Begin typing your search above and press return to search.

ఐపీఎల్ వేలంలో లొసుగులు... డీకే రెండు పరిష్కారాలు!

ఈ సమయంలో ఐపీఎల్ మినీవేలంలో లొసుగులు ఉన్నాయంటూ టీం ఇండియా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   21 Dec 2023 8:05 AM GMT
ఐపీఎల్  వేలంలో లొసుగులు... డీకే రెండు  పరిష్కారాలు!
X

క్రికెట్ ఫ్యాన్స్ లో ఐపీఎల్ సందడి అప్పుడే మొదలైపోయింది. ఇప్పటికీ మినీ వేలం పూర్తవడంతో ఏయే జట్లలో ఎవరెవరు ఉన్నారనే క్లారిటీ వచ్చేసింది. ఇదే సమయంలో చాలా జట్లలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. వరల్డ్ కప్ అనంతరం జరుగుతున్న ఐపీఎల్ కావడంతో.. అక్కడ సత్తా చాటిన వారు మినీవేలంలో రికార్డ్ ధరలు పలికారు. ఈ సమయంలో ఐపీఎల్ మినీవేలంలో లొసుగులు ఉన్నాయంటూ టీం ఇండియా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో పరిష్కారాలు కూడా సూచించారు.

అవును... తాజాగా ముగిసిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ - 2024 మినీ వేలంలో ఆసీస్‌ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్‌, ప్యాట్ కమిన్స్ రికార్డ్ ధరలు పలికిన సంగతి తెలిసిందే. ఇందులో ఆసిస్ కు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ కమిన్స్ రూ.20.5 కోట్లు దక్కించుకోగా... ఆసిసి పాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ రూ. 24.75 కోట్లు దక్కించుకుని సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఈ విషయంపై టీం ఇండియా మాజీ ప్లేయర్ దినేశ్‌ కార్తిక్‌ ఆసక్తికరంగా స్పందించాడు.

తాజా మినీవేలంలో ఆసిస్ ఆటగాళ్లు రికార్డ్ స్థాయిలో ధర పలకడంపై స్పందించిన దినేష్ కార్తీక్.. మినీ వేలంలోని లొసుగులను వినియోగించుకుని విదేశీ ఆటగాళ్లు ఇంత భారీ మొత్తంలో సొంతం చేసుకున్నారని, ఇలాంటి ట్రెండ్‌ ఏమాత్రం మంచిది కాదని పేర్కొన్నాడు. ఇదే సమయంలో.. ఇలాంటి భారీ మొత్తాలను సంపాదించేందుకు వారు, వారి ఏజెంట్లు తెలివిగా వ్యవహరించారని వ్యాఖ్యానించాడు.

ఈ సందర్భంగా ట్విట్టర్ లో స్పందించిన డీకే... నేరుగా మినీ వేలానికి వచ్చే ఆటగాళ్లకు తాను పెద్ద ఫ్యాన్‌ కాదని తెలిపారు. ఇదే సమయంలో... వేలంలోని లొసుగులను పట్టుకుని విదేశీ ఆటగాళ్లు, వారి ఏజెంట్లు తమ తెలివితేటలను చక్కగా వాడారని అన్నారు. ఇందులో భాగంగా... మెగా వేలంలోకి కాకుండా, మినీ వేలంలోకి వచ్చి భారీ ధర దక్కేలా చేయడంలో విజయవంతమయ్యారని తెలిపారు.

ఈ సమయంలో బీసీసీఐ ఇలాంటి సమస్యను అదుపు చేయగలదని భావిస్తున్నట్లు తెలిపిన డీకే... ఆ సమస్యల కోసం తాను రెండు పరిష్కారాలను చెబుతున్నట్లు పేర్కొన్నాడు. దానికోసం తన తాజా వీడియోను చూడమని సూచించాడు.

డీకే ఇచ్చిన పరిష్కారాలివే..!:

ఐపీఎల్ వేలంలో భారీ ధర ట్రెండింగ్‌ ను అదుపులో ఉంచేందుకు తాను రెండు పరిష్కారాలు సూచిస్తున్నాను అని మొదలుపెట్టిన దినేష్ కార్తీక్... అందులో మొదటిగా... ఏ ఆటగాడైనా సరే మినీ వేలంలోకి రావాలనుకుంటే.. అంతకంటే ముందు మెగా వేలంలో అతడు దక్కించుకున్న సొమ్మునే గరిష్ఠ పరిమితిగా పెట్టాలి. ఫలితంగా... సదరు ఫ్రాంచైజీ అతడిని కొనసాగించే అవకాశం ఉంటుంది. అలాకానిపక్షంలో... ఇలాంటి అనూహ్యమైన ధరలు సొంతం చేసుకునే అవకాశం ఉండదని అన్నారు.

ఇక రెండోదిగా.. మెగా వేలంలో కాకుండా.. మినీ వేలంలోకి వచ్చిన ఆటగాడు భారీ ధరను దక్కించుకున్నాడనుకుంటే.... అప్పుడు ఆ జట్టులోని ఖరీదైన ఆటగాడికి ఎంత సొమ్ము చెల్లిస్తారో.. అంతే మొత్తం మినీ వేలం ద్వారా వచ్చిన ఆ ఆటగాడికి చెల్లించాలి. ఇక మిగిలిన మొత్తాన్ని సదరు ఫ్రాంచైజీలు బీసీసీఐకి ఇచ్చేయాలి. అని దినేశ్‌ కార్తిక్‌ వెల్లడించాడు. దీంతో... తాజా ఐపీఎల్ మినీవేలంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.