టెన్నిస్ కోర్టులో ఆటగాడి అసభ్యం.. అసహనం.. 3వ వంతుపైగా ఫీజు ఫైన్
ఇప్పుడు జరుగుతున్న యూఎస్ ఓపెన్ లోనూ తొలి రౌండ్ లోనే పరాజయం పాలయ్యాడు. దీంతో అతడిలో అసహనం కట్టలు తెంచుకుంది.. మంచి ఊపులో ఉండగా కెమెరామన్ అడ్డురావడం లయ కోల్పోయేలా చేసింది..
By: Tupaki Desk | 28 Aug 2025 12:03 PM ISTఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్...టెన్నిస్ లోని నాలుగు గ్రాండ్ స్లామ్ లు.. అంతర్జాతీయ స్థాయిలో పెద్ద టోర్నీలు అంటే ఇవే.. వీటిలో ఒక్క టైటిల్ గెలిచినా ఆటగాళ్లకు మంచి పేరొస్తుంది. అతడు మంచి ప్లేయరే..! ప్రతిభ పరంగా చెప్పుకోవాలంటే టాప్-4లో ఉంటాడు. టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగానూ పరిగణిస్తుంటారు. కానీ, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ లో తొలి రౌండ్ లోనే ఓడిపోయాడు. ఇప్పుడు జరుగుతున్న యూఎస్ ఓపెన్ లోనూ తొలి రౌండ్ లోనే పరాజయం పాలయ్యాడు. దీంతో అతడిలో అసహనం కట్టలు తెంచుకుంది.. మంచి ఊపులో ఉండగా కెమెరామన్ అడ్డురావడం లయ కోల్పోయేలా చేసింది.. మ్యాచ్ లో అంపైర్ తీసుకున్న నిర్ణయం ఆగ్రహం తెప్పించింది.. చివరకు అతడికి రూ.37 లక్షల ఫైన్ పడింది.
ఎంత డ్రామానో...?
యూఎస్ ఓపెన్ తొలి రౌండ్ లో రష్యా ప్లేయర్ డాని మెద్వదేవ్ ఫ్రాన్స్ ఆటగాడు బెంజమిన్ బోంజి మధ్య జరిగిన మ్యాచ్ లో ఉత్కంఠతో పాటు చాలా డ్రామా నడిచింది. ఈ మ్యాచ్ లో 6-3, 7-5, 6-7 (5), 0-6, 6-4 తేడాతో మెద్వదేవ్ ఓడిపోయాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్ లో 13వ స్థానంలో ఉన్న మెద్వదేవ్... బోంజి తో మ్యాచ్ లో వరుసగా రెండు సెట్లు కోల్పోయాడు. కానీ, తర్వాత రెండు సెట్లు అద్భుతంగా పోరాడి గెలుచుకున్నాడు. ఫలితాన్ని తేల్చే ఐదో సెట్ హోరాహోరీగా సాగినా ఓటమి పాలయ్యాడు.
అసభ్య సైగలతో...
మెద్వదేవ్ మూడవ సెట్ లో పాయింట్ కు దగ్గరగా వచ్చిన సమయంలో ఫొటోగ్రాఫర్ అడ్డుగా వచ్చి ఆటంకం కలిగించాడు. దీంతో 6 నిమిషాలు ఆటను ఆపేశారు. తిరిగి మొదలయ్యాక బోంజికి సర్వీస్ ఇచ్చాడు చైర్ అంపైర్. దీంతో మెద్వదేవ్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంపైర్ తో వాదనకు దిగాడు. అయితే, ప్రేక్షకులు అతడిని హేళన చేయడం మొదలుపెట్టారు. మెద్వదేవ్ కూడా అరుస్తూ వారిని మరింత రెచ్చగొట్టాడు. 3, 4 వ సెట్ లు గెలచుకున్నాక మెద్వదేవ్ ప్రేక్షకులను ఉద్దేశించి అసభ్య సైగలు చేశాడు.
చివరకు ఓటమి తప్పలేదు...
ఈ ఏడాది చివరి గ్రాండ్ స్లామ్ లోనూ ఓడిపోవడం, అదీ తొలి రౌండ్ లోనే కావడంతో మెద్వదేవ్ లో నిరాశ ఆవహించినట్లుంది. ఒక్క గ్రాండ్ స్లామ్ కూడా లేకుండా వెనుదిరగడాన్ని తట్టుకోలేకపోయాడు. మ్యాచ్ అనంతరం అక్కడే రాకెట్ ను విరగ్గొట్టాడు. దీంతో అనుచిత ప్రవర్తనకు గాను అతడికి 42,500 డాలర్లు (రూ.37 లక్షలు) ఫైన్ పడింది. ఇంతకూ మెద్వదేవ్ తొలి రౌండ్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? 1.10 లక్షల డాలర్లు. అంటే, ఇందులోనే మూడో వంతుపైగా ఫైన్ పడింది.
