Begin typing your search above and press return to search.

సూపర్ ఫాస్ట్ బౌలర్ కు ఏమైంది..? ఆ గాయం తీవ్రమైనదేనా..?

ఒకప్పుడు భారత్ లో ఫాస్ట్ బౌలర్లు చాలా తక్కువ.. అందులోనూ సూపర్ ఫాస్ట్ బౌలర్లు అరుదు.. కేవలం 135-140 కిలోమీటర్లు వేగం మాత్రమే

By:  Tupaki Desk   |   8 April 2024 12:30 PM GMT
సూపర్ ఫాస్ట్ బౌలర్ కు ఏమైంది..? ఆ గాయం తీవ్రమైనదేనా..?
X

ఒకప్పుడు భారత్ లో ఫాస్ట్ బౌలర్లు చాలా తక్కువ.. అందులోనూ సూపర్ ఫాస్ట్ బౌలర్లు అరుదు.. కేవలం 135-140 కిలోమీటర్లు వేగం మాత్రమే. అదీ క్రమంతప్పకుండా కాదు. అయితే, గత రెండు దశాబ్దాల్లో ఈ పరిస్థితి మారింది. ఒక్కొక్కరుగా ఫాస్ట్ బౌలర్లు పుట్టుకొచ్చారు. 145 కిలోమీటర్లు పైగా వేగంతో బంతులేసే పేసర్లు మనకూ ఉన్నారనే చెప్పుకొనే పరిస్థితి కల్పించారు. ఇక నవదీప్ సైనీ, ఉమ్రాన్ మాలిక్ వంటి వారు వచ్చాక 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే సూపర్ ఫాస్ట్ బౌలర్లను కూడా భారత్ అందించగలదనే పేరొచ్చింది. ఇదంతా ఇలా ఉండగా.. నిలకడగా 155 కిలోమీటర్లకు మించి వేగం అందుకుంటూ బంతులను బుల్లెట్లుగా సంధించే పేసర్ కూడా వచ్చాడు. ఆడిన తొలి రెండు ఐపీఎల్ మ్యాచ్ ల్లోనే అద్భుత ప్రతిభ చూపి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.

ఇంతలోనే ఏమైంది..?

పేస్ బౌలర్లు అంటేనే గాయాలు. వారి శరీరంలో అవి భాగమా? అన్నట్లు ఉంటుంది పరిస్థితి. ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్ అయితే.. గాయం కారణంగా ఆరేళ్లు జట్టుకు దూరమయ్యాడు. ఇలాంటి వారు ఇంకా ఎందరో. కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో తన సూపర్ పేస్‌ తో అదరగొట్టాడు మయాంక్‌ యాదవ్. ఈ యువ ఫాస్ట్‌ బౌలర్ లక్నో సూపర్ జెయింట్స్ కు ఆడుతున్నాడు. 150 కి.మీ. పైగా వేగం ఇతడి సొంతం. 156 కి.మీ. వేగాన్ని కూడా అందుకున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 156.7 కి.మీ వేగంతో మయాంక్‌ బంతిని విసిరాడు. ఈ సీజన్‌లో ఇదే అత్యంత వేగం. అంతకుమందు పంజాబ్‌పై 155.8 కి.మీ వేగంతో బంతిని వేశాడు. అయితే, ఆదివారం గుజరాత్‌ తో మ్యాచ్‌లో ఒక్క ఓవర్‌ మాత్రమే వేశాడు. గాయం కారణంగా బయటకు వచ్చాడు. గత రెండు సీజన్లలో రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. రంజీ ట్రోఫీ సమయంలోనూ మయాంక్ గాయం తిరగబెట్టింది.

గాయం తీవ్రమైనదేనా?

మయాంక్ నిరుడే ఐపీఎల్ ఆడాల్సింది. కానీ, గాయం కారణంగా వీలు కాలేదు. ఈసారి మాత్రం వస్తూనే అదరగొడుతున్నాడు. రెండు నెలల్లో జరిగి వన్డే ప్రపంచ కప్ నకు ఎంపికలో పరిగణిస్తారనే పేరొచ్చింది. అయితే, ఇంతలోనే గాయం మాట వినిపించడం ఆందోళన కలిగిస్తోంది. కాగా, మయాంక్ యాదవ్ పక్కటెముకల గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. స్కానింగ్‌ తర్వాతనే గాయం పరిస్థితిపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. అతడి ఫ్రాంచైజీ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటనా రాలేదు.