Begin typing your search above and press return to search.

మెస్సీ చేతుల్లో స్నానం చేసిన చిన్నారి... నేడు ప్రపంచ ఫుట్‌బాల్‌ను ఊపేస్తున్న లామిన్ యమాల్.. బ్యాక్ గ్రౌండ్ ఇదీ

ఈ ఫొటో వెనుక ఉన్న అసలు కథ.. ఆ చిన్నారి ఎవరో తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాల్సిందే..

By:  A.N.Kumar   |   16 July 2026 12:10 PM IST
మెస్సీ చేతుల్లో స్నానం చేసిన చిన్నారి... నేడు ప్రపంచ ఫుట్‌బాల్‌ను ఊపేస్తున్న లామిన్ యమాల్.. బ్యాక్ గ్రౌండ్ ఇదీ
X

ఫుట్‌బాల్ ప్రపంచంలో కొన్ని సంఘటనలు చూస్తే "విధి రాసిన వింత కథ" అనిపించక మానదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో క్రీడా ప్రపంచంలో ఒక అరుదైన ఫొటో విపరీతంగా హల్ చల్ చేస్తోంది. ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ.. ఓ చిన్నారికి ప్లాస్టిక్ టబ్‌లో ఎంతో అపురూపంగా స్నానం చేయిస్తున్న దృశ్యం అది. ఇది ఎలాంటి ఎడిటింగ్ లేదా ఏఐ సృష్టించిన చిత్రం కాదు.. 100 శాతం నిజమైన ఫొటో. ఈ ఫొటో వెనుక ఉన్న అసలు కథ.. ఆ చిన్నారి ఎవరో తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాల్సిందే..




ఆ ఫొటో వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటి?

ఈ అరుదైన ఘటన 2007 డిసెంబర్‌లో జరిగింది. అప్పట్లో బార్సిలోనా క్లబ్, స్పానిష్ పత్రిక 'డైరియో స్పోర్ట్' కలిసి యునిసెఫ్ స్వచ్ఛంద సంస్థ కోసం ఒక ఛారిటీ క్యాలెండర్ ఫొటోషూట్‌ను నిర్వహించాయి. అప్పటికి మెస్సీ వయసు కేవలం 20 ఏళ్లు. బార్సిలోనా జట్టులో ఎదుగుతున్న ఒక నవ యువ స్టార్‌గా అతను ఉన్నాడు. అదే సమయంలో స్పెయిన్‌లోని మటారో నగరంలో నివసిస్తున్న ఒక సాధారణ కుటుంబం ఈ ఛారిటీ లక్కీ డ్రాలో విజేతగా నిలిచింది. ఆ డ్రా బహుమతి ఏంటంటే.. బార్సిలోనా ఆటగాడితో కలిసి ఫొటో దిగే అవకాశం. అలా ఆ అదృష్టం ఆ కుటుంబాన్ని నేరుగా మెస్సీ వద్దకు తీసుకెళ్లింది. ఆ ఫొటోషూట్‌లో భాగంగా మెస్సీ చేతుల్లోకి వచ్చిన ఆరు నెలల పసికందు మరెవరో కాదు.. నేడు ప్రపంచ ఫుట్‌బాల్‌ను శాసిస్తున్న లామిన్ యమాల్. ఆ సమయంలో ఒక సాధారణ ఫొటోషూట్‌గా మిగిలిపోయిన ఈ చిత్రం.. భవిష్యత్తులో ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత భావోద్వేగభరితమైన జ్ఞాపకంగా మారుతుందని అక్కడున్న ఎవరూ ఊహించి ఉండరు.




ఎవరీ లామిన్ యమాల్? బ్యాక్ గ్రౌండ్ ఇదీ..

జులై 13, 2007న స్పెయిన్‌లో జన్మించిన లామిన్ యమాల్ తండ్రి మొరాకో దేశస్థుడు కాగా, తల్లి ఈక్వటోరియల్ గినియాకు చెందిన మహిళ. పేదరికంలో పెరిగిన యమాల్‌కు చిన్నతనం నుంచే ఫుట్‌బాల్ అంటే ప్రాణం. అతనిలోని అసాధారణ ప్రతిభను గుర్తించిన బార్సిలోనా క్లబ్, తమ ప్రసిద్ధ 'లా మాసియా' అకాడమీలో అతనికి చోటు కల్పించింది.




మెస్సీ ఏ అకాడమీ నుంచి అయితే ప్రపంచ ఛాంపియన్‌గా ఎదిగాడో అదే అకాడమీ నుంచి యమాల్ కూడా శిక్షణ పొందడం విశేషం. కేవలం 15 ఏళ్ల వయసులోనే బార్సిలోనా సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసి.. ఆధునిక ఫుట్‌బాల్‌ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

రికార్డుల వేట.. మెస్సీతో పోలికలు

ఇటీవల జరిగిన యూరో కప్ టోర్నమెంట్‌లో స్పెయిన్ జట్టు తరఫున ఆడిన యమాల్.. తన అద్భుతమైన డ్రిబ్లింగ్, వేగం, గోల్స్ చేసే నైపుణ్యంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. టోర్నమెంట్‌లో అత్యంత పిన్న వయసులో గోల్ కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. తన 17వ పుట్టినరోజుకు ఒక రోజు ముందే స్పెయిన్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. యమాల్ ఆటతీరును చూసి చాలామంది అతన్ని "నెక్స్ట్ మెస్సీ" అని పిలుస్తున్నారు. అయితే యమాల్ మాత్రం "మెస్సీతో పోల్చడం గౌరవంగా ఉన్నప్పటికీ నేను నాదైన శైలిలో కొత్త చరిత్ర రాయాలనుకుంటున్నాను" అని వినయంగా చెబుతుంటాడు.

కాలం రాసిన అద్భుత కావ్యం

ఏళ్ల తర్వాత యమాల్ తండ్రి ఈ పాత ఫొటోను సోషల్ మీడియాలో "రెండు లెజెండ్స్ ఆరంభం" అనే క్యాప్షన్‌తో పంచుకోవడంతో ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. నాడు మెస్సీ చేతుల్లో స్నానం చేసిన ఆ పసికందు.. నేడు అదే మెస్సీ వదిలివెళ్లిన బార్సిలోనా క్లబ్ వారసత్వాన్ని భుజాన వేసుకుని నడిపిస్తుండడం నిజంగా కాలం చేసిన ఒక గొప్ప మేజిక్. ఈ ఫొటో ఇప్పుడు ప్రపంచ ఫుట్‌బాల్ ప్రేమికులకు ఒక మధురమైన, మర్చిపోలేని అనుభూతిని మిగుల్చుతోంది.