బాక్సింగ్ లో మరో నిఖత్.. పతకాలు రాల్చిన ఆటోడ్రైవర్ కూతురు
స్ఫూర్తిదాయకమైన ఆమె ప్రయాణంలో తండ్రిది చాలా కీలకపాత్ర. అమ్మాయిలకు బాక్సింగ్ ఎందుకు? అంటూ ఎందరో నిరుత్సాహ పరిచినా నిఖత్ తండ్రి మాత్రం నిఖార్సుగా నిలిచారు.
By: Tupaki Desk | 19 Nov 2025 5:10 PM ISTతెలంగాణకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ ప్రస్థానం అందరికీ తెలిసిందే. స్ఫూర్తిదాయకమైన ఆమె ప్రయాణంలో తండ్రిది చాలా కీలకపాత్ర. అమ్మాయిలకు బాక్సింగ్ ఎందుకు? అంటూ ఎందరో నిరుత్సాహ పరిచినా నిఖత్ తండ్రి మాత్రం నిఖార్సుగా నిలిచారు. ఆమెను ప్రపంచ చాంపియన్ గా తీర్చిదిద్దారు. ఇప్పుడు అదే బాటలో ప్రయాణం సాగిస్తోంది ఓ అమ్మాయి. ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో సంచలనం రేకెత్తించింది. ఏకంగా ఫైనల్ కు చేరింది. ఇంతకూ ఆమె నేపథ్యం ఏమిటంటే.. ఓ సాధారణ ఆటో డ్రైవర్ కుమార్తె కావడం. జాతీయ రాజధాని ప్రాంతం పరిధి గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ప్రస్తుతం వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ జరుగుతోంది. ఇందులో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. వీరిలో అందరికంటే బాగా చెప్పుకోవాల్సింది మీనాక్షి హుడా గురించి. ఈమెనే 48 కేజీల విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది.
ఎవరీ హుడా..?
బాక్సింగ్ రింగ్ లో దడదడలాడిస్తున్న మీనాక్షి హుడా ఉత్తరాది అమ్మాయి. తండ్రి ఆటో డ్రైవర్ అయినా.. బాక్సర్ కావాలన్న తన కలను ఏమాత్రం నిరుత్సాహపరచలేదు. ఫలితంగా మీనాక్షి రింగ్ అద్భుతాలు సాధిస్తోంది. ఇదే టోర్నీలో అంకుష్ ఫంగల్, పర్వీన్, నుపుర్ కూడా ఫైనల్ చేరారు. దీంతో నాలుగు పతకాలు భారత్ ఖాతాలో పడనున్నాయి.
కొరియా అమ్మాయిని మట్టికరిపించి..
మీనాక్షి హుడా సెమీఫైనల్లో కొరియాకు చెందిన బాక్ చో రోంగ్ ను 5-0తో మట్టికరింపింది. ఈమె ధాటికి కొరియా యువతి నిలవలేకపోయింది. కాగా నుపుర్ మహిళల 80 కేజీల విభాగంలో ఉక్రెయిన్ బాక్సర్ మరియా లోవచిన్ స్కాపై గెలిచింది. పురుషుల విభాగంలో 80 కేజీల విభాగంలో పోటీపడిన ఫంగల్ కూడా ఆస్ట్రేలియా బాక్సర్ మార్లన్ సెవెహూన్ ను 5-0తో ఓడించాడు.
ఏడాదిన్నర తర్వాత అడుగుపెట్టి..
భారత్ కు చెందిన మాజీ ప్రపంచ చాంపియన్ అయిన అరుంధతి చౌదరి ఏడాదిన్నర తర్వాత అంతర్జాతీయ పోటీల్లోకి దిగింది. మూడుసార్లు ప్రపంచ చాంపియన్ గా నిలిచిన ఈమె..లియోనీ ముల్లర్ (జర్మనీ)ను ఓడించింది. ఇచ్చింది. నిరుడు జరిగిన పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్ లో ఓడిపోయిన అరుంధతీ... గాయం కారణంగా రింగ్ కు దూరమైంది.
-మరో భారత బాక్సర్ పర్వీన్ (60 కేజీల విభాగం).. పోలండ్ కు చెందిన ప్రపంచ బాక్సింగ్ కప్ రజత పతక విజేత రైగెల్స్కా అనేటా ఎల్జ్ బియోటాతో హోరాహోరీగా సాగిన పోరులో 3-2తో గెలిచింది. దీంతో ఈమె కూడా ఫైనల్ కు చేరింది. ఫైనల్ కు వెళ్లిన నలుగురు బాక్సర్లు కాక.. ఒలింపిక్స్ పతకం గెలిచిన ప్రీతి (54 కేజీలు).. మూడుసార్లు ప్రపంచ చాంపియన్ హువాంగ్ సియావో వెన్ తో తలపడనుంది. 75 కిలోల విభాగంలో స్వీటీ బూరా ఆస్ట్రేలియా అమ్మాయి ఎమ్మాసూ గ్రీటీని ఎదుర్కోవాల్సి ఉంది.
