వన్డేల్లో 7,981 పరుగులు సాధించాడు. 2015 వన్డే ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్. 74 టెస్టులు, 139 వన్డేల్లో కెప్టెన్ గా ఆసీస్ జట్టును నడిపించాడు. 2013-14లో ఆసీస్ జట్టు 5-0తో యాషెస్ సిరీస్ లో ఇంగ్లండ్ ను చిత్తు చేసింది.
మళ్లీ క్యాన్సర్....
క్లార్క్ తాజాగా తాను చర్మ క్యాన్సర్ బారినపడినట్లు తెలిపాడు. కెరీర్ మొదట్లో 2006లోనే అతడికి క్యాన్సర్ ఉందని ప్రకటించాడు. దాన్నుంచి కోలుకుని క్రికెట్లోకి వచ్చాడు. ఆస్ట్రేలియాలో చర్మ క్యాన్సర్లు చాలా ఎక్కువ. ఎందుకంటే భూమధ్య రేఖకు సమీపంలో ఉండే ఆ దేశంలో అతి నీలలోహిత (యూవీ) రేడియేషన్ స్థాయిలు ఎక్కువ. ఈ ప్రభావంతో మనుషులు చర్మ క్యాన్సర్ల బారినపడుతుంటారు. తాజాగా క్లార్క్ ముక్కు వద్ద కొంత చర్మాన్ని తొలగించారు. అందుకనే, ప్రజలు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని, చికిత్స కంటే నివారణ ఉత్తమం అని క్లార్క్ చెబుతున్నాడు. వ్యాధిని ముందుగా గుర్తించడం, రెగ్యులర్ చెకప్ లు తనకు ఎంతో మేలు చేశాయని అంటున్నాడు.
