Begin typing your search above and press return to search.

2011.. 2023.. కప్ తప్ప అంతా మారిపోయింది

12 సంవత్సరాలలో మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ మీడియా, ఓటీటీ అంతా మారిపోయింది. 2011 నాటికి మీడియా, టీవీ మాత్రమే ఉండగా.. ఇప్పుడు వెబ్ మీడియా దున్నేస్తోంది.

By:  Tupaki Desk   |   6 Oct 2023 4:30 AM GMT
2011.. 2023.. కప్ తప్ప అంతా మారిపోయింది
X

ఇప్పటివరకు 12 ప్రపంచ కప్ లు జరిగాయి.. ఆరు జట్లు విజేతగా నిలిచాయి. 13వ ప్రపంచ కప్ ను భారత్ నిర్వహిస్తోంది. మొత్తమీద నాలుగోసారి ఆతిథ్యం ఇస్తోంది. చివరగా 2011లో మనదగ్గర జరిగిన ప్రపంచ కప్ లోనే భారత్ విశ్వ విజేతగా ఆవిర్భవించింది. ఆపై 2013లో చాంపియన్స్ ట్రోఫీ నెగ్గింది. కానీ, పదేళ్లుగా ఐసీసీ టోర్నీల్లో కప్ కొట్టలేకపోతోంది. దీనికి కొంత బ్యాడ్ లక్ కూడా కారణమే అనుకోవాలి. ఈ లోటును ప్రస్తుత ప్రపంచ కప్ తీరుస్తుందని భారత అభిమానులు ఆశ పడుతున్నారు.

నాటికి , నేటికి ఎంత తేడా?

2011లో భారత్ ప్రపంచ కప్ నిర్వహించే నాటికి ఇప్పటికి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. అంతెందుకు..? 2019 నాటి కప్ నకూ ఇప్పటికే చాలా మారింది. అయితే, మనం సరిపోల్చుతున్నది భారత్ ఆతిథ్యం ఇచ్చిన 2011 నాటి కప్ గురించి కాబట్టి అప్పటికి ఇప్పటికి తేడానే మాట్లాడుకుందాం.. ఈ ప్రకారం చూస్తే.. గత 12 సంవత్సరాలలో మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ మీడియా, ఓటీటీ అంతా మారిపోయింది. 2011 నాటికి మీడియా, టీవీ మాత్రమే ఉండగా.. ఇప్పుడు వెబ్ మీడియా దున్నేస్తోంది. ఓటీటీ, సోషల్ మీడియా రాజ్యమేలుతున్నాయి.

ఇంటర్నెట్ విప్లవంతో..

భారత్ లో 2016 నుంచి ఇంటర్నెట్ విప్లవం మొదలైంది. 2011 ప్రపంచ కప్ నాటికే ఇంటర్ నెట్ ఉన్నప్పటికీ.. ఇంత వేగంగా, తక్కువ ధరకు లేనే లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే అప్పుడు 2జి. ఇప్పుడు 5జి. కాగా, 2016 నుంచి భారత్ లో ఇంటర్ నెట్ అందరికీ చేరువైంది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండేందుకు ఇది కారణమైంది.

ఓటీటీలు వచ్చేశాయి..

గత పదేళ్లలో వెబ్ మీడియా రీడర్స్ పెరిగిపోయారు. ఐదేళ్లుగా ట్యూబ్ మీడియా కూడా దూసుకొచ్చింది. ఇప్పడు ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. క్రికెట్ మ్యాచ్ లు చూడాలంటే ఒకప్పుడు టీవీలలో మాత్రమే అవకాశం ఉండేది. కానీ, ఓటీటీల రాకతో ఇప్పడు చేతిలోని స్మార్ట్ ఫోన్ నుంచి ఎక్కడ ఉండైనా చూసేందుకు వీలు కలుగుతోంది. వెబ్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తెలుసుకునేందుకు అవకాశం చిక్కుతోంది.